విద్యుత్ కోతల్లో వరల్డ్ రికార్డ్
posted on Aug 1, 2012 @ 9:54AM
కరెంట్ ఆదా చేయ్యడమంటే కరెంటును ఉత్పత్తి చేయడమే అనే స్లోగన్ కరెంట్‌ను పొదుపుగా వాడుకోవాలనే సదుద్దేశంతో జన్‌కో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కరెంటు బిల్లు కడుతున్నాము కదా అని ఎడాపెడ వాడకూడదు కదా. ఒక ప్రక్క కరెంటు వినియోగదారులు రోజురోజుకు పెరగటం, పెరిగిన అవసరాలకు తగినంత ఉత్పత్తి చేయలేక పోవడం ప్రభుత్వ వైఫల్యం. అనవసర విద్యుత్ వాడకాన్ని నివారించుకోలేక పోవడం ఇప్పుడు సీరియస్ సమస్య అయ్యింది. ఇప్పటికే మన దేశం విద్యుత్ కోతల్లో వరల్డ్ రికార్డు సృష్టించింది. మన దేశం విధిస్తున్నంతగా మరేదేశం విద్యుత్ కోతలు విధించడం లేదు.
దీనికి తోడు ఉత్తర భారతదేశంలో పవర్‌గ్రిడ్ వైఫల్యం వల్ల డిల్లీతో సహా 8 రాష్ట్రాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని రాష్ట్రాలు ముందు చూపులేకుండా అవసరాలకు మించి అధికవిద్యుత్‌ను వాడుకోవడం, పవర్‌గ్రిడ్‌లను ఎప్పటికప్పుడు పరిరక్షించుకునే పటిష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రధాన మంత్రి ఇంటినుండి సామాన్యుడు ఇంటివరకు కరెంటు లేని ఇళ్లను చూడవలసి రావడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల కారుచీకట్లో అల్లాడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. విద్యుత్ సరఫరాను పునరుద్దరించడానికి 15 గంటల సుదీర్ఘ సమయం పడుతుండటం కొసమెరుపు. దేశం నిండా బొగ్గునిల్వలు ఉన్నాయి. నదులకు కొదవలేదు, గ్యాస్ సమృద్దిగా ఉంది అయినా విద్యుత్ లేకపోవడానికి కారణం ముందుచూపు లేకపోవడమే. రెండో రోజు కూడా ఉత్తరాధి అంతా గ్రిడ్ ఫెయిల్యూర్ సమస్యతో మెట్రోరైళ్లు తో సహా అన్ని ఆగిపోయి ప్రజల సహనానికి పరీక్ష పెట్టాయి. దేశంలో ఇప్పటిదాకా ఇంత ధారుణంగా గ్రిడ్‌లు ఫెయిల్యూర్ కాలేదు. ఆర్ధికాభివృద్దిలో అభివృద్ది చెందుతున్న దేశాలతో పోటీ పడుతున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్న మనం సరిగా విద్యత్‌ను కూడా సరఫరా చేయలేని దుస్ధితిలో ఉండడం శోచనీయం.