కొత్త జిల్లాలపై కేసీఆర్... దసరా నుండి కొత్త జిల్లాలు
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై బాగానే కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాలకు సంబంధించిన పటం కూడా బయటకు వచ్చింది. అంతేనా కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే అభ్యంతరాలను తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ నెలరోజుల పాటు గడువు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పరిపాలన విభాగాలు ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చాయని, వాటిల్లో 45 మండలాలను నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు. దసరా నుండి కొత్త జిల్లాలు ప్రారంభమవ్వాలని.. ఆతరువాత జిల్లాల్లోని రెవెన్యూ, పోలీసు శాఖల పని కూడా ప్రారంభం కావాలని కేసీఆర్ సూచించారు. రెవెన్యూ, పోలీసు మినహా మిగిలిన శాఖల ఆఫీసులు, అధికారుల నియామకం ఆ తర్వాత చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు, అధికారుల నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు కావాలని సూచించారు.