ఖేల్ రత్న అవార్డును అందుకున్న పి.వి సింధూ..

  రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన పి.వి సింధూ అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ అందుకుంది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రియో ఒలింపిక్స్ స్టార్లకు ఖేల్ రత్న అవార్డులను అందించారు. ఈ సందర్భంగా స్టార్ షట్లర్  పి.వి సింధూ.. క్రీడాకారులకు అందే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను రాష్ట్రపతి చేతుల మీదగా అందుకుంది. కాగా ఇప్పటికే రూ.12 కోట్లకు పైగా నగదు నజరానాతో పాటు సర్కారీ ఉద్యోగం, నవ్యాంధ్ర నూతన రాజధానిలో ఇంటి స్థలం, తిరిగేందుకు లక్షల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కారు ఆమె దరి చేరాయి.

పవన్ కళ్యాన్ పై పెదవి విరుపు మాటలు...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నేతలు ఒకరి తరువాత ఒకరు స్పందిస్తున్నారు. ఎవరెవరూ ఎలా స్పందిస్తున్నారో ఓ లుక్కేద్దాం..   మంత్రి గంటా శ్రీనివాసరావు..   ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం సీఎం చంద్రబాబుకి లేదని.. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రిగారు కృషిచేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.   కేశినేనినాని..   పవన్ కు నాపై ప్రేమ ఉంది.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నాపేరు తలుచుకుంటారు.. ప్రజలందరికీ నన్ను తన నోటి ద్వారా గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు అని అన్నారు. నాకు ఇంగ్లీష్ హిందీ వచ్చు.. తెలుగువారికి అర్ధం కావాలని పార్లమెంట్లో తెలుగులో మాట్లాడతా అని వెల్లడించారు. ఏపీలో ధర్నాలు, రాస్తా రోకోలు ఇక్కడ చేయడం కాదు..ఢిల్లీలో చేస్తే ప్రయోజం ఉంటుంది.. ప్రత్యేక హోదాపై పవన్ దగ్గర ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉంటే అతనితో కలిసి పోరాడతాం.. ఎంపీలందరూ ధనవంతులు కాదు.. కనీసం పీఏని కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు అని అన్నారు.   టీజీ వెంకటేశ్..   బీజేపీ ఆధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లు అవుతుంది.. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు.. రెండేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయాడని..ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని.. ఎంపీల‌పై ప‌వ‌న్ చేసింది చౌక‌బారు విమ‌ర్శ‌లని టీజీ వెంకటేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని సూచించారు. రాజకీయం చేయ‌డ‌మంటే నెల‌నెలా జీతం తీసుకున్న‌ట్లు కాదు.. ఇలాంటి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని ఆయ‌న అన్నారు.   డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో కదలిక తెచ్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాటం చేస్తామని, తమ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదని.. తాము సంవత్సరానికి ఒకసారి వేదికపైకి ఎక్కి హోదా గురించి మాట్లాడి మరో ఏడాది పాటు కనిపించకుండా వెళ్లిపోయే రకాన్ని కాదని అన్నారు. హోదా కోసం కేంద్రంపై అనునిత్యం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు.

బోల్డ్ విజయ రహస్యం అదేనట..

  జమైకా చిరుతగా పేరు తెచ్చుకున్న ఉస్సేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించి..ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉస్సేన్ బోల్ట్ వియజ రహస్యం ఏంటో చెప్పారు బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్. ఉస్సేన్ బోల్ట్, చిన్నప్పటి నుంచి పేదరికం కారణంగా గొడ్డుమాంసం తినడానికి అలవాటు పడ్డాడని, ఆ అలవాటే అతను 9 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించేందుకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ జమైకా లెజండ్ విజయాల వెనకున్న సీక్రెట్ ఇదేనని, అతని శిక్షకుడు సైతం రెండుపూటలా బీఫ్ తినమని సలహాలు ఇచ్చేవాడని చెప్పారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో తొలి పతకం నెగ్గిన బోల్ట్, తాజా రియో ఒలింపిక్స్ లో 9వ స్వర్ణాన్ని గెలిచి, తన కెరీర్ ను విజయవంతంగా ముగించాడు. అయితే ఇప్పుడు ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

క్రీడా శాఖమంత్రిగారు మళ్లీ బుక్కయ్యారు..

  కేంద్ర క్రీడా శాఖమంత్రి విజయ్ గోయల్ ఈమధ్య ఎక్కువగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. దానికి కారణం.. ఆయన చేస్తున్న ట్వీట్లే.. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్లే ఆయనపై విమర్శలు చేయడానికి కారణమయ్యాయి. అథ్లెట్ సర్బానీ నందాకు శుభాకాంక్షలు చెబుతూ ద్యుతీ చంద్ చిత్రాన్ని పోస్ట్ చేయడం, దీపా కర్మాకర్ పేరుకు కర్మనాకర్ అని రాయడంతో నెటిజన్ల నోళ్లలో నానారు. అయితే ఇప్పుడు మరోసారి తప్పులో కాలేసి విమర్శలపాలయ్యారు. నిన్న ప్రధాన మంత్రి మోడీ రియో బలింపిక్స్ విజేతలను కలుసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ గోయల్ మాట్లాడుతూ.. "ప్రధాని ఇవాళ ఖేల్ రత్న, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య అవార్డు విజేతలను కలుసుకున్నారు. వారిలో రియో గోల్డ్ మెడలిస్టులు పీవీ సింధు, సాక్షి మాలిక్ ఉన్నారు" అని నోరు జారారు. ఇంకేముంది పీవీ సింధు, సాక్షీ మాలిక్ లను స్వర్ణ పతక విజేతలుగా అని మళ్లీ ఒకసారి బుక్కాయ్యారు. ఇక అంతే విజయ్ గోయల్ పై సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు.. నోరు జారడంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కు గట్టి పోటీ ఇచ్చేవారు ఇప్పటికి ఒకరొచ్చారని ఒకరంటే, ఓ కామెడీ షోను హోస్ట్ చేసేందుకు కపిల్ శర్మకు పోటీదారు లభించాడని మరొకరు వ్యాఖ్యానించారు.   తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన విజయ్ గోయల్ "ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ప్రజలు దాన్నో ఇష్యూ చేస్తున్నారు. ఇది నా విషయంలో చాలాసార్లు జరిగింది. నా ఉద్దేశం మనవాళ్లు బంగారు పతకాలు సాధించిన వారితో సమానమేనని. ఎవరికి తెలుసు మనకూ భవిష్యత్తులో గోల్డ్ మెడల్స్ రావచ్చేమో!" అన్నారు. మొత్తానికి విజయ్ గోయల్ తాను చేసిన వ్యాఖ్యలను బాగానే కవర్ చేసుకన్నారు.

అప్పుడు నిద్రపోయాడు.. ఇప్పుడు లేచాడు..

  పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రత్యేక హోదాపై అటు కేంద్రప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఏపీ నాయకులపై కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎంపీలందరూ రాజీనామా చేసి..ప్రత్యేక హోదాకోసం పోరాడాలని అన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేశ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ఆధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లు అవుతుంది.. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు.. రెండేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయాడని..ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని.. ఎంపీల‌పై ప‌వ‌న్ చేసింది చౌక‌బారు విమ‌ర్శ‌లని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని సూచించారు. రాజకీయం చేయ‌డ‌మంటే నెల‌నెలా జీతం తీసుకున్న‌ట్లు కాదు.. ఇలాంటి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని ఆయ‌న అన్నారు.   అంతేకాదు ఎంపీలకు హిందీ రాదు అన్న వ్యాఖ్యలపై కూడా టీజీ స్పందించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని చెప్పడం పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఎంపీలు ఏ భాషలో మాట్లాడినా వెంటనే హిందీలోకి అనువాదం అవుతుందన్న విషయం ఆయనకు తెలియక పోవడం విచారకరమన్నారు. మొత్తానికి ఈమధ్యనే ఎంపీగా అధికార బాధ్యతలు చేపట్టిన టీజీని పవన్ వ్యాఖ్యలు బాగానే బాధించినట్టు ఉన్నాయి.

ప్రేమికులకు షాక్..తాజ్‌మహాల్ ప్రవేశంపై ఆంక్షలు..?

ప్రేమకు ప్రతిరూపం..మొగల్ చక్రవర్తుల వారసత్వ సంపదగా..యమునానది ఒడ్డున విలసిల్లుతున్న అపురూప కట్టడం తాజ్‌మహాల్. జీవితంలో ఒక్కసారైనా తాజ్‌మహాల్‌ను చూడాలనుకోని భారతీయుడు ఉండడు. అలాంటి వారికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. తాజ్‌మహాల్‌ సంరక్షణ చర్యల్లో భాగంగా పర్యాటకులను లోనికి అనుమతించడంపై నిబంధనలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. నాగపూర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పర్యాటకులు పోటెత్తుండటంతో తాజ్‌మహాల్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ మార్పులు వేగంగా జరుగుతున్నట్టు తేలింది. దీంతో అద్బుత కట్టడంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ సందర్శన వేళలను కుదించనున్నట్టు తెలిపింది.

కృష్ణాష్టమి వేడుకల్లో దారుణం..కళాకారిణిపై గ్యాంగ్‌రేప్

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే అనంతపురం జిల్లాలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో దారుణం జరిగింది. వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన ఓ కళాకారిణిపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్పలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్యాన్స్ చేసేందుకు వచ్చిన తనపై నలుగురు యువకులు దాడి చేయడయే కాకుండా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఎయిర్ పోర్టులో కాల్పుల కలకలం..

  గత కొద్ది రోజుల నుండి అగ్రరాజ్యమైన అమెరికాలో వరుస కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక ఘటన జరిగి దానిని ప్రజలు మరిచిపోయే లోపే మరో ఘటన జరిగి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. లాస్ ఏంజిల్స్ లోని ఎయిర్ పోర్టులో కాల్పులు చోటుచేసుకోవడంతో వెంటనే స్పందిచిన భద్రతా దళాలు, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  అసలు తుపాకితో ఎయిర్ పోర్టులోకి ఎలా ప్రవేశించాడన్న విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.

గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేల సవాల్..144 సెక్షన్

గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాల్ ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. పుష్కర పనుల్లోఅవినీతికి పాల్పడ్డారంటూ గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌పై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యరపతినేని..విచారణకు తాను సిద్ధమని..వాటిని నిరూపించకపోతే పిన్నెల్లి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దీంతో దాచేపల్లి మార్కెట్ యార్డులో ఇరు వర్గాలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. ఇరు వర్గాల సవాల్‌తో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గురజాల రెవన్యూ డివిజన్‌లో 144 సెక్షన్ విధించారు. దాచేపల్లిలో బందోబస్తు పెంచి, ముందు జాగ్రత్త చర్యగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

ఆడబిడ్డలు దేశం గర్వపడేలా చేశారు-మోడీ

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించి దేశం తలెత్తుకునేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధు, సాక్షిమాలిక్‌లపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మన్‌ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రేడియోలలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. క్రీడలను ఎక్కువగా ప్రస్తావించిన ఆయన సింధు, సాక్షిలతో పాటు దీపా కర్మాకర్, పుల్లెల గోపిచంద్‌ల ప్రతిభ గురించి కొనియాడారు. ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టారని వ్యాఖ్యానించారు. వీరికి మరింత ప్రోత్సాహమిస్తే మరిన్ని అద్భుత విజయాలను సాధిస్తారని చెప్పారు.

అప్పుడు చేసింది తప్పే..

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 1991లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరసేవకులను అదుపు చేసేందుకు ములాయం కాల్పులకు ఆదేశాలిచ్చారు. ఈ కాల్పుల్లో 16 మంది చనిపోగా, మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. 26 సంవత్సరాల తర్వాత దీనిపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. దేశ సమైక్యత కోసం ఆ ఆదేశాలు ఇవ్వక తప్పలేదన్నారు. కరసేవకులపై కాల్పులకు ఆదేశాలివ్వడం, పొరపాటేనని, కాని ముస్లింలను కాపాడేందుకు మరో మార్గం లేక అలా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే కాల్పుల అనంతరం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

భారత మహిళా హాకీ జట్టును అవమానించిన భారతీయ రైల్వే..

రియో ఒలింపిక్స్‌‌లో భారత మహిళా హాకీ జట్టు గతంతో పోలీస్తే మెరుగైన ప్రదర్శన చేయడంతో రానున్న టోక్యో ఒలింపిక్స్‌‌లో మరింత బాగా రాణించడానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మహిళా హాకీ జట్టుకు తీరని అవమానం జరిగింది. అది ఎక్కడో కాదు మన దేశంలోనే..సాక్షాత్తూ భారతీయ రైల్వేల చేతిలోనే. రియో నుంచి తిరుగు పయనమైన జట్టులోని కొందరు సభ్యులను భారతీయ రైల్వేలకు చెందిన ఓ టీటీ రైల్లో కింద కూర్చోబెట్టాడు. ఒలింపిక్స్‌ ముగియగానే రియో నుంచి తిరుగు పయనమైన మహిళా హాకీ జట్టులోని కొందరు సభ్యులు..రాంచీ నుంచి రూర్కెలా వెళ్లేందుకు బోకారో-అలెప్పీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. అయితే వారి ప్రయాణానికి సంబంధించి ముందస్తు రిజర్వేషన్లు లేవు. దీంతో వారిని కింద కూర్చోవాలంటూ టీటీ ఆదేశాలు జారీ చేశారంటూ జాతీయ ఛానల్ సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రసారం చేసిన కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

పట్టిసీమను ఇంజనీర్లకు ప్రభుత్వం గిఫ్ట్..

కృష్ణగోదావరి నదుల అనుసంధానానికి ఆధారమైన పట్టిసీమ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసిన ఇంజనీర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న ఇంజనీర్లకు ఇంక్రిమెంట్లు ఇచ్చింది. దీనికి సంబంధించిన దస్త్రంపై నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 నాటికి పోలవరం తొలి దశను పూర్తిచేస్తామని చెప్పారు. త్వరలోనే కృష్ణా-గోదావరి-పెన్నా నదులను అనుసంధానంతో పాటు వంశధార-నాగావళి నదులను అనుసంధానించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారన్నారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల సాధనలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

ఏటీవీ ప్రయోగం విజయవంతం

బరువైన రాకెట్లను నింగిలోకి చేర్చేందుకు ఇస్రో రూపొందించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంచ్ వెహికల్ ఏటీవీ-02ను ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 6 గంటలకు ఏటీవీ నింగిలోకి దూసుకెళ్లింది. ఐదు సెకన్ల వ్యవధిలో 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఏటీవీ పూర్తి చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాకెట్ ప్రయోగ వ్యయం తగ్గనుంది. బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. గతంలో ఇంధనంగా అమ్మోనియా క్లోరెట్స్ ఆక్సిజన్ వినియోగించేవారు. ఈ ప్రయోగంలో ఆక్సిజన్‌కు బదులు ఘనవాతావరణంలో గాలిని ఇంధనంగా వినియోగించారు.

వీళ్లని చూసి గర్వపడుతున్నా-సచిన్

రియో ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారతదేశానికి పతకాన్ని సాధించి పెట్టిన పీవీసింధు, సాక్షి, దీపలను చూసి తాను గర్వపడుతున్నానని అన్నారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఒలింపిక్స్‌ స్టార్లను సన్మానించేందుకు ఆయన ఇవాళ హైదరాబాద్ వచ్చారు. పుల్లెల గోపిచంద్ అకాడమీలో ఒలింపిక్ విజేతలకు సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ క్రీడలకు ఇది శుభదినమని..ఈ విజయయాత్ర ఆగకూడదని ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. సింధుని గోపిచంద్ చక్కగా ప్రోత్సహించారన్నారు.

'రియల్' ట్విస్ట్... కొత్త జిల్లాకు షేక్! పాత జిల్లాకు షాక్!

  రియల్ భూం... ఇంతకు ముందు ఈ పదం కేవలం హైద్రాబాద్ లో మాత్రమే వినిపించేది. ఇక్కడ భూములు కోటి అంటే అక్కడ కోటిన్నరా అంటూ న్యూస్ వచ్చేది. కాని, రాష్ట్ర విభజన వల్ల అమరావతి కూడా రియల్ ఎస్టేట్ కళతో మెరిసిపోతోంది. కాని, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల విభజన నిర్ణయం వల్ల చిన్న చిన్న టౌన్లు కూడా రియల్ ఎస్టేట్ భూంతో ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల భూముల ధరలు పడిపోయి రియాల్టర్లు దిగాలుపడిపోతున్నారు!   జిల్లాల విభజనతో రియల్ షేక్ కి గురవుతున్న తెలంగాణ జిల్లా ఖమ్మం. ఇందులోంచి కొత్తగూడెం జిల్లా అంటూ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఫలితంగా కొత్తగూడెం పరిసరాల్లో భూముల ధరలకి రెక్కలొచ్చాయి. 30 నుంచి 60లక్షలున్న ఎకరం ఇప్పుడు కోటి దాటిపోయింది! అటు ఖమ్మం జిల్లాగా మిగలనున్న అవశేష ప్రాంతంలో పరిస్థితి రివర్స్ గా వుంది. మొన్నటి వరకూ కోటి , కోటిన్నర పలికిన ఎకరం ధర ఇప్పుడు ఖమ్మలో యాభై లక్షలు కూడా దాటడం లేదు. దీంతో అప్పులు చేసి మరీ భూములు కొని పెట్టుకున్న ఖమ్మం జిల్లా రియాల్టర్లు లబోదిబోమంటున్నారు.   ఒక్క ఖమ్మంలోనే పరిస్థితి ఇలా వుంటే మొత్తం 17 జిల్లాల ఏర్పాటుతో స్థితి ఎలా వుంటుందో మున్ముందు చూడాలి. కాకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగాలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లయ్యే సూచనలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి! 

నాకు ఏ హీరోతో గొడవలు లేవు

మరోక హీరో అభిమాని చేతిలో తన అభిమాని చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేసిన ఆయన ఉన్నట్లుండి బహిరంగసభ పెట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఇందిరా మైదానంలో జరిగిన సభలో పవన్ ప్రసంగించారు. సినిమాను కేవలం వినోదంగానే చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. వినోద్ రాయల్ హత్య తనకు చాలా బాధ కలిగించిందని..క్షణికావేశం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చిందన్నారు. సినీ రంగంలో తనకు ఏ కథానాయకుడితోనూ విభేధాలు లేవని అన్నారు. అంత బాధలోనూ బిడ్డ కళ్లను ఆ తల్లి దానం చేసిందని..ఆమెకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు.