దేవినేని నెహ్రూ ఇంట్లో లోకేశ్.. నెహ్రూ ఫిక్స్ అయినట్టేనా..!
posted on Aug 11, 2016 @ 1:20PM
కృష్ణా జిల్లాలో రాజకీయ అతిరథులు దేవినేని నెహ్రూ పార్టీని వీడనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. కాంగ్రెస్ పార్టీని వీడీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న్టటు గత వారం రోజుల నుండి రాజకీయవర్గాల్లో ఒకటే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు దేవినేనితో చర్చలు జరిపారని కూడా సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించిన నెహ్రూ.. టీడీపీ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నది నిజమేనని.. కానీ తాను మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. ఇక దీంతో ఆ ఊహాగానాలు తెరపడిందిలే అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు తాజాగా మరో విషయం బయటపడింది.
స్వయంగా దేవినేని ఇంట్లోనే టీడీపీ నేతలు అతనితో బేటీ అయ్యారు. టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇంకా దేవినేని ఉమా, కేశినేని నాని ఈ భేటీలో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టైంది. దేవినేని నెహ్రూ, అతని తనయుడు అవినాష్ లు టీడీపీ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. రాజకీయ ఉద్దండుడు కావడంతో ఆయనను టీడీపీలోకి తీసుకురావడానికి నేతలందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఆయన కనుక పార్టీలోకి వస్తే జిల్లా అభివృద్దికి మరింత ప్రాభల్యం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇక నెహ్రూ చేరికకు సీఎం చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి నారా లోకేశ్ భేటీ నేపథ్యంలో ఇక టీడీపీ ఎంట్రీకి మూహూర్తం ఖరారు చేయడమే అంటున్నారు రాజకీయ పెద్దలు. మరి అన్నీ కుదిరితే ఈ పుష్కరాలు అయిపోయిన తరువాత నెహ్రూ టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
కాగా దేవినేని నెహ్రూ ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగారు. పార్టీ చీలిక పరిణామాల్లో ఎన్టీఆర్‌వైపు ఉన్న ఆయన తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.