కొత్త చాంబర్ లో కాలు పెట్టిన చంద్రబాబు... రుణమాఫీ ఫైల్ పై సంతకం
posted on Oct 12, 2016 @ 11:23AM
ఏపీ నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయంలో దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన ఛాంబర్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్ కూడా పూర్తవడంతో ఆయన ఈరోజు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య తన చాంబర్ లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై పాలన అమరావతి కేంద్రంగానే సాగుతుందని.. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు. అనంతరం ఆయన ఆపై పెండింగ్ లో ఉన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైల్ పై సంతకం చేస్తూ.. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్, డీజీపీ సాంబశివరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.