మరో ఆప్ మంత్రి రచ్చ... మీడియా పై ఫైర్..
posted on Sep 2, 2016 @ 11:31AM
ఆప్ కార్యకర్తలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి చిక్కుల్లో పడుతుంటారు. నిన్ననే ఆప్ మంత్రి సందీప్ గారి ఘనకార్యాలు బయటపడ్డాయి. శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న ఆయన కెమెరా కంటికి బట్టలు లేకుండా చిక్కాడు. కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. దీంతో మంత్రిగారి పదవి ఊడిపోయిందనుకోండి. అది అయిపోయిందో లేదో ఇప్పుడు మరో రచ్చ.. పార్లమెంట్ ప్రవేశంపై లైవ్ వీడియో తీసి వివాదాల్లో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు భగవంత్ మన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వివరాల ప్రకారం... పంజాబ్‌లోని ఫతేగడ్ సాహిబ్‌లో పార్టీ ప్రచార కార్యక్రమం ఏర్పాటుచేశారు. అయితే దీనికి ఆయన నాలుగు గంటల పాటు ఆలస్యంగా వచ్చారు. అయితే ఆలస్యానికి గల కారణం ఏంటో అక్కడికి చేరుకున్న మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగా.. దీంతో చిరాకొచ్చిన భగవంత్ మన్ మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా అవసరం తమకు లేదని, వారిని బయటకు పంపేయాలని కార్యకర్తలకు సూచించారు. వార్తాపత్రికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేగాక, ఇక నుంచి న్యూస్‌పేపర్లు చదవడం ఆపేయండని కార్యకర్తలనుద్దేశించి అన్నారు. దీంతో మీడియా వాళ్లని కార్యకర్తలు బయటకు పంపే ప్రయత్న చేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.