మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై పలువురి విమర్శలు ఇలా..
posted on Aug 3, 2016 @ 5:36PM
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకించిన కొంతమంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు భూసేకరణ జీవో 123 కొట్టేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారు. జీవో కొట్టివేతపై పలువురి స్పందనలు ఇలా..
ప్రొఫెసర్ కోదండరాం..
టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం జీవో కొట్టివేతపై స్పందించి తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేశారు. భూ సేకరణ జీవో 123 ను హైకోర్టు కొట్టివేయడంపై టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న జీవోలను తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పే వస్తుందని ఊహించానని అన్నారు. బలవంతపు భూసేకరణకు సాధనంగా 123 జీవోను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుందని విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని, ప్రభుత్వం తన బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించాలని కోదండరాం సూచించారు.
డీకే అరుణ..
కాంగ్రెస్ నేత డీకే అరుణ స్పందించి జీవో 123ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. హైకోర్టు తీర్పు మల్లన్నసాగర్ రైతుల విజయమని అన్నారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలు విడనాడి, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా ప్రభుత్వం చూడాలని ఆమె హితవు పలికారు. హేతుబద్ధమైన భూసేకరణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి..
టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు జీవో 123ను కొట్టివేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పినట్టు అయింది. ప్రభుత్వం తప్పును హైకోర్టు సరిదిద్దిందని అన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే...తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని.. పోరాటానికి సైతం దిగుతామని హెచ్చరించారు.
హరీశ్ రావు..
ఇంక తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సర్వసాధారణమని.. 123 జీవో కొట్టివేతపై హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాత మాట్లాడతానని అన్నారు.