సొంత పార్టీ నేతలపైనే ట్రంప్ యుద్ధం...
posted on Oct 12, 2016 @ 11:48AM
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రిపబ్లికన్ పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రజల్లో వ్యతిరేక భావం నెలకొంటుంది. ఇప్పటికే రెండు ప్రెసిడెన్షియల్ డిబేట్ లో హిల్లరీ క్లింటన్ మంచి మార్కులు కొట్టేయగా.. ట్రంప్ మాత్రం కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన యుద్దానికి దిగారు. ఇప్పటికే పలువురు నేతలు ఆయన పార్టీ నుండి తప్పుకుందామని చూస్తున్న వేళ..ఇప్పుడు హౌస్ స్పీకర్ పాల్ డీ ర్యాన్, (విస్కాన్సిన్), సెనెటర్ జాన్ మెక్ కెయిన్ (ఆరిజోనా)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మెక్ కెయిన్ నోటి తీరు సరిగ్గా లేదని, ఒకప్పుడు తన మద్దతు కోసం అడుక్కున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి మద్దతు తనకు అవసరం లేదని, ముఖ్యంగా ర్యాన్ వంటి వారితో ఎలాంటి ఉపయోగం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించడం అంటే వారిని వారు తిట్టుకోవడమే అని అన్నారు. కాగా మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 30 మందికి పైగా రిపబ్లికన్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపి, ఆయనకు అనుకూలంగా ఓటు వేయబోమని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మరి ట్రంప్ ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల్లో గెలవడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.