అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ.. జయలలితే కారణమట..!
posted on Aug 3, 2016 @ 10:52AM
త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నికల బరిలో దిగటానికి కారణం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితేనట.. ఆమె నుండి స్ఫూర్తి పొందిన జయలలిత ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారట. అవునా..? నిజమా..? అనుకుంటున్నారా. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని.. ఆ పార్టీ నేతలు మాత్రం అలాగే చెబుతున్నారు. మామూలుగానే జయలలిత అంటే పార్టీ నేతలకు కాస్త భక్తి ఎక్కువే. అలాంటి నేపథ్యంలో కూనూరు ఎమ్మెల్యే రాము అసెంబ్లీలో జయలలిత గురించి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో గెలిచి మొట్ట మొదటి మహిళగా రికార్డ్ సాధిస్తారని.. ఆమె విజయానికి కారణం పురచ్చితలైవి అమ్మ అని ప్రశంసించారు. 2011లో అమెరికాకు విదేశాంగ మంత్రిగా ఉంటూ చెన్నైకి వచ్చిన వేళ, జయలలిత పాలన చూసిన హిల్లరీ ఎంతో స్ఫూర్తిని పొందారని, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్నారని రాము వ్యాఖ్యానించారు. అయితే రాము వ్యాఖ్యలు విన్న పార్టీ నేతలు ముందు కాస్త విస్తుపోయినా.. ఆతరువాత బల్లలు చరుస్తూ మద్దతు పలకాల్సి వచ్చింది. మొత్తానికి జయలలితపై పార్టీ నేతలకు ఉండాల్సిన భక్తి కంటే కాస్త ఎక్కువైనట్టే కనిపిస్తోంది. మరి హిల్లరీకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో..