అధికారులకు చంద్రబాబు వార్నింగ్.. అలక్ష్యం ఉండకూడదు
posted on Aug 13, 2016 @ 1:22PM
కృష్ణ పుష్కరాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన మొదటి రోజు భక్తులు తాకిడి కాస్త తక్కువగా ఉన్నా ఈరోజు మాత్రం పుష్కర స్నానాలతో ఘాట్లు కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా పుష్కరాల రెండో రోజు ఏర్పాట్లపై 1020 మంది అధికారులు, సిబ్బందితో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కృష్ణా పుష్కరాల విధి నిర్వహణలో అలక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని.. పవిత్ర భావనతో పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నందున, వచ్చిన యాత్రికులు అందరినీ సంతృప్తిగా పంపాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు హోంగార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది అంతా ఒక్కచోటే కాకుండా అన్ని ప్రాంతాలకు వెళ్లి అన్ని చోట్ల పారిశుద్ధ్యం మెరుగు పరచటంతో పాటు నీళ్లలో వ్యర్థాలు తొలగించేందుకు వలలు వినియోగించాలన్నారు. ప్రతిఘాట్ వద్ద వాటర్‌లెవల్ ఇండికేటర్లు ఉపయోగించాలి. నీటిమట్టం లోతు అందరికీ తెలిస్తేనే స్నానానికి ఘాట్‌లో దిగే యాత్రీకులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.