చెంచా గాడిద పాలు ఎంతో తెలుసా..?
posted on Aug 11, 2016 @ 5:40PM
గంగి గోవు పాలు గరిటడైనా చాలు.. కరము పాలు కడవనేలా అన్న సామెత వినే ఉంటాం.. అయితే ఇప్పుడు మాత్రం గాడిద పాలు చాలా మంచిదని.. వాటిని ఇంటింటికీ తిరిగి అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కోలార్ కు చెందిన క్రిష్ణప్ప అనే వ్యక్తి తన గాడిద అయిన లక్ష్మీని వెంటపెట్టుకొని వీధి వీధి తిరుగుతూ గాడిద పాలు అమ్ముతున్నాడు. కానీ రేటు వింటే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఒక స్పూన్ రూ. 50 కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే రేటు కూడా ఎవరూ పట్టించుకోకుండా పాలు కొని తమ పిల్లలకి తాగిస్తున్నారు. గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని.. ఆస్తమా, జలుబు, దగ్గు తగ్గుతాయని అంటున్నారు. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో పనిచేస్తున్న జయప్రకాష్ మాట్లాడుతూ గాడిద పాలు... మనిషి పాలలాగే ఉంటాయని.. యాంటీ బ్యాక్టిరియా గుణాలతో పాటూ రోగ నిరోధక శక్తిని కలిగిస్తుందని చెప్పారు. పూర్వం గ్రామాల్లో చంటి పిల్లలకు తల్లి పాలకు బదులు గాడిద పాలు పట్టేవారని తెలిపారు.