జర్నలిస్ట్‌ సవాల్ కు సెహ్వాగ్ అదిరిపోయే రిప్లై..

  భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కు, బ్రిటిష్‌ జర్నలిస్ట్‌ పియర్స్‌ మోర్గాన్‌కి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. రియో ఒలిపింక్స్ నేపథ్యంలో మొదలైన వీరిద్దరి మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోసారి పియర్స్‌ మోర్గాన్‌ సెహ్వాన్ కు ట్వీట్ ద్వారా సవాల్ విసరగా..దానికి సెహ్వాగ్ కూడా దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటారా..?   ‘నేను రూ.10లక్షలు పందెం కాస్తాను. భారతదేశం మరో ఒలింపిక్‌ స్వర్ణం గెలిచేలోపు ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌  నెగ్గుతుంది. సవాల్‌కి సిద్ధమేనా’ అంటూ ట్వీట్‌ చేశాడు. దానికి సెహ్వాగ్.. ‘కొందరిని దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుంది. వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదు’ అంటూ ట్వీటాడు.     కాగా ‘120 కోట్ల జనాభా ఉన్న దేశం రియో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు (అవి కూడా స్వర్ణాలు కావు) వచ్చినందుకు అంతలా సంబరాలు చేసుకుంటోంది. సిగ్గు చేటు కదా..?’ అని బ్రిటిష్‌ జర్నలిస్ట్‌ పియర్స్‌ మోర్గాన్‌ తొలుత గొడవకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా సెహ్వాగ్‌ ‘మేం చిన్ని చిన్ని సంతోషాలను కూడా గొప్పగా జరుపుకొంటాం. కానీ క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌.. ఇప్పటికీ ప్రపంచకప్‌ నెగ్గలేకపోయింది. అయితే ఇంకా ఆ దేశం క్రికెట్‌ ఆడుతుండటం సిగ్గుచేటు కదా..?’ అని రీట్వీట్‌ చేశాడు. మరి ఈ గొడవ ఎక్కడివరకూ వెళుతుందో...

నేను ఏ పార్టీలో లేను...

  గత కొంత కాలంగా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలోని ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన  ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని.. వ్యక్తిగత అంశాలపై తనకు మెసేజ్ లు ఏమీ పెట్టొద్దని ఆయన రాజకీయ నేతలకు సూచించారు. అంతేకాదు మరో ఆశ్చర్చకమైన విషయం ఏంటంటే.. టీడీపీ నేత, ఏపీ మంత్రి నారాయణ తనకు శత్రువేమీ కాదని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. దీంతో ఇప్పుడు మరో కొత్త ఊహాగానాలకి తెరలేచింది. ఇంత సడెన్ గా ఉండవ్లలి నారామణ శత్రుత్వం గురించి మాట్లాడటం ఏంటని.. ఈయన కూడా ఏమన్నా అధికార పార్టీ అయిన టీడీపీలో చేరే ఆలోచన ఏమన్నా ఉందా.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

పాకిస్థాన్ లో జంట పేలుళ్లు... 10 మంది మృతి

  పాకిస్థాన్ లో మరోసారి ఉగ్ర పేలుళ్లు సంభవించాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రదాడి జరిగిన కొద్ది గంటలకే ఆ దేశంలో మరోసారి పేలుళ్లు సంభవించాయి. పెషావర్‌లోని క్రిస్టియన్‌ కాలనీలో ఉగ్రదాడి జరిపిన ఉగ్రవాదులు.. ఆతరువాత ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని మార్దాన్‌ కోర్టు వద్ద దాడి జరిపారు. ఓ వ్యక్తి బాంబును విసిరి, అనంతరం కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కాగా ఈ దాడిలో 10 మంది మృతిచెందగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

తుని ఘటనలో భూమానకి నోటీసులు..

  తుని ఘటనలో రోజుకో కొత్త పేరు బయటకు వస్తుంది. ఇప్పటికే ఈ హింసాత్మక ఘటనకు కారణమైన పులువురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో భాగంగా సీఐడీ పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది. వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి.. 'నంబర్ 1' న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడు సహా మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని సీఐడీ కార్యాలయాల్లో విచారణకు రావాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.  పది మందిని గుంటూరుకు, మరో పది మందిని రాజమహేంద్రవరానికి రావాలని ఆదేశించింది. కాగా కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు గర్జన ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యమంలో భాగంగా కొందరు పోలీస్ స్టేషన్, రైలును దహనం చేశారు.

మరో ఆప్ మంత్రి రచ్చ... మీడియా పై ఫైర్..

ఆప్ కార్యకర్తలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి చిక్కుల్లో పడుతుంటారు. నిన్ననే ఆప్ మంత్రి సందీప్ గారి ఘనకార్యాలు బయటపడ్డాయి. శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న ఆయన కెమెరా కంటికి బట్టలు లేకుండా చిక్కాడు. కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. దీంతో మంత్రిగారి పదవి ఊడిపోయిందనుకోండి. అది అయిపోయిందో లేదో ఇప్పుడు మరో రచ్చ.. పార్లమెంట్‌ ప్రవేశంపై లైవ్‌ వీడియో తీసి వివాదాల్లో నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు భగవంత్‌ మన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వివరాల ప్రకారం... పంజాబ్‌లోని ఫతేగడ్‌ సాహిబ్‌లో పార్టీ ప్రచార కార్యక్రమం ఏర్పాటుచేశారు. అయితే దీనికి ఆయన నాలుగు గంటల పాటు ఆలస్యంగా వచ్చారు. అయితే ఆలస్యానికి గల కారణం ఏంటో అక్కడికి చేరుకున్న మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగా.. దీంతో చిరాకొచ్చిన భగవంత్ మన్ మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా అవసరం తమకు లేదని, వారిని బయటకు పంపేయాలని కార్యకర్తలకు సూచించారు. వార్తాపత్రికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేగాక, ఇక నుంచి న్యూస్‌పేపర్లు చదవడం ఆపేయండని కార్యకర్తలనుద్దేశించి అన్నారు. దీంతో మీడియా వాళ్లని కార్యకర్తలు బయటకు పంపే ప్రయత్న చేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

రోశయ్య పదవి కాలం పూర్తి.... రాజకీయాల్లోకి రానే రాను..

  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమిళనాడు గవర్నర్ గా పదవి కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే రోశయ్య పదవి కాలం పొడిగింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇప్పటికే మోడీకి లేఖ రాశారు. అయితే ఆ పొడిగింపు జరగలేదు. అయితే రోశయ్య మాత్రం ఇకపై ఎలాంటి బాధ్యతలు నెత్తినపెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే  ఆ బాధ్యతలు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు అప్పగించి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జీవితంలో 60 సంవత్సరాల పాటు రాజకీయాలతోనే సరిపోయిందని.. ఇకపై కాంగ్రెస్ లో కాదు కదా...రాజకీయాల్లోకే ప్రవేశించబోనని తేల్చి చెప్పేశారు. ఏపీలో తాను నివాసాన్ని కోరుకోవడం లేదని, కాబట్టి ఏపీ రాజకీయాలు సైతం తనకు వద్దని రోశయ్య చెప్పడం గమనార్హం. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి రోశయ్యకి రాజకీయాలమీద విరక్తి పుట్టినట్టుంది. పాపం అందుకే రాజకీయాల్లోకి రానని చెప్పేశారు.

భారత్ బంద్ ప్రారంభం....

గురువారం అర్ధరాత్రి నుండి భారత్ బంద్ ప్రారంభమైంది. తమ డిమాండ్ల సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాన కార్మిక సంఘాలు బంద్ చేపట్టాయి.  రెండేళ్ల బోనస్ చెల్లింపు, కనీస వేతనం పెంపులాంటి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ఎంతమాత్రం సరిపోవని బంద్ నిర్వహించాయి. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంతేకాదు ఈ బంద్ లో బ్యాంకుల సిబ్బంది కూడా పాల్గొంటున్న నేపథ్యంలో నేడు అన్ని బ్యాంకుల శాఖలు మూతపడనున్నాయి.ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 18 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని 10 కార్మిక సంఘాల నేతలు తెలిపాయి.

సిగ్గుచేటు.. టీ, సమోసాలకి 9 కోట్లు

  రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ చలామణి అవుతారన్న సంగతి జగమెరిగిన సత్యమే. ఏదో ప్రజల సమస్యలను తీరుస్తారని చెప్పి.. వారిని నమ్మి పదవులు కట్టబెడతారు. కానీ వారు మాత్రం పదవి వచ్చినంత వరకూ ఒక లెక్క.. వచ్చిన తరువాత ఒక లెక్క అన్నట్టు ఉంటారు. అయితే కొన్ని సార్లు కొన్ని లెక్కలు బయటపడినప్పుడు మాత్రమే.. నేతలు ఎంత గొప్పగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల ఖర్చు చూస్తే ఎవరైనా ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. ఖర్చులంటే అవేవే అనుకుంటారేమో.. టీ, సమోసాల ఖర్చులు అవి. ఓస్ అంతేనా వీటికి ఎంత ఖర్చు అవుతుందిలే అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం ఉత్తరప్రదేశ్ మంత్రులు తమ అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామూన్ వంటి అల్పాహారం ఇవ్వడానికి  రూ.9 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ 2012 మార్చి 15న అధికారం చేపట్టారు. ఈ నాలుగేళ్ల ఆయన పాలనలో ఉన్న ఆయన.. 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి రూ.8,78,12,474 ఖర్చయిందన్నారు. అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి అరుణ్ కోరి అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు అని చెప్పారు. మొత్తానికి ప్రజల సొమ్మును రాజకీయ నేతలు ఎంతలా వాడుకుంటున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు అనిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా నేటి రాజకీయాలు తయారయ్యాయి అనే దానికి ఇలాంటి సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనం.

మరోసారి వలసదారులపై ట్రంప్..

  ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాస్త ఇరకాటంలో పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. అరిజోనాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మరోసారి వలసదారులపై ఆయన మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని పంపివేస్తానని.. అక్రమ వలసదారులు అందరూ తమ దేశాలకు వెళ్లి పోవాలని చెప్పారు. తిరిగి వీసా తీసుకుని సరైన మార్గంలో రావల్సిందిగా పేర్కొన్నారు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించి, ఎలాగోలా ఇక్కడే ఉండిపోయి చట్టబద్ధత పొందడానికి ప్రయత్నించే రోజులు పోయాయని ట్రంప్‌ పేర్కొన్నారు. మరి దీనిపై ఎంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తారో చూడాలి.

హైకోర్టులో చంద్రబాబు పిటిషన్..

  గత కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన ఏసీబీ పలువురికి సమన్లు జారీ చేసింది. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది . దీంతో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మాట నిలబెట్టుకున్న అమ్మ... గర్భిణీలకు శుభవార్త..

వరాలు ఇవ్వాలన్నా.. వాటిని నిలబెట్టుకోవాలన్నా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అందుకే తమిళనాడు వాసులు ఆమెకు అంత గౌరవం ఇస్తారు. ఇప్పుడు కూడా తాను ఇచ్చిన మరో హామిని నిలబెట్టుకొని శభాస్ అనిపించుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగలుకు ప్రసూతి సెలవులను ఆరు నెలల నుంచి 9 నెలలకు పెంచుతానని గత ఎన్నికల్లో జయలలిత హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె అనుకున్నట్టుగానే ప్రసూతి సెలవులను పెంచారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ''2011లో మా ప్రభుత్వం ప్రసూతి సెలవులను 90 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇప్పుడు ఆరు నెలల నుంచి 9 నెలలకు పెంచుతున్నాం'' అని జయలలిత ప్రకటించారు. అలాగే కోట్లాది రూపాయలు వెచ్చించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరిస్తామని.. అందులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

ఇకపై వూరుకునే పరిస్థితి లేదు...

  పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నిర్మొహమాటంగా చీవాట్లు పెట్టడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలవాటే. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆయన గుత్తేదారులను, అధికారులను హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పోలవరంతో పాటు రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. పనులు నెమ్మదిగా సాగుతుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇన్ని రోజులు పనిచేస్తారని చూసీ చూడనట్లు వ్యవహరించా.. ఇకపై వూరుకునే పరిస్థితి లేదు.. ఇప్పటికే సీమలోని కొన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ప్రస్తుతం పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదు. గొల్లపల్లి కాలువ డిజైన్‌ చేసిన విధానం సరిగాలేదు. ఇప్పటి వరకు చాలాసార్లు సమావేశం నిర్వహించినా నిర్లక్ష్యం వీడటం లేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు.

దాసరి గారు ప్లీజ్ వారి వలలో పడకండి...

  దాసరి నారాయణగారు దయచేసి వైసీపీ వలలో పడకండి అంటూ లేఖ రాశారు. ఇంతకీ ఆ లేఖ రాసింది ఎవరనుకుంటున్నారా..? ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు. రెండు రోజుల క్రితం దాసరి ఇంట్లో కాపు నేత ముద్రగడ పద్మనాభం, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంకా పలువురు వైసీపీ నేతులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటిపై స్పందించిన రామానుజయ... కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.885 కోట్లు ఖర్చు చేసిందని.. కాపుల అభ్యున్నతికి కట్టుబడ్డ తమ ప్రభుత్వాన్ని అనుమానం వ్యక్తం చేయడం సబబు కాదని, విపక్షం మాయలో పడి కాపు జాతికి అన్యాయం చేయొద్దని ఆయన దాసరికి సూచించారు. మరి రామానుజయ సలహాను దాసరి స్వీకరిస్తారో లేదో చూద్దాం...

సుష్మకు మరో చిత్రమైన ట్వీట్.. నా భర్త ప్రియురాలిని కనిపెట్టండి..

  విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ కు విచిత్రమైన ట్వీట్లు రావడం కొత్తేమి కాదు. ఆ ట్వీట్లకు ఆమె అదేవిధంగా చాలా ఓర్పుగా సమాధానం కూడా ఇస్తుండేవారు. అయితే ఇప్పుడు అదేవిధంగా ఆమెకు ఓ విచిత్రమైన ట్వీట్ వచ్చింది. అదేంటంటే.. తన భర్త ఓ థాయ్ ల్యాండ్ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడని, భర్తతో కలసి తాను ఇండియాకు వచ్చిన వేళ, ఆ అమ్మాయి కూడా వచ్చిందని తనకు తెలిసిందని చెప్పిన సుజాత అనే యువతి, ఆమె ఎవరో తెలుసుకునేందుకు సాయపడాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుష్మా స్వరాజ్ ను అభ్యర్థించింది. ఈ ట్వీట్ చూసిన సుష్మ మొదట షాక్ తిన్నా.. ఆతరువాత ఎప్పటిలాగే ఆమె "సుజాతా... నా సానుభూతి నీపై ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఈ తరహా భర్తలను శిక్షించేందుకు లేదా సంస్కరించేందుకు నాకు ఎలాంటి అధికారాలు లేవు. నీకు సాయపడలేను" అని రీట్వీట్ చేశారు. మరి సుష్మకు ఈతరహాలో ఇంకెన్ని ట్వీట్లు వస్తాయో పాపం..

'జియో' దెబ్బకి 'ఎయిర్ టెల్', 'ఐడియా' అబ్బా..

  రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. అయితే ఈసారి జరిగిన ఈకార్యక్రమంలో మాత్రం  ‘రిలయన్స్ జియో’ పెద్ద సంచలమే సృష్టిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ  ‘ఉచిత’ ‘రిలయన్స్ జియో’ సేవలకు అధికారికంగా రిబ్బన్ కట్ చేశారు. అయితే ఈ జియో వల్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు వచ్చే లాభాలు గురించి చెప్పనక్కర్లేదు అనిపిస్తోంది. కేవలం రూ.50 లకే 1 జీబీ డేటాను.. ఇంకా ఈ నెల 5 నుంచి డిసెంబర్ వరకు జియో మొబైల్ సేవలను ఉచితంగానే ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇంకా దేశవ్యాప్తంగా కోటికి పైగా వైఫై కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా 'రిలయన్స్ జియో' దెబ్బకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ ఈక్విటీ వాటాల విలువ పాతాళానికి పడిపోయినట్టు తెలుస్తోంది.   12 గంటల సమయంలో భారతీ ఎయిర్ టెల్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 6.71 శాతం తగ్గి రూ. 309కి చేరింది. మొత్తం 61 లక్షల ఈక్విటీ వాటాలు చేతులు మారాయి. ఇదే సమయంలో ఐడియా సెల్యులార్ ఈక్విటీ విలువ 7.06 తగ్గి రూ. 86 వద్ద కొనసాగుతోంది. 1.23 కోట్ల వాటాలు చేతులు మారాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెన్ని నష్టాల్ని చూడాల్సి వస్తుందో.

జగన్ ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు...

  ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ అన్ని పార్టీలతో పోలిస్తే కాస్తో కూస్తో చెలామణిలో ఉన్న పార్టీ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్లతో మాత్రమే ఓడిపోయిన వైసీపీ పార్టీ.. ఇప్పుడు వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. ఇక వైసీపీ పార్టీ అధినేత జగన్ అయితే ఏకంగా 2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని.. తానే సీఎం అని కూడా కలలు కంటున్నాడు. దానికి తోడు ఈమధ్య జరిగిన సర్వేలో.. ఉన్న పళంగా ఎన్నికలు పెడితే టీడీపీకి 50 సీట్లు కూడా రావని తేలడంతో జగన్ ఊహాలోకంలో విహరిస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ ఇప్పుడు జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయం ఎక్కువ పట్టుకుందటా. ఎందుకంటే తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేక హోదాపై పవన్ చేసిన వ్యాఖ్యలే రాష్ట్ర మంతటా హాట్ టాపిక్ అయ్యాయి. అంతేనా పవన్ వ్యాఖ్యల వల్లే కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త తగ్గింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి.   మరోవైపు గత ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగలేదు. కానీ ఈసారి 2019 లో జరిగే ఎన్నికల్లో క్రియాశీలకంగా పాల్గొంటామని పవన్ కూడా చెప్పారు. ఒకవేళ అదికాని జరిగితే జగన్ ఆశలపై పవన్ నీళ్లు చల్లినట్టే. ఇప్పటికే పవన్ కు చాలా క్రేజ్ ఉంది. అంతేకాదు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తానని చెప్పారు కాబట్టి ఏపీ ప్రజలు ఆయన మీద బాగానే నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ పొరపాటున ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోయిన అశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఇవన్నీ కాకపోయినా.. పవన్ వచ్చే ఏడాది ఎన్నిక్లలో పాల్గొనకపోయినా... పవన్ మద్దతు ఇస్తే టీడీపీకి ఇస్తారేమో కానీ వైసీపీకి మాత్రం ఇచ్చే అవకాశాలు లేవు. దీన్నిబట్టి చూస్తే రానున్న 2019 ఎన్నికలలోనూ జగన్‌కు పవన్ కొరగాని కొయ్యలా మారనున్నడన్నది నిజం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే అప్పటి ఎన్నికల వరకూ ఆగాల్సిందే. 

రేపు బంద్ నిర్వహించవద్దు..

  రేపు నిర్వహించే దేశవ్యాప్త బంద్ ను పాటించవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. రోడ్డు రవాణా, భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 2న దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్ పై స్పందించిన మమతా బెనర్జీ ఈ బంద్ ను పాటించవద్దని.. అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, ఫ్యాక్టరీలు తెరిచే ఉంచాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతాయని, ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఎలాంటి ఆటంకం ఉండబోదని చెప్పారు. ఎవరైనా సంఘవిద్రోహ శక్తులు సామాన్య జనజీవనానికి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిపై వీలైనంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

"సిట్‌"లోనూ నయీమ్ మనుషులు..

మోస్ట్ వాంటేడ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికుండగా సాగించిన దందా తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలోని కిందిస్థాయి అధికారుల నుంచి అత్యున్నత అధికారుల వరకు నయీమ్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు పడింది. వీరిలో నల్గొండ టూటౌన్ సీఐ రవీందర్, కోదాడ సీఐ మధుసూదన్ రెడ్డిలపై బదిలీ వేటు పడింది. అన్నింటి కంటే ముఖ్యంగా నయీమ్ చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోనే నయీమ్ మనుషులు ఉన్నట్టు తాజాగా తేలింది. దీంతో ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. సిట్‌లో స్థానం లభించిన సీఐ నర్సింహారెడ్డికి నయీమ్‌తో సంబంధాలున్నట్లు తేలడంతో అతన్ని సిట్ నుంచి తొలగించారు.