గోవా ఆర్ఎస్ఎస్ లో ముసలం.. 400 మంది రాజీనామా..

  గోవా ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)లో ముసలం ఏర్పడింది. గోవా ఆర్ఎస్ఎస్ చీఫ్ సుభాష్  వెలింగాకర్ ను పదవి నుండి తొలగించారు. దీంతో ఆయన తొలగింపును నిరసిస్తూ దాదాపు దాదాపు 400 మందికి పైగా వాలంటీర్లు ఆర్ఎస్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుభాష్  వెలింగాకర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉంటూనే.. భారతీయ భాషా సురక్షా మంచ్ పేరిట ఓ సంస్థను నడుపుతున్నారు. అంతేకాదు ఆయన బీజేపీ పార్టీకి కీలకమైన వ్యక్తి కూడా. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించి పదవి కోల్పోయారు. వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనుందని.. ఓ కొత్త రాజకీయ పార్టీ బీజేపీని ఓడించనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పదవిపై వేటు పడింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య మాత్రం..  సుభాష్ రాజకీయాల్లో కాలుమోపాలని భావిస్తున్నారని, సంఘ్ నేతగా రాజకీయ కార్యకలాపాలు చేయరాదు కాబట్టి విధుల నుంచి తొలగించామని అంటున్నారు. మరి ఎంతవరకూ నిజమో వారికే తెలియాలి.

రెయిన్ గన్స్‌తో ఏపీలో నూతన శకం

రెయిన్‌గన్స్‌తో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభమైందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వర్షపాతంలో హెచ్చుతగ్గుల కారణంగా పంటలను కాపాడటంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్‌గన్స్‌తో వాటర్‌ స్ప్రే చేసి పంటలను కాపాడటం దేశంలోనే సరికొత్త చరిత్ర అని సీఎం అన్నారు. దీని వల్ల వర్షాలు లేకున్నా పంట కాపాడుకోవచ్చుననే ధీమా, ధైర్యం రైతుల్లో వచ్చిందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోవడమనేది ఇకపై మన రాష్ట్రంలో జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. రైతుల్లో ధైర్యానికి కారణమైన అందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

గోవా ఆర్ఎస్ఎస్‌లో మంటలు..

గోవా ఆర్ఎస్ఎస్ చీఫ్ సుభాష్ వెలింకర్‌ను పదవి నుంచి తొలిగించడం పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. వెలింకర్‌ను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు, వాలంటీర్లు ఆర్ఎస్ఎస్‌లో తిరుగుబాటు లేవదిశారు. ఇప్పటికే 400 మందికి పైగా కార్యకర్తలు, వాలంటీర్లు ఆర్ఎస్ఎస్‌కు రాజీనామా చేశారు. వెలింకర్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించేంత వరకు రాజీనామాలు ఉపసంహరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పనాజీలో ఆరుగంటల పాటు సమావేశం ఏర్పాటు చేసి, నిరసన వ్యక్తం చేశారు. సుభాష్ వెలింకర్‌ను పదవి నుంచి తొలగించేందుకు సీనియర్ ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గోవా పర్యటనకు వచ్చిన సమయంలో...రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గడం కష్టమని వెలింకర్ బహిరంగంగానే ప్రకటించడంతో ఆయనపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనపై ఆర్ఎస్ఎస్ వేటు వేసింది.

పెరిగిపోయిన ఉత్తర కొరియా పైశాచికం....సరిగా కూర్చోలేదని ఉపప్రధానికి ఉరిశిక్ష

  ఉత్తర కొరియా నియంత కిమ్-జాంగ్ ఉన్ పైశాచికం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చక పోతే ఏకంగా మరణశిక్షనే విధిస్తూ తన మూర్ఖత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికే కిమ్-జాంగ్ ఉన్ పలువురిని నిర్ధాక్షిణ్యంగా చంపిచేశాడు. గత రెండు రోజుల క్రితం కూడా ఓ మంత్రిని, ఇద్దరు అధికారులను ప్రజల మధ్య చంపించిన కిమ్-జాంగ్ ఇప్పుడు ఉప ప్రధానిని కూడా ఉరితీయించినట్టు తెలుస్తోంది. అది కూడా చాలా సిల్లీ రీజన్ తో. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన ఓ సమావేశం జరుగగా ఆకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపప్రధాని సరిగా కూర్చోలేదన్న కోపంతో ఆయనను అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత అతనిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, దేశంలో విప్లవాన్ని లేవదీస్తున్నాడని అభియోగాలు మోపీ అతనిని ఉరితీయించారు. మొత్తానికి కిమ్-జాంగ్ ఉన్ అరాచకాలకు అడ్డుకట్టలేకుండా పోతుందని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు కూడా ఉరిశిక్షలు వేస్తే... పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్లని ఎలా శిక్షిస్తాడో..

బయటకొచ్చిన రాసలీలలు..మంత్రిపై కేజ్రీవాల్ వేటు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వివాదాలతో మింగలేక కక్కలేకపోతున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అలాంటి వివాదాస్పద నేతలపై కన్నెర్ర చేశారు. తాజాగా లైంగిక ఆరోపణలకు సంబంధించిన వీడియో టేప్ ఒకటి బయటకు రావడం..పార్టీ పరువు యమునా నదిలో కలవడంతో ఢిల్లీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్‌కుమార్‌పై కేజ్రీవాల్ వేటు వేశారు. సందీప్‌ను మంత్రివర్గం నుంచి తొలిగిస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఎవరినైనా ఇలాంటి చర్యలే తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ చర్యలు ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తాయని సీఎం తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని, అధికారం అడ్డుపెట్టుకుని ఏం చేసినా చెల్లిపోతుందనకుంటే సరికాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  

సిద్దరామయ్య నిమ్మకాయ సీక్రెట్ ఏంటబ్బా..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నిమ్మకాయ వివాదంలో పడ్డారు. ఇప్పుడు కర్ణాటకలో ఆయన పట్టుకున్న నిమ్మకాయనే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ సిద్ద రామయ్య ఏంటీ.. ఆయన పట్టుకున్న నిమ్మకాయ గోల ఏంటి అనుకుంటున్నారా..అసలు సంగతేంటంటే.. సిద్దరామయ్య తన స్వస్థలం అయిన మైసూర్‌లో పర్యటించారు. అయితే ఆయన పర్యటనలో రోజు మొత్తం తన చేతిలో నిమ్మకాయ పట్టుకునే తిరిగారు. ఇది కాస్త మీడియా కంటపడటంతో దీనిపై వార్తలు జోరందుకున్నాయి. అసలు సిద్దరామయ్య నిమ్మకాయ ఎందుకు పట్టుకున్నారు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్లు చేస్తున్నారు. దుష్టశక్తులను ఎదుర్కోవడానికి ఏ మతపెద్దలో సిద్ధరామయ్యకు నిమ్మకాయ ఇచ్చివుంటారని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం..ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్‌ అకస్మాత్తుగా మృతిచెందడంతో సీఎంలో చాలా మార్పు వచ్చిందని..  ఏదో దుష్టశక్తి తన కుటుంబానికి హాని చేస్తోందని సీఎం అనుకుంటున్నారని, మిగతా కుటుంబసభ్యుల భద్రత గురించి బెంగ పడుతున్నారని, కొందరు జ్యోతిష్కులు ప్రత్యేక పూజలు చేయాలని సీఎంకు సూచించారని అంటున్నారు. మరి ఇంతకి సిద్దరామయ్య నిమ్మకాయ ఎందుకు పట్టుకున్నారో ఆయనకే తెలియాలి.

రియో స్టార్లకు ఢిల్లీ సర్కార్ సన్మానం...

రియో ఒలింపిక్స్ లో విజయం సాధించిన క్రీడాకారులకు తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా సత్కరించాయి. అయితే ఇప్పుడు రియో స్టార్లను ఢిల్లీ సర్కార్ ఘనంగా సత్కరించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రజత పతక విజేత పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌, వారి కోచ్‌లు గోపీచంద్‌, మన్‌దీప్‌లను ఘనంగా సత్కరించారు. అంతేకాదు తాను ప్రకటించిన నజరానాలను కూడా అందజేశారు. వారితో పాటు..  ఒలింపిక్‌ విజేతలకు అనుక్షణం తోడుగా ఉండి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో తోడ్పడిన ఫిజియోథెరపిస్టులను సైతం ఈ కార్యక్రమంలో సత్కరించారు.

ఇదే ఫైనల్.. ఇంకేప్పుడూ ఇలా చేయోద్దు.. మోడీకి ప్రణబ్

  మోడీ ప్రభుత్వానికి అప్పుడప్పుడు మొట్టికాయలు పడుతూనే ఉంటాయి. అయితే అది కోర్టులో చేతిలో కావచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ చేతిలో కూడా మొట్టికాయలు తినే పరిస్థితి వచ్చింది. ఓ ఆర్డినెన్స్ విషయంలో ప్రణబ్ ముఖర్జీ మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంతకీ చాలా సౌమ్యంగా ఉండే ప్రణబ్ కు అంతలా కోపం తెచ్చే పని మోడీ సర్కార్ ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఇండియాలో నివాసం ఉండి చైనా, పాకిస్థాన్ కు వలస వెళ్లిన వారి ఆస్తులను వేరొకరికి బదలాయించేందుకు మోదీ సర్కారు ఇటీవలే పార్లమెంటులో చట్టసవరణ కోసం ప్రయత్నించింది. అయితే ఈ చట్టసవరణకు లోక్ సభలో ఆమోదం పొందినా...రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోవంతో బిల్లు రాజ్యసభలో వీగిపోయింది. దీంతో మోడీ సర్కార్.. దీనిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని యోచించి అందుకోసం రాష్ట్రపతి అనుమతి కోసం పంపించింది. అయితే దీనిని పరిశీలించిన ప్రణబ్... పార్లమెంటు ఆమోదం పొందని ఓ ఆర్డినెన్స్ ను ఎలా తన వద్దకు పంపిస్తారని.. పక్కదారిన ఆర్డినెన్స్ తీసుకురావడం సరైన చర్య కాదని, కాకపోతే ప్రజాప్రయోజనాల దృష్ట్యా సంతకం చేస్తున్నానని నోట్ లో పేర్కొంటూ ఆమోదం తెలిపారు. అంతేకాదు ఇంకోసారి ఇలా చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి నోట్ రాసి పంపినట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ప్రణబ్ చెప్పినట్టు మోడీ సర్కార్ ఇలాంటి పనులు చేయకుండా ఉంటుదేమో చూడాలి.

భాగ్యనగరంలో వర్షానికి ఏడుగురి బలి..

హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి కుండపోతగా కురిసిన వర్షం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వర్షం దెబ్బకు ఇప్పటి వరకు ఏడుగురు బలయ్యారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పురాతన భవనాలు, గోడలు వర్షానికి కుప్పకూలుతున్నాయి. రామంతాపూర్‌లోని ప్రగతినగర్‌ ఇంపీరియల్ కాంప్లెక్స్‌ భవనం ప్రహరీగోడ కూలి పక్కనే ఉన్న గుడిసె మీద పడటంతో దానిలో నివసిస్తున్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా..మిగిలిన ఇద్దరు మాట్రిక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరోపక్క ముషీరాబాద్‌ బోలక్‌పూర్‌లో భారీ వర్షానికి పాత ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మహిళ, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడటంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు.

మళ్లీ బాల‌య్య కారుకి ప్ర‌మాదం

  నంద‌మూరి బాలకృష్ణ కారు  ప్రమాదానికి గురయింది. ఈ రోజు తెల్ల‌వారుఝామున‌ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద  డివైడర్ ను ఢీ కొంది.  అయితే ఆ స‌మ‌యంలో డ్రైవ‌ర్ త‌ప్ప కారులో ఎవ‌రూ లేన‌ట్టు తెలుస్తోంది. AP 02 AY 0001  అనే నెంబరు గ‌ల కారు కాన్స‌ర్ ఆసుప‌త్రి నుంచి జూబ్లీ హిల్స్‌లోకి బాల‌య్య ఇంటికి బ‌య‌ల్దేరింది. అయితే మార్గం మ‌ధ్య‌లో కారు అదుపుత‌ప్పి.. డివైడ‌ర్‌ని గుద్దుకుంది.  కారులోని ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో డ్రైవర్ కు ప్రమాదం తప్పింది. ఇటీవ‌ల అనంతపురం జిల్లాలోనూ ఇలానే బాల‌య్య కారు ప్ర‌మాదానికి గురైంది. ఆ స‌మ‌యంలో బాల‌కృష్ణ కారులోనే ఉన్నారు. అయితే సురక్షితంగా బయటపడ్డారు.

జైట్లీ పై ఒత్తిడి.. హోదాపై త్వ‌ర‌లో నిర్ణయం

  భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా ఈరోజు ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై తలెత్తుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంక‌య్య నాయుడు, సుజ‌నా చౌద‌రితో తన నివాసంలో చర్చలు జరిపారు. ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు, విశాఖ రైల్వేజోన్‌, పోల‌వ‌రం ప్రాజెక్టుతో పాటు ప‌లు అంశాల‌పై చర్చించినట్టు తెలుస్తోంది. వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఇద్దరూ ప్రత్యేక హోదా విషయంలో జైట్లీపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకుంటే రెండు మిత్రపక్షాలు తీవ్రంగా నష్టపోక తప్పదని వారు కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది.   ఈ సందర్బంగా కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ... చంద్రబాబు త‌న‌కు ఫోనులో ఇచ్చిన‌ ఆదేశాల మేర‌కు కేంద్ర‌మంత్రుల‌తో రాష్ట్ర వ్యవహారాలపై చ‌ర్చించామని తెలిపారు. కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీపై ఒక ముసాయిదా త‌యారుచేస్తోంద‌ని.. త్వ‌ర‌లో ఒక నిర్ణయం వెలువ‌డొచ్చని ఆయ‌న పేర్కొన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇదెక్కడి న్యాయం కేసీఆర్ బాబాయ్..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం గన్ పార్క్ వద్ద ఆమె ఎమ్మెల్యే బొడిగ శోభకు వ్యతిరేకంగా ధర్నాకు దిగగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.  తన ఆస్తులపై దాడులు జరుగుతుంటే, అదే విషయాన్ని నలుగురికీ తెలియజెప్పేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అరెస్ట్ చేయించడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొడిగ శోభ అరాచకాలు పెరిగిపోయాయని, ఆమెను అరెస్ట్ చేసే వరకూ ఉద్యమిస్తానని చెప్పిన రమ్య, రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఓ న్యాయం, ప్రజా ప్రతినిధులకు మరో న్యాయం జరుగుతోందని, ఇదెక్కడి న్యాయమని అడిగారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రాణాలు కాపాడిన మోడీ..

  ప్రధాని నరేంద్ర మోడీ పలువురు మీడియా ప్రతినిధులను కాపాడారంట. అయితే దానికి మోడీ ఫీట్లు గట్రా ఏం చేయలేదులెండి. అసలు సంగతేంటంటే.. మోడీ ఈరోజు గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. జామ్‌న‌గ‌ర్‌లో మీట నొక్కి డ్యామ్ నుంచి నీటిని విడుద‌ల చేశారు. అనంతరం ఆయన అక్కడే కొంచం సేపు నిలబడి నీటి ప్రవాహాన్ని అలా చూస్తుండి పోయారు. ఇంతలోనే ఆయన డ్యామ్ కు కాస్త దూరంలో జ‌ర్న‌లిస్ట్‌లు ఫొటోలు తీస్తూ కనిపించారు. అయితే వారు నీటి ప్రవాహాన్ని గమనించలేకపోయారు. అయితే ఇదంతా గమనించిన మోడీ వారికి చ‌ప్ప‌ట్లు కొడుతూ, చేతులు ఊపుతూ సిగ్నల్స్ ఇవ్వడంతో వాళ్లు అక్క‌డి నుంచి త‌ప్పుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయాన్ని గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ స్వయంగా వెల్ల‌డించడంతో మేటర్ బయటపడింది. మొత్తానికి మోడీ తన సమయస్ఫూర్తిని బాగానే ఉపయోగించారు.

చెత్తకుండీలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్..

ఎంతో కష్టపడి.. ప్రపంచ దేశాలన్నింటిపై పోటీ చేసి తమ సత్తా చూపిస్తే కానీ ఒలింపిక్స్ లో మెడల్స్ రావు. అలాంటిది ఏకంగా గోల్డ్ మెడల్ రావడమంటే మామూలు విషయం కాదు. అంత కష్టపడి తెచ్చుకున్న గోల్డ్ మెడల్ పోయిందంటే ఎలా ఉంటది.. అలాంటిదే జరిగింది ఓ క్రీడాకారుడికి. వివరాల ప్రకారం.. అమెరికన్ జో జాకొబి అనే క్రీడాకారుడు 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో రోయింగ్ క్రీడలో స్వర్ణపతకం గెల్చుకున్నాడు. అయితే తను తన మెడల్ ను పోగొట్టుకున్నాడు. ఈనేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఈ ఘటన జరిగిన రెండు నెలలకు.. అట్లాంటాలో  ఏడేళ్ల చిన్నారి కోల్ స్మిత్ కు చెత్తకుండీలో  గోల్డ్ మెడల్ దొరికింది. దానికి తీసుకొని చూసి అది జో జాకొబిదేనని నిర్ధారించుకుని దానిని అతనికి అందేలా చేశారు కోల్ స్మిత్ కుటుంబ సభ్యులు. దీంతో జాకొబి కోల్ స్మిత్ గురించి తెలుకొని తన స్కూల్ కు వెళ్లి ఆమెను అభినందించాడు. ఈ సందర్భంగా తనను చేరిన స్వర్ణ పతకాన్ని పిల్లలకి జాకొబి చూపించాడు.

కేజ్రీవాల్‌లాగే లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కూడా ఒక‌ 420.. స్వామి

  మరోసారి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తన నోటికి పనిచెబుతున్నారు. గతంలో ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఆ తరువాత అధిష్టానం ఆదేశం మేరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఎంతైనా సైలెంట్ గా ఉండాలంటే స్వామి గారికి కొంచెం కష్టంతో కూడుకున్న పనే.. అందుకే ఏదో కొన్ని రోజులు అలా ఉన్నా ఇప్పుడు వరుస పెట్టి మరోసారి నోరు పారేసుకుంటున్నారు. రాజన్ తో మొదలు పెట్టిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్.. ఆతరువాత జీఎస్టీ బిల్లు.. ఇప్పుడు కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌లాగే లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కూడా ఒక‌ 420 అని.. ఆయ‌న‌ వంచకుడని, త‌న అభిప్రాయం ప్ర‌కారం న‌జీబ్‌జంగ్‌ నిర్వ‌ర్తిస్తోన్న ప‌దవికి సరిపోరని.. ఆయ‌న నిర్వ‌ర్తిస్తోన్న బాధ్య‌త‌ల‌ను సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముందని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి ఈసారైనా ముందుగా పార్టీ స్వామి నోటికి అడ్డుకట్ట వేస్తుందా లేదా..వదిలేస్తుందా చూడాలి.

చంద్రబాబుపై పోరుకు.. ఒకే తాటిపైకి అందరూ..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గతంలో ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. అయితే అది కాస్త హింసాత్మకంగా మారినా.. ప్రభుత్వం ఎలాగో కల్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. దాంతో ముద్రగడ కూడా దీక్ష విరమించారు. అయితే ఆ తరువాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ముద్రగడ మళ్లీ దీక్ష చేశారు. దాదాపు పది రోజుల పైనే ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేశారు. దీంతో మళ్లీ ప్రభుత్వం కదిలి వచ్చి ఆయన డిమాండ్లు నెరవేరుస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా కాపులకు న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అంతేకాదు దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి గడువు కూడా ఇచ్చారు. దీంతో ముద్రగడ మళ్లీ దీక్ష విరమించారు. ఆ తరువాత కూడా పరిస్థితి యథావిథిగానే మారింది. ఈ నేపథ్యంలో ముద్రగడ మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు ఇంకో పదిరోజుల్లో ముగియనుండటంతో.. కమిషన్ నివేదిక ఇవ్వకున్నా, దాని ప్రకారం ప్రభుత్వంలో కదలిక లేకున్నా ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు.   ఈ చర్చలకు ఇప్పటికే ముద్రగడకు మద్దతుగా నిలిచిన దాసరి నారాయణరావు, కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో ఈరోజు ఆయన హైదరాబాద్లో భేటీ అయ్యారు. అంతేకాదు వైసీపీ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 11వ తేదీన కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. మొత్తానికి చంద్రబాబుపై పోరాడటానికి పార్టీల కతీతంగా అందరూ ఒకతాటిపైకి వచ్చారు. మరి చంద్రబాబు వీరందరినీ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం..