ఉత్తర కొరియా నియంత...మంత్రిని, అధికారులను నడిరోడ్డుపై చంపించిన వైనం

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్-ఉన్ ఎవరి మాట వినడూ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తన మాట విననందుకు ఎంతటి దారుణానికైనా సిద్దపడతాడన్న విషయం తాజా ఘటన బట్టి అర్ధంచేసుకోవచ్చు. తన మాటను జవదాటారన్న కోపంతో ఏకంగా ఒక మంత్రి, ఇద్దరు అధికారులను అత్యంత కిరాతంగా చంపించాడు. అది కూడా ప్రజల మధ్య. కిమ్ జాంగ్-ఉన్ నేతృత్వంలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి హ్వాంగ్ మిన్, విద్యాశాఖలోని ఉన్నతాధికారి రీ యాంగ్ జిన్ తన ఆదేశాలు నిర్లక్ష్యం చేశారన్న కోపంతో.. యుద్ధ విమానాలను పేల్చేసే క్షిపణులను వాడి ఆయన చంపించాడని తెలుస్తుంది. కాగా కిమ్ జాంగ్-ఉన్ కు ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా తన సొంత మామను, గత సంవత్సరంలో మాజీ రక్షణ మంత్రిని ఆయన బహిరంగంగా హత్య చేయించారు. మొత్తానికి ఇంత పైశాచికంగా.. అందరి ముందు చంపుతున్నా దీన్ని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యకరం..

మారనున్న ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్..

గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) డ్రస్ కోడ్ మార‌నుంది. అయితే ఎప్పటినుండో డ్రస్ కోడ్ మార్పుపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ద‌స‌రా రోజు (అక్టోబర్ 11) నుంచి అమల్లోకి తెస్తున్న‌ట్లు పేర్కొంది.   ఇప్పటివరకూ తెల్ల షర్ట్.. ఖాకీ నిక్కర్లతో ఉన్న డ్రస్ వేసుకునే వారు. అయితే సంస్థలో చేరిన కొంత మంది యువకులు.. నిక్క‌ర్లు ధ‌రించ‌డం ప‌ట్ల త‌మ‌పై ప‌లువురు కామెంట్లు చేస్తున్నారని ఆరోపించడంతో నిక్కర్ల స్థానంలో ముదురు గోధుమ వర్ణపు ప్యాంట్లు క‌న‌ప‌డ‌నున్నాయి. కాగా ఇపప్టికే సంఘ్ నాగపూర్ ప్రాంతాల్లో అధికారికంగా కొత్త డ్రస్‌ను విక్ర‌యిస్తోంది. ముదురు గోధుమ వర్ణంలో ఉండే జంట ప్యాంటులను రూ.250లకు అందిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల ఎత్తు దృష్ట్యా ప్యాంటులో మ‌రో రెండు అంగుళాలు పెంచడానికి మరో 10 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ లో ట్విస్ట్.. అరెస్ట్ చేయకుండా ఉంటే నిజం చెబుతా..

  గత కొద్ది రోజుల క్రిందట అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. మరోవైపు దీనిని సంబంధించిన విచారణ ఇంకా జరగుతూనే ఉంది. దీనిలో భాగంగానే మాజీ వాయుసేన చీఫ్ ఎస్పీని సీబీఐ విచారిస్తుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈకేసు మరో కీలక మలుపు తిరిగింది. తనను కనుక అరెస్ట్ చేయకుండా ఉంటే.. ఇండియాకు వచ్చి విచారణకు సహకరించేందుకు అభ్యంతరం లేదని.. మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైఖేల్ సీబీఐకి తెలిపారు. తనపై ఉన్న ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకోవాలని, భారత అధికారులను దుబాయ్ లో కలిసి సాక్ష్యమిచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. ఆగస్టు 25వ తేదీతో మైఖేల్ జేమ్స్ లేఖను రాస్తూ, దుబాయ్ లోని భారత కాన్సులేట్ కు సీబీఐ అధికారులు వస్తే, తాను వారి ముందు నిలుస్తానని చెప్పడం గమనార్హం. ఈ కేసులో తాను అమాయకుడినని, కొంత సమాచారం మాత్రమే తనకు తెలుసునని ఆయన అన్నారు. మరి క్రిస్టియన్ జేమ్స్ ను విచారిస్తే ఎన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

తెలంగాణ అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు...

  తెలంగాణ అసంబ్లీ సమావేశం ప్రారంభమైంది. రాజ్యసభలో ఆమెదం పొందిన రాజ్యాంగ సవరణ జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకే దేశం-ఒకే పన్ను ఉండాలన్న ఉద్దేశంతో జీఎస్టీ బిల్లును తెచ్చారు.. పార్లమెంట్లో ఈబిల్లు ఆమోదించబడింది.. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి..15 రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంది అని అన్నారు. అంతేకాదు జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలు పన్నులు నష్టపోతే ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వమే భరించాలి... ఇంకా పెట్రోల్, ఎక్సైజ్ పన్నులకు ఈ బిల్లు వర్తించదు అని తెలిపారు.

జగన్ సోనియా మాట వినుంటే..

  ఎంపీ టీజీ వెంకటేష్ వరుస పెట్టి అందరిపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరిన టీజీ ఇప్పుడు వైకాపాపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి వైకాపా నేత జగన్ తొందరపాటు నిర్ణయమే కారణమని.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటంతోనే రాష్ట్రం ముక్కలైందని అన్నారు. జగన్ సీఎం పదవి కావాలని అనుకున్నారని, అలా అనుకోకుండా, సోనియా గాంధీ చెప్పిన మాట వినుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలియక రాష్ట్ర విభజనకు అంగీకరించింది. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు పడుతున్న కష్టాలకు ఒక రకంగా జగనే కారణమంటూ టీజీ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొంగలేనని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించిన టీజీనే ఇలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరమైన విషయం.

జీడిమెట్లలో అర్థరాత్రి పేలుళ్లు..

అర్థరాత్రి జనం గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత జీడిమెట్లలో ఒక్కసారిగా పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయి. అంతే జనం ఉలిక్కిపడి లేచి..భయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫ్యాక్టరీల నుంచి విషవాయువులను నాలాలోకి విడుదల చేయడంతో పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వీవీన్ ఫ్యాక్టరీ ఎదుట కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎమ్మెల్యే వివేకానంద హామీ ఇవ్వడంతో స్థానికులు అక్కడి నుంచి వెనుదిరిగారు. పేలుళ్లు సంభవించిన ప్రదేశంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.

దేవినేని టీడీపీ ఎంట్రీకి డేట్ ఫిక్స్..

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలకు తెరపడింది. ఇప్పటికే పలు టీడీపీ నేతలు నెహ్రూతో మంతనాలు జరిపారు. ఇక ఆఖరిగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా చర్చలు ముగిసిన అనంతరం దేవినేని నెహ్రూ, అతని తనయుడు అవినాష్ ల టీడీపీలో చేరడానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో వారంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని.. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

రెజ్లర్ యోగేశ్వర్‌కు ఒలింపిక్స్‌ రజత పతకం..

అదేంటి జోక్  చేయకండి..యోగేశ్వర్‌‌కేంటి రజత పతకం ఏంటి..? అసలు రియోలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన వ్యక్తికి రజతం ఎక్కడి నుంచి వచ్చింది. మీ డౌట్ మేం క్లారిఫై చేస్తాం.. ఈ రజతం రియోలో వచ్చింది కాదు. లండన్‌ ఒలింపిక్స్‌ నాటిది. నాటి ఒలింపిక్స్‌లో 60 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగిన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని సాధించాడు. అయితే ఆ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్‌పై జరిపిన డోప్ టెస్లుల్లో అతడు పాజిటీవ్ అని తేలింది. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుదుస్కోవ్ మరణించాడు. నాడు ఒలింపిక్స్‌లో టెక్నాలజీ వినియోగం అంతంత మాత్రమే..అందుకే అన్ని దేశాల క్రీడాకారుల శాంపిల్స్‌పై ఇప్పుడు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కుదుఖోవ్‌ డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యాడు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్‌ రజత పతక విజేతగా మారినట్లవుతుంది.

గుంటూరులో టీడీపీ నేత దారుణహత్య..

గుంటూరు నగరంలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యాడు. నగరంలోని ఓబుళనాయుడుపాలెంలో టీడీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏమినేడి వెంకటేశ్వరరావు దారుణహత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళుతున్న వారికి రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్వరరావును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆయన్ను తెల్లవారుజామున దుండగులు హత్య చేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. 

సిద్దూకి కాంగ్రెస్ కరెక్ట్ కాదు..

  మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేయడానికి చేశారు కాని.. ఆ తరువాత ఆయన ఏ పార్టీలోకి చేరుతారు అన్న దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అయితే సిద్దూ రాజీనామా చేసిన తరువాత ఆయన ఆప్ పార్టీలోకి వెళతారు అన్న వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. ఆప్ పార్టీ ఈ రెండింటిలో దేనిలో చేరుతారన్న అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ తెరదించింది. తన భర్త కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరని, ఆ పార్టీ సరైన గమ్యస్థానమని తాను భావించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.   మరోవైపు సిద్దూ పెట్టిన డిమాండ్లకు కేజ్రీవాల్ ఒప్పుకోకపోవడంతో సిద్దూ ఎంట్రీ ఆలస్యమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తన భార్యకు ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వాలని సిద్దూ కోరగా..ఒకే ఇంట ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని ఆప్ అధినేత తేల్చి చెప్పడమే సిద్ధూ ఆప్ లో చేరికకు ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. మరి కేజ్రీవాల్ ఎప్పుడు ఒప్పుకుంటారో.. సిద్దూ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

రేవంత్, రమణ అరెస్ట్..

గోదావరి నదిపై ప్రాజెక్ట్‌ల విషయంలోమహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని టీటీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జలసౌధ వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని..ఆ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో లక్డీకాపూల్ నుంచి ఎర్రమంజిల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. పోలీసులు రమణ, రేవంత్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్వీట్ తో సస్పెన్స్ లో పడేసిన స్వామి...

  ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈసారి ట్వీట్లతో దుమారం రేపుతున్నారు. రెండు రోజుల క్రితం స్వామి.. జీఎస్టీ బిల్లుపై ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. జీఎస్టీ బిల్లు వల్ల సాధారణ ప్రజాలకు ఒనగూరే లాభాల కంటే నష్టాలే ఎక్కువని, ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ట్వీట్ చేసి కాకపుట్టించారు. ఇప్పుడు మరో ట్వీట్ చేసి అందరిని సస్పెన్స్ లో పడేశారు. అదేంటంటే.. ముడి చమురు ధరలో మీరు నిపుణులైతే...డిసెంబర్ లో పెట్రోలు ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అంతేనా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో రేపు సమాధానం చెబుతానని అని మరో ట్వీట్ లో ట్విస్ట్ ఇచ్చారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 60 డాలర్లను దాటితే మన ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉండనుంది? అని ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి మళ్లీ జీఎస్టీ బిల్లు ద్వారా తమ ప్రభుత్వంపైనే స్వామి ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేశారు. దీనికి పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో.. ముందు స్వామి గారి ట్వీట్ కు ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూడాలి.

తెలంగాణకు మరో ఘనత... 'మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్'

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశ వ్యాప్తంగా మంచి పేరే ఉంది. అంతేకాదు ఆ మధ్య ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా ఎవరు బెస్ట్ అనే దానిపై నిర్వహించిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు సర్కార్ అవలంభిస్తోన్న విధి విధానాలకు కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ గా తెలంగాణ రాష్ట్రానికి అవార్డ్ దక్కింది. తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ సీ.ఎన్.బీ.సీ అనే సంస్థ.. ఆయా రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల పరిస్థితులు, అందుకోసం రాష్ట్రాలు అవలంభిస్తోన్న విధానాలను పరిగణలోకి తీసుకుని ప్రతీ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది. అయితే ఈసారి కూడా సర్వే నిర్వహించగా.. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా ఎంపికయింది. అవార్డును స్వీకరించాల్సిందిగా ఇప్పటికే సీఎన్ బీసీ నుంచి తెలంగాణ సర్కార్ కు ఆహ్వానం అందింది. అగస్టు 30వ తేదీన గ్రాండ్ న్యూఢిల్లీలో ఉన్న వసంత్ కుంజ్ ఫేస్ 2లో సాయంత్రం 5.30గం.లకు జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అవార్డును అందుకోనున్నారు.

అర్ధరాత్రి మోడీ ఫోన్.. షాకైన అధికారి..

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఫోన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడీ.. ఏంటీ అర్థరాత్రి ఫోన్ ఏంటీ అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. మోడీ త్రిపురకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేశారంట. ఆ అధికారి ఫోన్ ఎత్తిన వెంటనే మోడీ పీఎంవో లో ఓ అధికారి "ప్రధాని మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు" అని చెప్పాడు. ఆ మాటతో షాకైన సదరు ఐఏఎస్ అధికారి తేరుకునే లోపు నరేంద్ర మోదీ లైన్ లోకి వచ్చారు. ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలని కోరతూ అసలు విషయం చెప్పారు. వర్షాల కారణంగా త్రిపురను ఇతర రాష్ట్రాలతో కలిపే ఎన్ హెచ్ 208 (ఏ)ను వెంటనే పునరుద్ధరించాలని, పనులు దగ్గరుండి చూసుకోవాలని కోరారు. ఇక అనంతరం.. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అధికారులు, కార్మికులు హుటాహుటిన పనులు జరిపి నాలుగు రోజుల్లో రహదారిని బాగు చేసేశారు. దీంతో రవాణా మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి అభినందనలు కూడా అందాయి. ఢిల్లీకి వచ్చినప్పుడు పీఎంఓకు వచ్చి మోదీని కలుసుకోవాలని కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ మేటర్ మొత్తం ఎలా లీకైందంటే... ఐఏఎస్ అధికారి స్నేహితుడి కుమారుడు జరిగిన విషయం మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం కాస్త బయటపడింది.

ఎట్టకేలకు తెలంగాణ సర్కారుకు ఊరట..

  ఎట్టకేలకు వీసీల నియామకంపై తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నెలరోజుల క్రితం తొమ్మిది మంది వైస్ ఛాన్స‌ల‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర స‌ర్కార్ జీవో జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు ఆగిన వాళ్లు ఇంకా రెండు రోజులు ఆగలేకపోయారా అంటూ మొట్టికాయలు వేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయవాదులు ముఖుల్‌రోహ‌త్గీ, విశ్వ‌నాథ్‌శెట్టి కోర్టులో తమ వాదనలు వినిపించారు. వాదనల విన్న సుప్రీం కొత్త వీసీల కొనసాగింపునకు సుప్రీంకోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల విశ్వ‌విద్యాల‌యాల‌కు వీసీని నియ‌మించే అధికారం రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి ఉంద‌ని తెలిపింది.

ముద్రగడ ఫ్రీ ఆఫర్...

కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటికే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేపట్టారు. ఆ తరువాత కూడా రెండు మూడుసార్లు దీక్ష చేపట్టారు. అయితే ఇప్పుడు ముద్రగడ ఓ ఆఫర్ ఇచ్చారు. అదేంటనుకుంటున్నారా..?  అయితే ఈసారి కాపు రిజర్వేషన్ల గురించి కాదులెండి.. ఏపీ ప్రత్యేక హోదా గురించి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు ఆ దీక్ష‌లో త‌న‌కు కూడా చోటిస్తే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాను దీక్ష చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. మరోవైపు కాపులకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చెయ్యాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

దేవినేని నెహ్రూ టీడీపీ ఎంట్రీ.. నేడో, రేపో క్లారిటీ..

  రాజకీయ ప్రబుద్దుడు దేవినేని నెహ్రూ ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతారన్న వార్తలు గత కొద్దిరోజుల నుండి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నేడో రేపో ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే దేవినేని నెహ్రూని పార్టీలోకి రప్పించడానికి టీడీపీ నేతలు పలు చర్చలు జరిపారు... అంతేకాదు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ కూడా ఆయన నివాసంలోనే చర్చలు జరిపారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో కూడా ఆయన ఫోన్లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన ఈరోజు లేదా రేపు చంద్రబాబుతో ప్రత్యక్షంగా కలుసుకొని ఆయనతో చర్చించి ఆతరువాత ప్రకటించనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ పార్టీలోకి దేవినేని చేరిక ఖాయమని, అందుకు అధినేత నుంచి కూడా అంగీకారం వచ్చిందని తెలిపాయి. ఆయన తన కార్యకర్తలు, అభిమానులతో పార్టీ మారే విషయమై ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.   ఇక ఇప్పటికే కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ పార్టీలో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా జంప్ అవ్వాడనికి సిద్దంగా ఉన్నారు. ఉన్న సీనియర్ నేతల్లో దేవినేని నెహ్రూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరితే, విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నేతను కోల్పోయినట్టే.