కొడుకు సర్కార్ పైనే ములాయం సంచలన వ్యాఖ్యలు..
posted on Aug 16, 2016 @ 12:43PM
సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేయడం కామన్. తమ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఎన్ని లొసుగులు ఉన్నా పక్క పార్టీలపై దుమ్మెత్తిపోస్తుంటారు రాజకీయ నేతలు. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ అధికారపార్టీ అధినేత ములాయం సింగ్ సొంత పార్టీపైన.. తన కొడుకు అఖిలేశ్ యాదవ్ సర్కారుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన అధికార పార్టీ ప్రభుత్వ తీరును ప్రస్తావిస్తూ.. పార్టీలో తన మాటను తన సోదరుడు శివపాల్ మాత్రమే వింటాడని అన్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. తాను రంగంలోకి దిగితే ప్రభుత్వానికి అసలు సంగతేంటో అర్థమవుతుందని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీంతో ములాయం వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బహిరంగగానే కొడుకు తీరును తప్పుబట్టిన ములాయం సింగ్ ముందు ముందు ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారో అని అనుకుంటున్నారు.
కాగా త్వరలో యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే అధికారపార్టీ పైన తీవ్రస్థాయిలో వ్యతిరేకత నడుస్తున్న వేళ ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదించారు. దీనికి అఖిలేశ్ యాదవ్ నో చెప్పారు. ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ అఖిలేశ్ కు అండగా నిలిచారు. దీంతో ఈ వ్యవహారం చిక్కుముడిగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళ.. ఒంటెద్దు పోకడల్లో పోతున్న విషయాన్ని పార్టీ చీఫ్ ములాయం దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారు అన్న వాదన కూడా వినిపిస్తోంది.