సిగ్గుచేటు.. టీ, సమోసాలకి 9 కోట్లు
posted on Sep 1, 2016 @ 5:10PM
రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ చలామణి అవుతారన్న సంగతి జగమెరిగిన సత్యమే. ఏదో ప్రజల సమస్యలను తీరుస్తారని చెప్పి.. వారిని నమ్మి పదవులు కట్టబెడతారు. కానీ వారు మాత్రం పదవి వచ్చినంత వరకూ ఒక లెక్క.. వచ్చిన తరువాత ఒక లెక్క అన్నట్టు ఉంటారు. అయితే కొన్ని సార్లు కొన్ని లెక్కలు బయటపడినప్పుడు మాత్రమే.. నేతలు ఎంత గొప్పగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల ఖర్చు చూస్తే ఎవరైనా ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. ఖర్చులంటే అవేవే అనుకుంటారేమో.. టీ, సమోసాల ఖర్చులు అవి. ఓస్ అంతేనా వీటికి ఎంత ఖర్చు అవుతుందిలే అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం ఉత్తరప్రదేశ్ మంత్రులు తమ అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామూన్ వంటి అల్పాహారం ఇవ్వడానికి రూ.9 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ 2012 మార్చి 15న అధికారం చేపట్టారు. ఈ నాలుగేళ్ల ఆయన పాలనలో ఉన్న ఆయన.. 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి రూ.8,78,12,474 ఖర్చయిందన్నారు. అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి అరుణ్ కోరి అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు అని చెప్పారు. మొత్తానికి ప్రజల సొమ్మును రాజకీయ నేతలు ఎంతలా వాడుకుంటున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు అనిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా నేటి రాజకీయాలు తయారయ్యాయి అనే దానికి ఇలాంటి సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనం.