జగన్ ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు...
posted on Sep 1, 2016 @ 12:22PM
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ అన్ని పార్టీలతో పోలిస్తే కాస్తో కూస్తో చెలామణిలో ఉన్న పార్టీ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్లతో మాత్రమే ఓడిపోయిన వైసీపీ పార్టీ.. ఇప్పుడు వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. ఇక వైసీపీ పార్టీ అధినేత జగన్ అయితే ఏకంగా 2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని.. తానే సీఎం అని కూడా కలలు కంటున్నాడు. దానికి తోడు ఈమధ్య జరిగిన సర్వేలో.. ఉన్న పళంగా ఎన్నికలు పెడితే టీడీపీకి 50 సీట్లు కూడా రావని తేలడంతో జగన్ ఊహాలోకంలో విహరిస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ ఇప్పుడు జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయం ఎక్కువ పట్టుకుందటా. ఎందుకంటే తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేక హోదాపై పవన్ చేసిన వ్యాఖ్యలే రాష్ట్ర మంతటా హాట్ టాపిక్ అయ్యాయి. అంతేనా పవన్ వ్యాఖ్యల వల్లే కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త తగ్గింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి.
మరోవైపు గత ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగలేదు. కానీ ఈసారి 2019 లో జరిగే ఎన్నికల్లో క్రియాశీలకంగా పాల్గొంటామని పవన్ కూడా చెప్పారు. ఒకవేళ అదికాని జరిగితే జగన్ ఆశలపై పవన్ నీళ్లు చల్లినట్టే. ఇప్పటికే పవన్ కు చాలా క్రేజ్ ఉంది. అంతేకాదు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తానని చెప్పారు కాబట్టి ఏపీ ప్రజలు ఆయన మీద బాగానే నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ పొరపాటున ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోయిన అశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఇవన్నీ కాకపోయినా.. పవన్ వచ్చే ఏడాది ఎన్నిక్లలో పాల్గొనకపోయినా... పవన్ మద్దతు ఇస్తే టీడీపీకి ఇస్తారేమో కానీ వైసీపీకి మాత్రం ఇచ్చే అవకాశాలు లేవు. దీన్నిబట్టి చూస్తే రానున్న 2019 ఎన్నికలలోనూ జగన్‌కు పవన్ కొరగాని కొయ్యలా మారనున్నడన్నది నిజం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే అప్పటి ఎన్నికల వరకూ ఆగాల్సిందే.