ప్రవేటు షాపుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మందులు
posted on Aug 3, 2012 @ 12:13PM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు మాఫీయా చేతుల్లోకి చేరుకుంటున్నాయి. దీనిని నియంత్రించాల్సిన ఔషద నియంత్రణ శాఖ నిర్యక్ష్యం వహిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రవేటు ఆసుపత్రులకు వెళ్లలేని వారంతా ఆధారపడే ప్రభుత్వాసుపత్రుల పనితీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కొన్ని ఖరీదైన మందులు, ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి దొడ్డి దారిన మందుల మాఫియా చేతుల్లోకి అక్కడి నుంచి ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి తరలిపోతున్నాయాని తెలుస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను బయటి మందులషాపులకు ఈ మాఫియా ముఠా అమ్ముకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి. రాష్ట్రంలోని పిహెచ్‌సిలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ విడుదల చేస్తారు. వీటిని జిల్లాల డ్రగ్స్ కేంద్రాలనుండి అన్ని పిహెచ్‌సిలకు సరఫరా చేస్తుంటారు.
పిహెచ్‌సిలకు అత్యవసరమైన యాంటీ ర్యాబీస్ వాక్సిన్, పాముకాటుకు ఉపయోగించే యాంటీ వీనమ్ మందులు, సెలైన్లు డ్రగ్ మాఫియా చేతుల్లోకి వెళుతుండటం గమనార్హం. దీనికి నిదర్శనంగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లోని మందులు ఓ ప్రయివేటు మందుల షాపులో దొరకటమే. పిహెచ్‌సిలు, సబ్‌సెంటర్లు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పౌష్టికాహార కేంద్రాలు గొలుసుకట్టుగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో వుండాల్సిన మందులు బయట షాపుల్లో ఉండటం సామాన్యమయిపోయిందని డాక్టర్లు కూడా ఒప్పుకోవడం గమనార్హం.