అందులేనే ప్రత్యేక హోదా దాగి ఉందట..

ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకూ ఎవరికి నచ్చింది వాళ్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కేంద్రమంత్రి బీజేపీ నేత పురందరేశ్వరీ కూడా కొత్తగా చెప్పింది ఏం లేకపోయినా ఆమె చెప్పింది మాత్రం కొత్తగా మాత్రం అనిపించేలా ఉంది. అదేంటంటే.. ఈరోజు విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేవలం ప్రత్యేక హోదా అనే అంశం ఒక్కదాని గురించి మాట్లాడలేమని.. ప్రత్యేక ప్యాకేజీలోనే ప్రత్యేక హోదా అంశం దాగి ఉందని అన్నారు. ప్రత్యేక హోదానా లేదంటే ప్రత్యేక ప్యాకేజీనా అనే దానిపై చర్చ కంటే ఏపీకి ఎంత వరకు న్యాయం జరిగిందనే దానిపై మనం దృష్టిసారించాల్సి ఉందని వెల్లడించారు. ప్రత్యేక హోదా బదులు..ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే నేతలు దాన్ని ఆమోదించకపోయినా ప్రజలు మాత్రం ఆమోదిస్తారని బీజేపీ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. మరి పాపం ఇన్ని రోజులు తెలుగు ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలోనే ప్రత్యేక హోదా దాగిఉందన్న విషయం తెలియదు అందుకే.. ప్రత్యేక హోదా కావాలంటూ.. నేతలు, పలు పార్టీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా పురందరేశ్వరీ చెప్పినదాన్నిబట్టి అర్ధమవుతుందేమో చూడాలి..

హైకోర్టుకు కేజ్రీవాల్ చురకలు.. నన్నంటే ఏమోస్తుంది..

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్‌ పేరును తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు ఢిల్లీ హైకోర్టుకు కూడా చురకలు అంటించారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఢిల్లీలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల భీభత్సం కారణంగా వీధులు జలమై...రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు బాగు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు కేజ్రీవాల్ సర్కారుపై మండిపడింది. ఇక దీనికి కేజ్రీవాల్ తనదైన శైలిలో కోర్టుకు చురకలు అంటించారు. ఒకవైపు పరిపాలనా పరమైన నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌దే తుది నిర్ణయమని.. లెఫ్టినెంట్ గవర్నరే సమస్తమని చెప్పే కోర్టు.. ఇప్పుడు రాష్ట్రంలో తలెత్తిన లోపాలపై మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా.. వర్షం వల్ల నిలిచిపోయిన నీళ్లు, రహదారుల మరమ్మత్తుపై కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రశ్నించాలి అని అన్నారు. మరి కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

సందీప్ కుమార్ కేసులో ట్విస్ట్..

  ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల వీడియోలు ఇప్పటికే దుమారం రేపుతుంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఆ వీడియోల్లో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో భాగంగా రేషన్ కార్డు విషయం మాట్లాడేందుకు మంత్రిగా ఉన్న సందీప్ వద్దకు వెళ్ళానని, ఆ సమయంలో కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చారని, డ్రింక్ తాగాక తాను అపస్మారకస్థితిలోకి వెళ్లానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత వేడిపుట్టిస్తుంది. అంతేకాదు ఒకవేళ ఆ మహిళ చేసిన ఆరోపణలు నిజంగా.. నిజమని తేలితే ఈ కేసును తీవ్రంగా పరిగణించాలని, సందీప్నకు కఠినశిక్ష విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

రజతం నుండి స్వర్ణానికి యోగేశ్వర్ దత్...

  సాధారణంగా నక్క తొక్కితే అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. కానీ భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ కి మాత్రం అలాంటి తోకలు ఏం తొక్కకుండానే అదృష్టం కలిసివచ్చింది. ఇటీవలే అదృష్టవశాత్తు లండన్ ఒలింపిక్స్- 2012 లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్ దత్ సిల్వర్ పతకం సాధించాడు. ఆ ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన రష్యా రెజ్లర్ బెసిక్ కుద్ కోవ్ డోపింగ్ కు పాల్పడ్డాడని తేలడంతో తాను సాధించిన రజత పతకాన్ని యోగేశ్వర్ దత్ కి ప్రధానం చేశారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. అదే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన అజర్ బైజాన్ రెజ్లర్ తోగ్రుల్ అస్గరోవ్ కూడా డోపీయేనని తేలింది. దీంతో ఇంకేముంది అతనిపై కూడా వేటు పడనుంది. దాంతో పాటు అతను సాధించిన స్వర్ణ పతకం యోగేశ్వర్ దత్ కు దక్కనుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య ఎదురుచూస్తోంది.

ఇకపై బహిరంగ వివాహాలు రద్దు..

  ఇటీవల ఉగ్రవాదులు వరుస దాడులు జరిపి టర్కీ ప్రజల్లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఓ వివాహ వేడుకలో ఉగ్రవాది దాడి జరిపి మారణహోమం సృష్టించాడు. ఈనేపథ్యంలో టర్కీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..టర్కీలో బహిరంగ వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించుకోవడంపై నిషేధం విధించింది. ఈమధ్య జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని వాటిని అరిక‌ట్ట‌డానికే ఆ దేశ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అంతేకాదు వివాహాలు ఇండోర్‌లో జ‌రుపుకోవాల‌నుకున్నా.. దాని కోసం అధికారుల‌కు స‌మాచారం అందించాల్సి ఉంటుంది.. దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు దాడులు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాయి.. అంతేకాని ప్రభుత్వ ఆదేశాల‌ను లెక్క‌చేయ‌కుండా వేడుక‌లు నిర్వ‌హిస్తే జరిమానా విధిస్తామని తెలిపారు.

మాల్యా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ... రూ.6,630 కోట్లు

  బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం వేసి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంలో మాత్రం ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)  బాగానే దర్యాప్తు వేగం చేస్తుంది. మాల్యా ఆస్తులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేలం వేయడం.. లేదా వాటిని జప్తు చేయడం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మాల్యాకు సంబంధించిన కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మాల్యాకు చెందిన దాదాపు రూ.6,630 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో మాల్యాకు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్ తో పాటు షాపింగ్ మాల్, పలు కంపెనీల్లోని ఆయన షేర్లు ఉన్నాయి. కాగా విచారణకు హాజరుకావాలన్న తన నోటీసులకు ససేమిరా అంటున్న మాల్యాకు ఇప్పటికే కోర్టు ద్వారా ఈడీ సమన్లు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

మోడీ వియాత్నం పర్యటన.. 12 కీలక ఒప్పందాలు..

  భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం వియాత్నం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మోడీ పలు అంశాలపై చర్చలు జరిపి ఒప్పందాలు జరిపినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి వియాత్నం చేరుకున్న మోడీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం.. ఆదేశ ప్రధానితో చర్చలు జరిపారు. ఈనేపధ్యంలో భారత్‌-వియత్నాం మధ్య 12 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. వియత్నాంతో ఒప్పందం వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందని..  ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని.. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని తెలిపారు.  

కొత్త జిల్లాలపై కాంగ్రెస్ నేతల దీక్ష..

  తెలంగాణ రాష్ట్రం కొత్తగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుటికే వాటికి సంబంధించిన ఫొటోలు, మ్యాప్ లపై అధికారులు కసరత్తు చేసి పదిహేడు జిల్లాలతో కూడిన పటాన్ని విడుదల చేశారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు నిరహార దీక్ష చేపట్టారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఇతర నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరుగుతోందంటూ జిల్లా పునర్‌వ్యవస్థీకరణ ప్రజాభీష్టం మేరకు కాకుండా.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేస్తున్నారని ఆరోపించారు. జనగామ, గద్వాల జిల్లాలు ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. రెండురోజుల పాటు దీక్ష చేస్తామని చెప్పారు.

పార్టీ నుంచి సందీప్ కుమార్ సస్పెండ్...

  ఆప్ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయనను పదవి నుండి తప్పించారు. అయితే ఇవాళ పార్టీ నుంచి కూడా సందీప్ కుమార్ ను సస్పెండ్‌ చేశారు. సందీప్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు శనివారం ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ విలువల విషయంలో రాజీ పడేది లేదని, తప్పులను సహించడం కన్నా చావడానికైనా తాము సిద్ధంగా ఉంటామని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు వీడియోలపై విచారణ చేపట్టేందుకు దిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సందీప్‌తో పాటు ఆ వీడియోలో కన్పించిన ఇద్దరు మహిళలను కూడా పోలీసులు విచారించనున్నారు.   ఇదిలా ఉండగా సందీప్ కుమార్ మాత్రం వీడియోలో ఉంది తాను కాదని..ఆ సీడీ అంతా ఓ కుట్ర అని సందీప్‌ ఆరోపిస్తున్నారు. మరి ఏది నిజమో.. అబద్దమో తెలియాలంటే దర్యాప్తు జరిగేంత వరకూ ఆగాల్సిందే.

ఇదో ఫైవ్ స్టార్ శ్మశానం కథ...

  ఈ ఫోటోలో ఉన్న భవనం చూస్తే ఏమనిపిస్తోంది. ఇంకేమనిస్తుంది.. ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్, లేక కార్పోరేట్ సంస్థలు ఉండే భవనమో అనిపిస్తుంది కదా. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవేమి కావు.. ఇది అక్షరాల ఓ శ్మశానం.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. ఇంతకీ ఆ శశ్మానం ఎక్కడ ఉందనుకుంటున్నారా.. బ్రెజిల్‌లో. బ్రెజిల్‌లోని సాంటోస్‌లో ఈ శ్మశానం ఉంది. దీనిపేరు ‘మెమోరియల్‌ నెక్రోపోల్‌ ఎక్యుమెనికా’.1986లో ఈ శ్మశానాన్ని నిర్మించారు. 108 మీటర్ల అందమైన భవనం.. 35 అంతస్తులతో ఆకాశానికి చేతులు చాచే ఎత్తు.. చుట్టూ అరుదైన చెట్లతో నిండిన ఉద్యానవనాలు.. అందులో ముచ్చటగొలిపే వాటర్‌ ఫౌంటేన్‌లు.. నెమలి పార్క్‌.. ఓ జలపాతం.. ఆకలి తీర్చే ఫలహారశాల.. ప్రార్థనలు చేసుకోవటానికి ఓ పెద్ద చర్చి.. సేద తీరడానికి లగ్జరీ రూమ్‌లు ఇవన్నీ శశ్మానంలో ఉంటాయి. ఈ శశ్మానంలో 25,000 మృతదేహాలకు సరిపడా సామర్థ్యం ఉంది.  ఇందులో ఉన్న 32 ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్‌కి దాదాపు 150 సమాధులు,అందులో ఒక్కోదానిలో ఆరు మృతదేహాలు పడతాయి. ఇందులో సమాధి చేసే మృతదేహాలు దాదాపు 3 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయట. అయితే లగ్జరీగా ఉన్న ఈ శశ్మానంలో మృతదేహాన్ని భద్రపరుచుకోవడానికి 5వేల నుంచి 20,000 డాలర్ల వరకూ ఖర్చవుతుందట. మరి ఈ మాత్రం ఫెసిలిటీస్ ఉంటే ఆ మాత్రం చెల్లించాలి కదా. మరి ఇన్ని సదుపాయాలు ఉన్న ఈ శ్మశానం గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించకుండా ఉంటుందా.. అందులో కూడా చోటు దక్కించుకుంది.  

తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి.. కల నెరవేరెనా..!

  తమిళనాడు గవర్నర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య పదవికాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలు తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులకు అప్పగించినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా తమిళనాడు గవర్నర్ పదవి మోత్కుపల్లిని విరస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వాలని మోడీని కోరినట్టు వార్తలు వినిపించాయి. అయితే చాలా రోజుల నుండి ఈ వ్యవహారం కాస్త సస్పెన్స్ లోనే ఉంది. కానీ ఇప్పుడు ఈ అనుమానాలన్నింటికి తెరపడింది ఇప్పుడు. తమిళనాడు గవర్నర్ పదవి మోత్కుపల్లికి ఇస్తూ మోడీ సర్కార్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వినాయకచవితి తర్వాత ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకావాలున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే పదవికి  ఆనంది బెన్ పటేల్ కూడా పోటి పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మోడీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనంది బెన్ పటేల్ ను నియమించే యోచనలో ఉన్నా.. ఆనందిబెన్ పటేల్ మాత్రం తనకు తమిళనాడు గవర్నర్ పదవే కావాలని పట్టుబడుతుంది. అంతేకాదు తెలుగు స్థానికతకు కాస్తంత దగ్గరగా ఉన్న తమిళనాడుకు గవర్నర్ గా వెళ్లేందుకు మోత్కుపల్లి ఆసక్తిగా ఉన్నారు. దీంతో బీజేపీ సర్కారు డైలమాలో పడింది. ఈ వ్యవహారంపై ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు గుజరాత్ లోనూ ఆసక్తికర చర్చకు తెర లేచింది. మరి ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. మోత్కుపల్లి కల నెరవేరుతుందా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

రెచ్చిపోయిన ఖాకీ కుమారుడు...

అధికారం చేతిలో ఉంది కదా అని అధికారులు రెచ్చిపోవడం చూస్తూనే ఉంటాం. మరి అధికారుల సుపుత్రులు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటారు. వారు కూడా వారి తండ్రిగారి అధికారాన్ని చూపించుకొని రెచ్చిపోతుంటారు. అలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఓ ఖాకీ కుమారుడు పొట్టకూటి కోసం వాచ్ మన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై కండకావరంతో రెచ్చిపోయాడు. వివరాల ప్రకారం.. కరన్ బాగ్ లోని ఓ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మన్ గా పనిచేస్తున్న అమృత్ అనే వ్యక్తిపై రంగారెడ్డి జిల్లా పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్ కుమారుడు పృథ్వీరాజ్ దాడికి దిగాడు. నలుగురు కానిస్టేబుళ్లను వెంటేసుకుని మరీ అమృత్ పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. దీంతో అమృత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు పృథ్వీరాజ్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు పృథ్వీరాజ్ తండ్రి సీఐ వేణు గోపాల్ కూడా తన కొడుకు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

పవన్ పై నారా ప్రశంసలు.. అందుకేనా..!

  ప్రత్యేక హోదా విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొంతమంది విమర్శల బాణాలు వదులుతుంటే.. మరికొంత మంది మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో ఇప్పుడు టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా చేరిపోయారు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా  పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ లోకేశ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అద్బుతమైన వ్యక్తని.. పవన్ ఒక వండర్‌ఫుల్ పర్సన్ అని, అరుదైన వ్యక్తిత్వం గల మనిషని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు లోకేశ్ చేసిన ట్వీట్ పై పలువురు పలు రకాలుగా అంటున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్‌ పనిచేయకుండా జాగ్రత్త పడడంలో భాగంగానే నారా లోకేష్ ఆ ప్రశంసలు చేసినట్లు అనుకుంటున్నారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిదే కాబట్టి లోకేశ్ ఆ ఉద్దేశ్యంతోనే ప్రశంసించారా.. లేక అందరూ అనుకుంటున్నట్టు తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుడదనే ఉద్దేశ్యంతోనే ప్రశంసించారా.. తనకే తెలియాలి.

వపన్ పై పొగడ్తలు కురిపించిన వర్మ..

  రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు. గతంలో పవన్ కళ్యాణ్ పై ట్వీట్స్ చేసి దుమారం రేపిన మరోసారి పవన్ పై ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే ఈసారి పొగుడుతూ ట్వీట్లు చేశారు. ఇంతకీ వర్మ చేసిన ట్వీట్లు ఏమనుకుంటున్నారా... తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన వర్మ.. పవన్ కల్యాణ్ ను మించిన నిజాయితీ గల నేత యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరూ లేరన్నారు. పవన్ తీక్షణమైన ఆలోచనా విధానమే ఆయన ‘పవర్’ అని, అంకిత భావమే ఆయన స్టార్ డమ్ అంటూ ప్రశంసించాడు. పవన్ కల్యాణ్ మాట్లాడిన మొత్తం స్పీచ్ చూశానని, ఆయన ఏ విషయాలపై అయితే మాట్లాడాడో, వాటిని ఆయన పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మూడు స్థాయిల్లో ఉద్యమించాలన్న ఆయన ఆలోచన కరెక్టు అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తిని కల్గి ఉన్న ఏపీ ప్రజలు చాలా అదృష్టవంతులంటూ పవర్ స్టార్ పై వర్మ ఆయా ట్వీట్లలో ప్రశంసలు కురిపించారు. మొత్తానికి ఎప్పుడు విభిన్నంగా ఆలోచించే వర్మ కూడా పవన్ మాటల్లోని ఆంతర్యం అర్ధమైంది..

2 వేలమంది ఖైదీల నిరాహార దీక్ష..

ఒకరు కాదు ఇద్దరు ఏకంగా రెండు వేల మంది ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. అది కూడా తోటి ఖైదీలకు సహాయం చేయడానికి. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. ఆగ్రా జైలులో కొంత మందికి  14 ఏళ్ల జైలు శిక్ష ముగిసింది. అయితే వారిని విడుల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తోటి ఖైదీలు ఆందోళన చేపట్టారు. 14 ఏళ్ల జైలు శిక్ష ముగిసిన వారందర్నీ విడుదల చేయాలని, అంతవరకు తాము నిరాహార దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తమను పరామర్శించాలని, ఆయనతో తమ గోడును వెళ్లబోసుకుంటామని వారు చెబుతున్నారు. కాగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కొత్త పార్టీలోకి నవజ్యోత్ సింగ్..

  బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ నవజ్యోత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా.. లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం సిద్దూ ఆప్ పార్టీలోనే చేరుతారు అనుకున్నారు. కానీ సిద్దూ డిమాండ్లకు ఆప్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు సిద్దూ కొత్త రాజకీయ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 9న ప్రారంభం కానున్న ఆవాజ్-ఇ-పంజాబ్ అనే రాజకీయపార్టీలో సిద్ధూ చేరనున్నట్లు సమాచారం. దీంతో సిద్దూ ఏ పార్టీలో చేరుతారో అన్న సందేహాలకు తెరపడింది.

రాహుల్ ట్వీట్ పై దుమారం... ధైర్యం ఎలా వచ్చింది..

  మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలకు గాను ఆల్‌ ఇండియా రేడియో ఓ ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడా ట్వీట్ పెద్ద దుమారమే రేపుతుంది. ముందు ఆరెఎస్ఎస్ ను నేను అలా అనలేదు.. అని అన్న రాహుల్ గాంధీ.. ఆతరువాత ఆరెస్సెస్‌ వేసిన పరువు నష్టం దావాపై విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు.. కేసు కొట్టేయాలని సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు రాహుల్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా రేడియో ఓ ట్వీట్ చేసింది. అదేంటంటే...   ‘రాహుల్‌ ముందు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు కేసు విచారణ ఎదుర్కొనే ధైర్యం ఎలా వచ్చింది. రాహుల్‌ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి’ అని ఆల్‌ఇండియా రేడియో ట్వీట్‌ చేసింది.     అంతే ఈ ట్వీట్ కు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఓ అధికారిక ప్రసార మాధ్యమం రాహుల్‌ గాంధీపై ఇలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, అది క్షమించరాని చర్య అని రణదీప్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఇలా చేయమని వెంకయ్యనాయుడు ఆదేశించారా అని అన్నారు. ఇక దీంతో వ్యవహారం కాస్త వేడిగా అవ్వడంతో ఆల్‌ ఇండియా రేడియో సంస్థ ట్వీట్ ను డిలీట్ చేసింది.

92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా..

  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాద బీమా అమల్లోకి వచ్చింది. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ నుంచి కౌంటర్లలో ఇస్తున్న టికెట్ల వరకూ ఖరీదుపై 92 పైసల ప్రీమియాన్ని వసూలు చేస్తున్నారు. ఈ ప్రమాద బీమా పథకం ద్వారా.. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, అంగవికలురైతే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్సకు రూ. 2 లక్షలు బీమా అందుతుంది. అంతేకాదు మృతదేహాలను ప్రమాదస్థలి నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు రూ. 10 వేలు సైతం అందుతుంది అదనంగా అందుతుంది. కాగా సబర్బన్ రైళ్లు మినహా మిగతా అన్ని రైళ్లలో ప్రయాణాలు జరిపే వారికి బీమా వర్తిస్తుంది.