రాష్ట్ర యూనివర్శిటీల్లో డ్రగ్స్ మాఫియాలు?
posted on Aug 3, 2012 @ 12:10PM
మాదకద్రవ్యాలను వాడటం ద్వారా ఎక్కువ ఎంజాయ్‌మెంట్ దొరుకుతుందనే నిశ్చితమైన అభిప్రాయానికి డబ్బున్న వారి పిల్లలను వ్యాపారులు తీసుకువస్తున్నారు. తమ వ్యాపారాలకు యూనివర్సిటీ క్యాంపస్‌లూ, నగరాల్లోని పబ్‌లను వేదికగా చేసుకుంటున్నారు. ఈ మాదకద్రవ్యాల వ్యాపారం గ్యాంగ్‌లో ఉన్న ఒకరు విద్యార్థిగా యూనివర్సిటీలో చేరి తన తోటి డబ్బున్న వారి పిల్లలను ఆకర్షించి వ్యాపారాన్ని పెంచుతుంటారు. ఫక్తు సినీఫక్కీలో ఈ వ్యాపారం మూడుపువ్వులూ ఆరుకాయల్లా విస్తరిస్తోందని నిఘావర్గాలు గుర్తించాయి. అయితే యూనివర్సిటీల్లో దర్యాప్తు చేయటం కష్టమై నిఘావర్గాలు మౌనం వహించాయి. ఇప్పటికే పలుయూనివర్సిటీలపై ఈ మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలు వచ్చాయి. ఇక శెలవుదినాలు, రాత్రులు పబ్‌ల్లో మాదకద్రవ్యాలు అమ్మకం కొనసాగుతోంది. దీనిపై నేరుగా దాడి చేస్తే రాష్ట్రపాలకుల్లో కీలకమైన నేతల పిల్లలు, ఇతరులు దొరుకుతున్నారని వదంతులూ ఉన్నాయి.
కొన్నిసార్లు ఈ విషయం నిరూపితమైంది కూడా. అయితే యూనివర్సిటీల్లో జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారానికి హైదరాబాద్ ఉస్మానియాయూనివర్సిటీ సాక్ష్యంగా చూపవచ్చు. తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఇతని నుంచి భారీస్థాయిలో కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మేల్కొన్న నిఘావర్గాలు తమ దర్యాప్తునకు పదునుపెట్టి అన్ని యూనివర్సిటీలపైనా కన్నేసింది. త్వరలో మరిన్ని దాడులు జరుగుతాయని సమాచారం.