మీడియా ముందుకు ఉమా మాధవరెడ్డి.. నేను తప్పు చేస్తే జైలుకు వెళ్తా
posted on Aug 11, 2016 @ 12:25PM
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే. అయితే నయీం హత్యానంతరం.. పలువురు ప్రముఖుల పేర్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి తెరపైకి వచ్చారు. నయీం కేసుకు సిట్ బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఉమా మాధవరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించిన ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె... మాధవరెడ్డికి ఉన్న పేరు చెడగొట్టేందుకు ప్రభుత్వం కక్ష కట్టింది.. మా కుటుంబానికి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. నా ఫోన్ నుండి వందల కాల్స్ వెళ్లాయని దుష్ర్పాచారం చేస్తున్నారు.. మాధవరెడ్డి ఉన్నప్పటినుండి ఒకటే ఫోన్ నెంబర్.. కాల్ డేటా ఉంటే బయటపెట్టాలి.. నేను తప్పు చేస్తే జైలుకు వెళ్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎంత సేవ చేశామో మాకు తెలుసు.. గ్యాంగ్ స్టర్ లను ప్రోత్సహించే పరిస్థితి మాకు లేదు.. నేరాలు చేయాల్సిన అవసరం మాకు లేదు.. కొందరిని తప్పించడానికే మాపై ఆరోపణలు.. ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ జరపాలి.. నాపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి అని అన్నారు.