ఔరా అనిపించుకున్న మేరీ కోమ్... సచిన్ కూడా వస్తే బావుంటుంది..
posted on Aug 3, 2016 @ 3:16PM
పార్లమెంట్ ఉభయ సభల్లో పలు రకాల నేతలు ఉంటారు. వారిలో క్రీడారంగానిక చెందిన నేతలు కూడా ఉన్నారు. ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఇంకా ఇటీవలే రాజ్యసభ బాధ్యతలు స్వీకరించిన బాక్సర్ మేరీ కోమ్ కూడా ఉన్నారు. అయితే వీరిలో సిద్దూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ పిచ్ లో ఉన్నప్పుడు సిక్స్ లు కొట్టినట్టే ఆయన మాటలు కూడా అంత షార్ప్ గా ఉంటాయి. మాటలతోనే ప్రతిపక్ష నేతలతో నీళ్లు తాగిస్తారు.
ఇక సచిన్ టెండూల్క్ర్ గురించి చెప్పాలంటే ఆయన సభకు పెద్దగా వచ్చిందే లేదు. ఎన్నికైన తర్వాత మూడేళ్లకు గాని ఓ ప్రశ్నను సంధించలేకపోయారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు శాతంలోనే ఆయన వెనుకబడిపోయారు. అయితే ఇప్పుడు బాక్సర్ మేరీ కోమ్ మాత్రం బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే సభలో తొలి ప్రశ్న వేసి ఆమె అందరిచేత ఔరా అనిపించుకున్నారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ ఈవెంట్లకు వెళ్లే భారత క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని.. శిక్షణా సమయాల్లోనూ క్రీడాకారులకు అవసరమైన మేర పోషకాహారాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్. క్రీడాకారులపై మరింత శ్రద్ధ పెడతామని ప్రకటించారు. దీంతో సచిన్ కూడా అప్పుడప్పుడు సభకు వస్తే బావుంటుందని పలువురు కామెంట్లు విసురుతున్నారు.