పాక్ కు మంటపుట్టించేలా మోడీ వ్యాఖ్యలు..
posted on Aug 16, 2016 @ 3:47PM
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరిలా తాను ఏదో ఒక పేపర్ మీద రాసుకొని.. దానిని అక్షరం పొల్లు పోకుండా చదివేసి.. ఏదో పని అయిపోయింది కదా అని కూర్చునే వ్యక్తి కాదు మోడీ. తాను ప్రసంగం చేయడానికి మాటలు వెతుక్కోవాల్సిన పనిలేదు. ప్రసంగిస్తున్నంత సేపు మాటల ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది. ఈసారి కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మోడీ తన ప్రసంగం చేశారు. ఏదో 5 నిమిషాలో.. 10 నిమిషాలో కాదు ఏకంగా రెండు గంటలపాటు ప్రసంగం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఈ ప్రసంగంలో ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వారికి మంటపుట్టించారు. మన దేశంలో ఉన్న మానవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఓ ఉదాహరణ కూడా చెప్పారు.
‘‘పాకిస్థాన్లోని పెషావర్ స్కూల్లో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు.. ఎంతోమంది అమాయకపు చిన్నారులు బలయ్యారు. ఆ చిన్నారుల మృతికి మన దేశమైన భారత్ ఎంతో చలించిపోయింది. అంతేకాదు దేశంలోని పలు స్కూళ్లలోని చిన్నారులు కంటతడి పెట్టారు.. ప్రతి విద్యార్థి బాధపడ్డాడు. అదీ మానవత్వం అంటే. కానీ.. అక్కడ (పాకిస్థాన్ ను ఉద్దేశించి) ఉగ్రవాదులను కీర్తిస్తున్నారు. భారత్ లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. అక్కడ వేడుకలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని.. అక్కడి ప్రభుత్వాన్ని ఏమనాలి?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. బలోచిస్థాన్.. గిల్గిత్.. బల్తిస్థాన్ వంటి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలు తమపై ఎంతో ప్రేమను ప్రదర్శిస్తున్నారని.. తాను వారి దగ్గర లేకున్నా.. వారిని కలిసే అవకాశం లేకున్నా.. అక్కడి ప్రజలు తన పట్ల ప్రేమ.. అభిమానం.. గౌరవాన్ని చూపిస్తున్నారని.. అన్నారు. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు పాక్ కు మంటపుట్టించేవిగా ఉన్నాయని..పాక్ కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని అందరూ అంటున్నారు. మరి మోడీ చేసిన వ్యాఖ్యలు పాక్ విన్నదో లేదో..!