జగన్ తెలంగాణపై నోరు విప్పాలి

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తన వైఖరి చెప్పాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి బుధవారం అన్నారు. జగన్ పార్టీ పెట్టాడు కనుక ఇప్పుడు తెలంగాణపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామాను ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ ఆమోదించాలని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెబుతూనే వ్యతిరేకంగా నడుస్తున్నాడని ఆరోపించారు. అధిష్టానానికి అనుకూలంగా ఉంటానని చెబుతూ తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

'10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు'

హైదరాబాద్: ఏప్రిల్ 14 నుంచి 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ఆయా జిల్లాల ప్రత్యేక వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. పరేడ్ మైదానంలో 27న ఉద్యమ దశాబ్ది బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. జనలోక్ పాల్ బిల్లు కోసం అన్నాహజారే చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు తక్షణమే మిగిలిన రూ. 200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రైతులకు 7 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని, పెరిగిన విద్యుత్తు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పట్టాన గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన త్రాగునీటిని సరఫరా చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై రైల్వే శాఖ పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల క్షేమం కోసం ఈనెల 14 నుంచి 16 వరకు చండీయాగం చేస్తానని వివరించారు. బీబీనగర్ నిమ్స్ ను ప్రైవేటీకరణ చేస్తే ప్రతిఘటన ఎదురవుతుందని, కొనుగోలుదారులు నష్టపోతారని చెప్పారు.

కిరణ్ కూ డీఎస్ కూ మధ్య వాదన

హైదరాబాద్: కడప లోక్ సభ అభ్యర్థి ఖరారు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. వీరిద్దరు బుధవారం ఉదయం కడప జిల్లా పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమావేశం సాయంత్రానికి వాయిదా పడింది. అయితే, అభ్యర్థి ఖరారు బాధ్యతను తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు అప్పగించామని కడప జిల్లాకు చెందిన పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోక్ సభ సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, తెలుగుదేశం నుంచి వచ్చిన వెంటనే కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని డి. శ్రీనివాస్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా కందుల అభ్యర్ధిత్వం కడప లోక్ సభ నుంచి ఖరారైనట్లే తెలుస్తోంది.

సాయి ట్రస్టు ప్రభుత్వపరం కానుందా?

అనంతపురం: సత్యసాయిబాబా ఆరోగ్యం కోసం వేలాది మంది భక్తులు పూజలు, హోమాలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. సత్యసాయి ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ట్రస్టు సభ్యుల్లో సత్య సాయి సోదరుడు జానకీరామ్ కుమారుడు రత్నాకర్ మాత్రమే ఉన్నారు. సత్య సాయి బాబా తన వారసుడిని కూడా ప్రకటించలేదు. ఈ స్థితిలో పుట్టపర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని మంగళవారం సాయంత్రమే పంపింది. ఈ బృందం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాలను అధ్యయనం చేస్తోంది. ఈ బృందం సత్యసాయి బాబా ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతుందని అంటున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలను కొ నసాగించడానికి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయనే విషయాన్ని ట్రస్టు సభ్యులతో మాట్లాడి సభ్యులు పరిశీలిస్తున్నారు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టు స్వాధీనంలో పుట్టపర్తిలో విశ్వవిద్యాలయ సముదాయం, స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రపంచ మత సంబంధం మ్యూజియం చైతన్య జ్యోతి, ప్లానిటోరియం, రైల్వే స్టేషన్, హిల్ వ్యూ స్టేడియం, సంగీత కళాశాల, పాలనా భవనం, విమానాశ్రయం, ఇండోర్ స్టేడియం, క్రీడాప్రాంగణం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో 1,200 సత్య సాయిబాబా కేంద్రాలున్నాయి. ఇవి పాఠశాలలను, ఆరోగ్య, సాంస్కృతిక కేంద్రాలను నడుపుతున్నాయి. కాగా, ఆదాయం పన్ను శాఖ అంచనాల ప్రకారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 40 వేల కోట్ల విలువ చేస్తుంది. ట్రస్టుకు వచ్చే విరాళాలపై పూర్తిగా పన్ను రాయితీ ఉంది. విదేశాల నుంచి ట్రస్టుకు ఏటా వందలాది కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. జమాఖర్చుల వ్యవహారాలకు సంబంధించిన సరైన యంత్రాంగం ఉందా, లేదా అనే విషయంతో పాటు ట్రస్టును స్వాధీనంలోకి తీసుకునే విషయంపై కూడా సుబ్రహ్మణ్యం దృష్టి పెడతారని అంటున్నారు.

పవన్ 'తీన్‌మార్' పై ఓయూ ఆగ్రహం

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీన్‌మార్ చిత్రంపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై విద్యార్థులు తమ ఆగ్రహాన్ని చూపించారు. తీన్‌మార్ పోస్టర్లపై విద్యార్థలు గుడ్లు, టమోటాలు విసిరారు. కూడలిలో భారీగా ఉన్న ఫ్లక్సీలను చించివేసి వాటిని దగ్థం చేశారు. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీన్‌మార్ చిత్రం టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి పార్టీ స్థాపించి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటంతో తెలంగాణ విద్యార్థులు పవన్ కల్యాణ్ చిత్రాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీన్‌మార్ అనేది తెలంగాణకు సంబంధించిన పేరని, పవన్ కల్యాణ్ తీన్‌మార్‌ను కించపరిచేలా ఆ పేరును పెట్టుకున్నారని వరంగల్ జిల్లాకు చెందిన తీన్‌మార్ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ఆరోపించారు. తీన్‌మార్ పేరును తొలగించాలని అప్పుడు డిమాండ్ చేశారు. తాజాకా ఓయు విద్యార్థులు తీన్‌మార్ చిత్రం టైటిల్‌పై మరోసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో సోనియాపై మండిపడ్డ జగన్

కడప: కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానానికి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అధికార అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఆయన జమ్మలమడుగు నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మీరు వేసే ప్రతి ఓటు భవిష్యత్తు రాజకీయాల్లో కీలక మార్పునకు నాంది పలుకుతుందని జగన్ ప్రచారంలో పేర్కొన్నారు. ఉప ఎన్నికల కోసం జగన్ తల్లి విజయమ్మ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె తన నియోజకవర్గం పులివెందులలో ప్రచారం ప్రారంభించారు. లింగాల మండలంలోని పార్నపల్లెలో ఆమె ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రచారానికి ముందు గ్రామంలోని ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయమ్మకు తోడుగా కూతురు షర్మిళ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తొండూరు మండలంలో జగన్ సతీమణి భారతి ప్రచారం ప్రారంభించారు. పులివెందుల నుండి విజయమ్మను, కడప స్థానం నుండి జగన్‌ను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారానికి ముందు జగన్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

ఆర్మీ గౌరవ హోదా పొందనున్న ధోనీ

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు టీమీండియా తరపున బ్లూ డ్రస్ ధరిస్తున్నభారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని ఇకపై.. భారత ఆర్మీ ధరించే ఆలివ్ గ్రీన్ డ్రస్ ధరించనున్నాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ కప్ సాధించి దేశ కీర్తిని పెంచిన ధోనీకి భారత సైన్యం గౌరవ అధికారి హోదాను ఇవ్వనుంది. ధోనీతో పాటు సురేష్ రైనాలకు ఆర్మీ ఛీప్ జనరల్ వీకే సింగ్ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ధోనీకి గౌరవ పురస్కారాన్ని స్వీకరించమని కోరగా అందుకు ఆయన అంగీకరించారని ఆర్మీ అధికారులు తెలిపారు. టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ ఆఫీసర్ హోదాను ప్రతిపాదన చేశామని అయితే ధోనికిచ్చే హోదాను ఇంకా నిర్ణయించలేదని వారు చెప్పారు. కాగా ఆర్మీ ఛీఫ్‌‌ను మర్యాదపూర్వకంగా కలిసినపుడు తన స్నేహితులు చాలా మంది ఆర్మీలో ఉన్నారని, తనకు ఆర్మీలో చేరటం చాలా ఇష్టమని ధోని అన్నాడు.

జగన్ కు గట్టి పోటీ ఎవరు?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై కడప లోక్ సభ స్థానంలో పోటీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. వరదరాజులు రెడ్డిని పోటీకి పెట్టాలని తొలుత అనుకున్నప్పటికీ డిఎల్ రవీంద్రా రెడ్డిని పోటీకి దింపితేనే జగన్‌ను దీటుగా ఎదుర్కోగలమని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కడప జిల్లా కాంగ్రెసు నాయకులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. వరద రాజులు రెడ్డితో పాటు జగన్‌పై పోటీ పెట్టేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నారు. కందుల రాజమోహన్ రెడ్డి పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది. కందుల రాజమోహన్ రెడ్డి జగన్‌పై గట్టి అభ్యర్థే అవుతారని భావిస్తున్నారు. కాగా, సమావేశం అనంతరం వీరశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడపలో, పులివెందులలో కాంగ్రెసు పార్టీదే విజయం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ను కాంగ్రెసు ఖచ్చితంగా ఎదుర్కొంటుందన్నారు. ఉప ఎన్నికలలో పోటీకి అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే తామంతా బలపరుస్తామని చెప్పారు. అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తి బరిలోకి దిగుతారని చెప్పారు. అధిష్టానం సూచించిన వ్యక్తికి తామంతా బాసటగా నిలబడి గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. జగన్‌పై పోటీకి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సరియైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే డిఎల్‌పై తాను ఒత్తిడి తీసుకు వస్తున్నట్టుగా చెప్పారు. తన పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారని, అయితే అధిష్టానం ఎవరిని సూచిస్తే వారు బరిలోకి దిగుతారని చెప్పారు.

లోక్‌పాల్ బిల్లును ఆమోదించాల్సిందే: హజారే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదించే వరకు తాను నిరాహార దీక్షను విరమించేది లేదని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో లోక్‌పాల్ బిల్లుపై తాను చర్చలు జరపాలని యోచించానని అయితే కేంద్రం అందుకు సానుకూలంగా లేదన్నారు. లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సానుకూలంగా స్పందించే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాడటం లేదన్నారు. తనకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. దేశం కోసం ఎంతవరకైనా పోరాడుతానని చెప్పారు. ముసాయిదా లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు. మేధావులు అందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా అన్నాహజారే చేపట్టిన దీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకుంది. పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు ఆయనకు మద్దతు తెలిపారు. విపక్షాలు సైతం ఆయనకు అండగా నిలబడ్డాయి. హజారే దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు దీక్షలు ప్రారంభించారు.

కిషన్‌ రెడ్డి నమ్మకం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ముందు ముందు బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గం శాసనసభ్యుడు గంగారపు కిషన్‌ రెడ్డి బుధవారం అన్నారు. బుధవారం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపికి త్వరలో మంచి రోజులు రానున్నాయని అన్నారు. 2014లో ఎన్డీయే జాతీయ రాజకీయాలను శాసిస్తుందని అన్నారు. పూర్తి అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెసు పార్టీని వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని, బిజెపికి పట్టం గడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు అవినీతిని ప్రజలముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో జన సంఘర్ష్ ర్యాలీలు ఈ రోజునుండి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.

'జగన్ ఆదేశిస్తే ఈ క్షణమే రాజీనామా'

ఒంగోలు: తమ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఈ క్షణమే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదేశం కోసమే తాము వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఆయన ఒంగోలులో మాట్లాడుతూ తనకు పదవులు ముఖ్యంకాదని, బంధుత్వాలే ప్రధానమన్నారు. పదవులు ఎపుడైనా వస్తుంటాయి... పోతుంటాయన్నారు. కానీ బంధుత్వాలు శాశ్వతమన్నారు. అందుకే జగన్‌ వెంట నడుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ స్వర్ణయుగ పాలనను తెచ్చేందుకు వైఎస్ఆర్ అభిమానులందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

బాబా ఆరోగ్యంపై అనుమానాలు

అనంతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యంపై అస్పష్టత తొలగిపోలేదు. ప్రశాంతి నిలయం ట్రస్ట్ నిర్వాహకులు చేష్టలపై భక్తులు తీవ్ర ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో బాబా ఆరోగ్యం బాగానే ఉన్నట్టు బుధవారం తాజాగా మరో వైద్య బులిటెన్‌ను డాక్టర్ సఫాయా విడుదల చేశారు. కిడ్నీలు కూడా పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుండగా, సత్యసాయి ఆస్పత్రిలో చేరి ఇప్పటికీ పది రోజులు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా ఆరోగ్యం బాగానే ఉందంటూ ఆస్పత్రి వైద్యులు చెపుతున్నారే గానీ ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించారు. ఇదిలావుండగా, బుధవారం ప్రశాంతి నిలయం వద్ద చర్యలు చూస్తుంటే భక్తులకు లేనిపోని సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు లారీల్లో పూలు తెప్పించారు. ప్రశాంతి నిలయం వద్ద ఎనిమిది వేల మంది పోలీసులను మొహరించారు. క్విక్ యాక్షన్ ఫోర్సులను రంగంలోకి దించారు. షామియానాలు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఏదో జరగరానిది జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సచిన్‌కు భారత రత్న!

మహారాష్ట్ర: ప్రపంచకప్‌ను గెలుపొందిన భారత క్రికెట్‌ జట్టును మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం అభినందించింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇచ్చి సత్కరించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అభినందన తెలుపుతూ, టెండూల్కర్‌కు భారత రత్న ప్రతిపాదన తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ ప్రవేశపెట్టగా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. 'క్రీడల్లో అత్యున్నత సేవలకుగాను టెండూల్కర్‌కు ఈ అవార్డును ప్రతిపాదిస్తున్నాను' అని చవాన్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రకటించారు. 28 సంవత్సరాల తర్వాత 121 కోట్ల మంది భారతీయుల కల సాకారమైందన్నారు. ప్రపంచకప్‌లో ఆడిన మహారాష్ట్ర క్రీడాకారులు టెండూల్కర్‌, జహీర్‌ ఖాన్‌కు ఒక్కొక్కరికీ కోటి రూపాయల నగదు బహుమతితో సత్కరించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇదేవిధంగా టీమ్‌ సిబ్బంది మయాంక్‌ పరేక్‌ (లాజిస్టిక్‌ మేనేజర్‌), రమేష్‌ మానే (మెజరర్‌)కు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రపంకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముంబయిలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు తోడ్పడిన పోలీసులు, ట్రాఫిక్‌ శాఖను కూడా ఆయన అభినందించారు. సభాపక్ష నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే మాట్లాడుతూ సచిన్‌ క్రికెట్‌కు 'దేవుడు' అంటూ అభివర్ణించారు.

కాంగ్రెస్ అభ్యర్ధులపై వీడిన సస్పెన్స్

కడప: కడప లోక్‌సభకు, పులివెందుల అసెంబ్లీ స్థానానికి బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలనేది కాంగ్రెసు అధిష్ఠానం స్థిర నిర్ణయం. అందుకే, కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిపై వరదరాజులు రెడ్డిని పోటీకి దింపాలని కాంగ్రెసు పార్టీ ఆలోచన చేస్తోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని కూడా వైయస్ జగన్‌పై పోటీకి పెట్టాలనే ఆలోచన సాగింది. అయితే, వరదరాజులు రెడ్డి వైపే కాంగ్రెసు నాయకత్వం మొగ్గు చూపింది. కాగా, పులివెందుల శాసనసభా నియోజక వర్గంలో వైయస్ విజయమ్మపై మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఆయన ఈ నెల 16వ తేదీన నామినేషన్ వేస్తారని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు కడప జిల్లా నేతలతో మంగళవారం రాత్రి సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. డీఎల్‌ రవీంద్రారెడ్డి, వరదరాజులరెడ్డి, తులసిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిల పేర్లపై చర్చ జరిగింది. చివరికి వరద పేరుపైనే ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఈ సమావేశంలో ఆయన లేకపోవడంతో బుధవారం ఆయనతో పాటు నేతలంతా మరోమారు భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అనూహ్య పరిస్థితుల్లో కందుల రాజమోహనరెడ్డి కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి అయినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు. వివేకా ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కడప లోక్‌సభ స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కడప, మైదుకూరు, పులివెందులకు ముగ్గురు మంత్రులు అహ్మదుల్లా, డీఎల్‌, వివేకాలు ప్రాతినిధ్యం వహిస్తుండడం కాంగ్రెస్‌కు కలిసివస్తోంది.

జగన్ వర్గ మంత్రుల పై సోనియాకు లేఖ

హైదరాబాద్: దివంగత నేత వైఎస్‌తో ఉప్పూ నిప్పుగా మెలిగిన సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి బాటలోనే.. ఇప్పుడు ఆయన తనయుడు, జూబ్లీహిల్స్ యువ ఎమ్మెల్యే పి.విష్ణు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాష్ట్ర మంత్రివర్గంలోనూ విధేయులు ఉన్నారని, వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ ఆయన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వైఎస్ పాలన అవినీతి మయంగా సాగిందని, సంక్షేమ పథకాల ముసుగులో దాన్నంతా మూసి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైఎస్ మరణానంతరం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సాగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, సంతకం కూడా చేయలేదని వివరించారు. కొణిజేటి రోశయ్యను సీఎంగా ఏనాడూ జగన్ గుర్తించలేదని .. ఆయనపై ఆధిపత్యం కోసం ప్రయత్నించారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో జగన్‌తో కొందరు పనిగట్టుకొని ప్రచారం చేయించారని పేర్కొన్నారు. ఈ విషయంలో కొందరు మంత్రులు సైతం పోటీ పడినా, జగన్ పర్యటించిన డివిజన్లలో ప్రయోజనం కన్పించలేదని వివరించారు. ఆ సమయంలో తన నియోజకవర్గంలో జగన్ పర్యటించకుండా నిరోధించానన్నారు. జగన్ వెళ్లిపోయినా.. ఆయన మద్దతుదారులైన మంత్రులు కొందరు పార్టీలోనే ఉన్నారని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహాటంగానే జగన్ వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెలిపారు. వారితో పాటు జగన్‌కు సానుభూతిపరులుగా ఉన్న మంత్రులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్‌వర్గ నేతల పట్ల సీఎం కిరణ్ కఠినంగానే ఉన్నప్పటికీ ..ఇంకా మరికొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో నేతలకు కొదవ లేదని, ఒకరు పోతే అంతకంటే బలమైన నాయకులు పుట్టుకొస్తారని తెలిపారు.

టీడీపీ పోరు వీరులు సిద్దం

కడప: ఉప సమరం వేడెక్కుతోంది. పోరు వీరులు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయింది. జగన్ ను అటు అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు దీటుగా కడప లోక్ సభ, పులివెందుల శాసనసభా నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్ సభ నుంచి పుత్తా నరసింహారెడ్డి, పులివెందుల నుంచి బిటెక్ రవిని పోటీకి దించాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో జరిగిన కడప జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. అయితే, అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థుల ఎంపికపై మంగళవారం మూడు గంటలపాటు తీవ్రంగా చర్చించారు. పార్టీ నేతలు మైసూరారెడ్డి, లింగారెడ్డి, సీఎం రమేష్‌, తదితరులతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. పులివెందుల నుంచి ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తన సోదరికి టిక్కెట్టు అడుగుతున్నారు. స్థానిక నేత ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి) పేరు మొదటినుంచి ప్రధానంగా పరిశీలనలో ఉంది. తమ కుటుంబానికి రెండు సీట్లు ఇస్తే పోటీకి సిద్ధమని, తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ టిక్కెట్టు హామీ ఇవ్వాలని కందుల సోదరులు ప్రయత్నించారు. శివానందరెడ్డి పులివెందుల అసెంబ్లీకి, రాజమోహనరెడ్డి కడప లోక్‌సభకు పోటీచేస్తారనేది ఆ ప్రతిపాదన. కందుల సోదరులతో చంద్రబాబు మంగళవారం రాత్రి విడిగా గంటసేపు చర్చించారు. రాజ్యసభ టిక్కెట్టు విషయంలో హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో కందుల సోదరులు అసంతృప్తిగా వెనుతిరిగారు. కందుల సోదరుల డిమాండ్ నేపథ్యంలో తలెత్తిన పరిణామంతో మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలలో ఒకరు అభ్యర్థి అయ్యే అవకాశముంది. మైసూరా తొలినుంచి పోటీకి విముఖంగా ఉన్నారు. పార్టీ తప్పదని ఆదేశిస్తే మాత్రం పోటీకి సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమోహనరెడ్డి కాకుంటే పుత్తా నరసింహారెడ్డే అభ్యర్థి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తప్ప మిగిలిన చోట్ల తెలుగుదేశం బలమైన పోటీనిచ్చింది. చంద్రబాబు ఏడు రోజలు పాటు కడప లోకసభ నియోజకవర్గంలో ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.

హరీష్‌రావుని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

హైదరాబాద్‌‌: సమైక్యరాష్ర్టం అంటూ చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పించారంటూ టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ఆరోపించడంపై టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్‌, ఎర్రబెల్లి దయాకరరావులు ఎన్టీఆర్‌ భవన్ లో వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఖండించారు. పంచాంగ కర్తలు వారి పంచాంగం చెప్పారని, అంతమాత్రన అది పార్టీ విధానం ఎలా అవుతుందా అని వారు ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ వద్దకు పంపకుండా తమ వద్దే పెట్టుకున్న టీఆర్‌ఎస్‌, తమపై నిందారోపణలు చేయడంలో అర్థం లేదన్నారు. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడింది ముగ్గురే అని ఇప్పటివరకు తెలుసని, కాని వీరితో పాటు కేసీఆర్‌ బంధువులైన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్ప డినట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్‌ ఆ ఆరుగురిపై ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేశాం, ప్రాణత్యాగాలకు సిద్ధం అంటూ ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజలు గెలిపించారని, మరి ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎట్లా అమ్ముడుపోయారని ప్రజలు అడుగుతు న్నారని వారు నిలదీశారు. హరీష్‌రావు ఇప్పటికైనా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలని వారు హితవు చెప్పారు.

3 రోజులే చిరు ప్రచారం

చెన్నై: ఇటీవలె తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాక అధినేత చిరంజీవి తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో మూడు రోజులు పాల్గొననున్నారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేస్తానని చెప్పిన తర్వాత కాంగ్రెసు పార్టీ జాతీయ నేతలు చిరంజీవిని తమిళనాడులో ప్రచారం చేయమని చెప్పిన అడిగిన విషయం తెలిసిందే. అందుకు చిరంజీవి కూడా సమ్మతించారు. ఎన్నికల ప్రచారానికంటే ముందుగానే పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసి కాంగ్రెసు నేతగా వెళ్లాలని అనుకున్నప్పటికీ విలీనం కాక పోవటంతో పిఆర్పీ అధినేతగానే వెళుతున్నారు. ఈ నెల 7నుండి 9వ తేది వరకు చిరు తమిళనాట కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తారు. మొదట ఎక్కువ రోజులు ఉంటుందనుకున్న ప్రచారం మూడు రోజులే ఉండటంతో చిరు ప్రచారం కేవలం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలకే పరిమితం కానుంది. ఇక 10వ తారీఖున చిరంజీవి పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

బాబా త్వరగా కోలుకోవాలి

చెన్నై: భగవాన్ సత్యసాయిబాబా ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెన్నై నగరానికి తాగునీరు అందించడానికి బాబా చేసిన కృషి అమోఘమని కరుణ అన్నారు. బాబా పరిస్థితి విషమంగా వుందన్న వార్తలు తనను కలిచివేశాయని ఆయన అన్నారు. లక్షలాది భక్తుల కోరికలు తీర్చడానికి బాబా త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నానని ఓ సందేశాన్ని బాబా కార్యదర్శి చక్రవర్తికి పంపారు.  కాగా, భగవాన్ సత్యసాయిబాబా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆశించారు. దేశంలో ఎవరికీ లేని గుర్తింపు బాబాకు లభించిందన్నారు. బాబా ఆరోగ్యం గురించి ఆయన భక్తులు ఆందోళన చెందుతున్నారన్నారు. బాబా పుట్టపర్తిలో పుట్టడం మన అదృష్టం అని బాబు వ్యాఖ్యానించారు. విద్య, వైద్యానికి ఎనలేని సేవ చేశారన్నారు. అనంతపురం జిల్లాతో పాటు మెదక్, మహబూబ్‌నగర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలకు బాబా స్వచ్చంధంగా నీరు అందించారన్నారు. తెలుగు గంగనుండి చెన్నై ప్రజలకు కూడా నీరు అందించాడరన్నారు. ఆయన ఆరోగ్యం బావుండాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ప్రార్థనలు చేస్తున్నారన్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా బాబా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న గదిలోకి ఎవరినీ అనుమతించడం లేదని అందుకే తాను వెళ్లడం లేదన్నారు. మరోవైపు, భగవాన్ సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ నటి జమున ఆందోళన వ్యక్తం చేశారు. బాబాను చూడాలని ఉందని ఆమె అన్నారు. సత్యసాయి ఆరోగ్యవంతుడై తమకు మళ్లీ దర్శనమిస్తాడనే నమ్మకముందని ఆమె చెప్పారు.