కాశ్మీర్ సీఎంను అంత మాట అనేసిన సుబ్రహ్మణ్యస్వామి...

  కొద్దిరోజులుగా కేంద్ర అధిష్టానం ఆదేశం మేరకు సైలెంట్ గా ఉన్న బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి రెండో ఇన్నింగ్స్ స్టార్ చేసిన దగ్గర నుండి మళ్లీ ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ నుండే రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆయన మరోసారి జమ్ము కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో గత కొంత కాలంగా అల్లర్లు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ప్రస్తావించిన స్వామి... ‘‘కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. కుక్క తోక వంకర పోనట్లే... ముఫ్తీ వైఖరిలోనూ ఏ మార్పూ లేదు. ఇక ఎప్పటికి కూడా ముఫ్తీ వైఖరి మారదు. ఆమెకు ఉగ్రవాదులతో లింకులున్నాయి. ఆమె వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకే ఆమె పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు మొగ్గుచూపింది’’ అని స్వామి వ్యాఖ్యానించారు. మొత్తానికి మరోసారి వార్నింగ్ తీసుకునేంత వరకూ స్వామిగారు ఆగేలా కనిపించడంలేదు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

కర్ణాటకలో ఉద్రిక్తత..రైతుల ఆగ్రహం..

  కర్ణాటకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్ణాటక జలాల్ని ఇరు రాష్ట్రాలు కలిసి వాడుకోవాలని.. తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క‌ర్ణాట‌క రైతులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. దీనిలో భాంగగానే మాండ్యాలో బంద్ కు పిలుపునిచ్చారు. బెంగ‌ళూరు-మైసూరు జాతీయ ర‌హ‌దారిని రైతులు దిగ్బంధించారు. దీంతో పోలీసులు అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున మోహరించారు. మ‌రోవైపు కావేరి జ‌లాల వివాదంపై నేడు అఖిలప‌క్ష భేటీకి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ పిలుపునిచ్చారు.

మోడీ సర్కార్ ను ఏమనొద్దు..

  రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా రఘురామ్ రాజన్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. రఘురామ్ రాజన్ స్థానంలో నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఉన్న ఉర్జిత్ పటేల్‌ను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి పదవి ఇవ్వలేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారును నిదించడం భావ్యం కాదని.. రఘురాం రాజన్ వ్యాక్యానించారు. సంస్కరణల అమలు వేగవంతం చేసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం ఒక్కటే మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో బ్యాంకులను సరిదిద్దే పని కొనసాగుతోందని, తదుపరి గవర్నర్ ఆ బాధ్యతను పూర్తి చేస్తారని అన్నారు. గతంలో బ్యాంకులు ముందూ వెనుకా చూసుకోకుండా రుణాలిచ్చేసి, వాటిని తిరిగి వసూలు చేయడంలో విఫలం అవుతూ రిస్క్ లో పడ్డాయని రాజన్ వ్యాఖ్యానించారు.

డబ్బు లేక చెత్తతోనే భార్యకు అంత్యక్రియలు..

మానవత్వం మంటగలిసింది అని నిరూపించే ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పేదరికంలో మగ్గుతూ భార్య అంత్యక్రియలు చేయలేని ఓ భర్త చుట్టుపక్కల దొరికిన చెత్తాచెదారంతో ఆమె చితికి నిప్పుపెట్టాడు. ఇండోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని రతన్‌ఘర్ గ్రామంలో నోజీభాయ్ అనే మహిళ మృతి చెందడంతో ఆమె భర్త జగదీష్ దహన సంస్కారాలు చేయడానికి ఆమెను శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.2,500 చెల్లిస్తే గానీ కుదరదని పంచాయితీ పెద్దలు తేల్చి చెప్పారు. అంత డబ్బు లేదని జగదీష్ ఎంత బతిమలాడినా వారి మనసు కరగలేదు. దీంతో దిక్కుతోచని అతను మూడు గంటల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్తుకాగితాలు, బ్యాగులు పోగుచేసి చితి ఏర్పాటు చేసి నిప్పుపెట్టాడు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తనకు కలప దుంగలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రతన్‌ఘర్ గ్రామపెద్దలపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.

పాక్‌ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రం-మోడీ

పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. చైనాలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ప్రసంగించిన మోడీ..పాక్ పేరు నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. దక్షిణాసినయాలో ఓ దేశం ఉగ్రవాదులకు స్థావరంగా మారిందని మండిపడ్డారు. ఆ దేశం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో ప్రకటనలు చేయిస్తూ, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దక్షిణాసియాలో ఏ సంఘటన జరిగినా ఆ దేశ ఉగ్రవాదుల హస్తం ఉంటోందని విమర్శించారు. ఒక్క దేశం కారణంగా దక్షిణాసియా మొత్తం ఉగ్రవాదుల బాధితులుగా మిగులుతోందన్నారు.

అమ్మాయిల టాయిలెట్‌లో కెమెరా..

మంగుళూరు విశ్వవిద్యాలయంలోని లేడిస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది. హాస్టల్‌లోని బయోలజీ, బయో సైన్సెస్ విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్‌లో నీలం రంగు సంచిని కొందరు విద్యార్ధినులు గుర్తించారు. దానిలో సీక్రెట్ కెమెరా అమర్చి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్ కెమెరా ద్వారా అమ్మాయిల నగ్నదృశ్యాలను వేరే వాళ్లకి పంపిస్తున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి పలువురు విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు విచారించారు. మరింత సమాచారం కోసం ఆ వీడియోలను, ఫోటోలను బెంగళూరు సైబర్ క్రైమ్ శాఖకు పంపించారు.

మంత్రిని బుక్‌చేసింది సెక్రటరీయే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్‌ కుమార్ అశ్లీల సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఇంత కలకలానికి కారణమైన సీడీలు బయటకు ఎలా వచ్చాయా అన్న దానిపై పోలీసులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో సందీప్‌ కుమార్‌కు కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఈ సీడీనీ లీక్ చేసి చాలా మందికి పంచినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సెక్రటేరియట్‌కు వెళ్లి ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సీడీలో మంత్రితో కలిసి ఉన్న మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, తాను స్పృహ తప్పినపుడు అత్యాచారం చేశాడని తెలిపింది. ఢిల్లీ పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేసి కస్టడీకి అప్పగించారు.

మేగజీన్ వివాదంలో ధోనికి సుప్రీంలో ఊరట..

ఓ మేగజీన్ కవర్‌ పేజీపై శ్రీమహా విష్ణువు రూపంలో దర్శనమిచ్చిన టీమిండియా కెప్టెన్ ధోనిపై వచ్చిన విమర్శలు అన్ని ఇన్నీ కావు. ధోని హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అనేక హిందూ సంస్థలు ధోనిపై దుమ్మెత్తిపోశాయి. ఈ వివాదం అక్కడితో ఆగిపోలేదు..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కోర్టులో కేసు నమోదు కావడంతో న్యాయస్థానం ధోనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత అలాంటి కేసులోనే కర్ణాటక హైకోర్టు క్రిమినల్ కేసు దాఖలుకు ఆదేశాలు వెలువరించింది. అయితే ఈ వివాదంపై ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కెప్టెన్ కూల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. ఈ విషయంలో ఏ ఒక్కరి సెంటిమెంట్లకు ధోని భంగం కలిగించలేదని వ్యాఖ్యానించిన సుప్రీం ఈ కేసు విచారణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీడీ కేసులో..నా భర్తను ఇరికించారు

నా భర్తను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారంటూ ఆరోపణలు చేశారు ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ భార్య రీతూ కుమార్. ఆత్యాచార కేసుపై ఆమె స్పందించారు, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నానని అన్నారు. కుట్ర పన్ని ఆయన్ను ఎవరో ఇందులో ఇరికించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన భర్తపై తనకు పూర్తి నమ్మకముందని..ఆయనకు పూర్తి అండగా ఉంటానని రీతూ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం సందీప్ ఇద్దరు మహిళలతో ఉన్న సీడీ బయటకు రావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనే పోలీసులకు లొంగిపోయారు.

నేను బొమ్మాళినైతే..పశుపతి మీ నాన్నా..?

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గద్వాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డీకే అరుణ హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో నిరాహారాదీక్షకు దిగారు. అయితే నిన్న మీడియాతో మాట్లాడే సమయంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత అరుణపై విరుచుకుపడ్డారు. అరుణను బొమ్మాళి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఇవాళ కౌంటరిచ్చారు అరుణ. నేను బొమ్మాళినైతే పశుపతి మీ నాన్న కేసీఆరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ కోరిన ప్రాంతాన్ని ప్రభుత్వం జిల్లాగా ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు.

సవాళ్లను ఎదుర్కోవడానికి చర్చలు పరిష్కారం కాదు

సవాళ్లను ఎదుర్కోవడానికి చర్చలు పరిష్కారం కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో మోడీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి జీ20 దేశాలు నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న సమయంలో ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. అభివృద్ధి అంచనాలు అందుకోవడానికి తమ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పనులను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం, మౌళిక వసతుల అభివృద్ధి, విలువైన మానవ వనరుల సృష్టి వంటివి లక్ష్యాలుగా నిర్దేశించుకున్నట్లు మోడీ వెల్లడించారు.

వాటికన్‌లో బెంగాలీ భాష

ప్రఖ్యాత క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీలో భారతీయ భాష బెంగాలీ పరిమళించింది. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్‌లో నిర్వహించిన మదర్ థెరిస్సా కు సెయింట్ హుడ్ కాననైజేషన్ కార్యక్రమం జరిగింది. స్పానిష్ బాషను అధికారిక భాషగా పరిగణించే వాటికన్‌లో పూజా, ప్రార్థన కార్యక్రమాలన్ని స్పానిష్‌లోనే జరుగుతాయి. అయితే మదర్ జీవించినంత కాలం పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోనే తన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకే మదర్ జ్ఞాపకార్థం బెంగాలీ భాషలోనే ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రార్థనను మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన సిస్టర్ చేశారు. ఈ సందర్భంగా అంతా మౌన ప్రార్ధనలు చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ కాల్పులు

హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహ వేడుక సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో గుర్రంపై వూరేగుతున్న వరుడు ఆనందం పట్టలేక రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఓకేసారి రెండు రివాల్వర్లతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆగస్టు 22న రాత్రి 10 గంటలకు ఘటన జరిగితే ఇంతవరకు పోలీసులు స్పందించలేదు. కారణం కాల్పులు జరిపిన వరుడు ఓ పోలీస్ అధికారి సమీప బంధువు కావడమే. తొలుత ఎలాంటి కాల్పులు జరగలేదన్న సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ..అనంతరం కాల్పుల దృశ్యాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తుకు ఆదేశించారు. పాతబస్తీలోని షామా ధియేటర్ ఎదుట కాల్పుల ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.