ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబే..
posted on Aug 12, 2016 @ 10:34AM
గత నాలగు రోజుల క్రితం మంత్రుల ఆస్తుల వివరాల గురించిన నివేదిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ఏపీ మంత్రి నారాయణ మొదటి స్థానంలో నిలిచిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రుల ఛాన్స్ వచ్చింది. ఈ నివేదికలో కూడా ఏపీకే మొదటిస్థానం దక్కడం విశేషం. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఇడబ్ల్యు) దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల గురించి జరిపిన అధ్యయనంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికన్నా ధనవంతుడని తేలింది. ఆ తరువాత స్థానాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆక్రమించారు. ఇక మూడో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సొంత చేసుకున్నారు.
కాగా తాజాగా గత ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఆ ప్రకారం చంద్రబాబునాయుడుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్తులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. సిఎం పెమా ఖండుకు 129 కోట్ల 57 లక్షల 56 వేల 014 రూపాయల ఆస్తులున్నాయి. జయలలితకు 113 కోట్ల 73 లక్షల 38 వేల 586 రూపాయల ఆస్తులున్నాయని నివేదిక తేల్చింది.