ట్రంప్ కు అమెరికా యువత షాక్... మాకు వద్దే వద్దు
posted on Aug 16, 2016 @ 11:38AM
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అలాగే ఆయనపై విమర్శలు రావడం కూడా కామనే. ఇప్పటికే చాలామంది అమెరికాకు ట్రంప్ కనుక అధ్యక్షుడు అయితే.. దేశం సర్వనాశనం అయినట్టే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ట్రంప్ ఆశలపై నీళ్లు పోసినట్టైయింది. ఎందుకంటే యువత ఓట్లపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు నిరాశగానే మిగిలేలా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
బెర్నీ సాండర్స్ మద్దతుదారుల్లో ఎక్కువ మంది యువతే ఉన్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీపడి బెర్నీ సాండర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిని తమవైపు తిప్పుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఎత్తులు ఫలించేట్టు కనిపించడంలేదు. తాజాగా జరిపిన పోల్ సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది. 35 ఏళ్ల వయస్సులోపు ఉన్న అమెరికా ఓటర్లలో 56శాతం మంది హిల్లరీకే తమ ఓటు అని యూఎస్ఏ టుడే/రాక్ ద ఓటర్ పోల్ లో స్పష్టం చేశారు. కేవలం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే ట్రంప్ కు అండగా నిలబడ్డారు. బెర్నీ మద్దతుదారుల్లో 72శాతం మంది హిల్లరీకి అండగా నిలువగా, కేవలం 11శాతం మందే ట్రంప్ కు మద్దతునిస్తున్నట్టు పోల్ తెలిపింది.