జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసే అవకాశం ఉంది...
posted on Oct 10, 2016 @ 2:53PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత రెండు వారాలకు పైగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న ఆమెను చూడటానికి పార్టీ నేతలు మాత్రం ఎవ్వరినీ అనుమతించట్లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం జయలలితను కలుసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. జయలలితకు సన్నిహితురాలైన ఒక్క శశికళ మాత్రమే ఆమె దగ్గర ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ శశికళ పుష్ప ఆమెపై విమర్శలు గుప్పించారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ.. అది కూడా ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలనుకుంటున్నారని.. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు.