'జియో' దెబ్బకి 'ఎయిర్ టెల్', 'ఐడియా' అబ్బా..
posted on Sep 1, 2016 @ 12:39PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. అయితే ఈసారి జరిగిన ఈకార్యక్రమంలో మాత్రం ‘రిలయన్స్ జియో’ పెద్ద సంచలమే సృష్టిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ‘ఉచిత’ ‘రిలయన్స్ జియో’ సేవలకు అధికారికంగా రిబ్బన్ కట్ చేశారు. అయితే ఈ జియో వల్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు వచ్చే లాభాలు గురించి చెప్పనక్కర్లేదు అనిపిస్తోంది. కేవలం రూ.50 లకే 1 జీబీ డేటాను.. ఇంకా ఈ నెల 5 నుంచి డిసెంబర్ వరకు జియో మొబైల్ సేవలను ఉచితంగానే ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇంకా దేశవ్యాప్తంగా కోటికి పైగా వైఫై కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా 'రిలయన్స్ జియో' దెబ్బకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ ఈక్విటీ వాటాల విలువ పాతాళానికి పడిపోయినట్టు తెలుస్తోంది.
12 గంటల సమయంలో భారతీ ఎయిర్ టెల్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 6.71 శాతం తగ్గి రూ. 309కి చేరింది. మొత్తం 61 లక్షల ఈక్విటీ వాటాలు చేతులు మారాయి. ఇదే సమయంలో ఐడియా సెల్యులార్ ఈక్విటీ విలువ 7.06 తగ్గి రూ. 86 వద్ద కొనసాగుతోంది. 1.23 కోట్ల వాటాలు చేతులు మారాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెన్ని నష్టాల్ని చూడాల్సి వస్తుందో.