టీఆర్ఎస్‌లో వారసత్వ పోరు
హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలనంతరం జూన్‌లో కేంద్రం తెలంగాణపై ఏదో ఒక ప్రకటన చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో గులాబీ గడీలో వారసత్వ పోరు పుంజుకుంది. ఎప్పటికైనా కేసీఆర్ వారసుడు ఆయన కుటుంబం నుంచే వస్తారనేది బహిరంగ రహస్యం. ఆయన కుటుంబం నుంచి ప్రస్తుతం ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉన్న హరీశ్, కేటీఆర్, కవితలో ఎవరికి వారసత్వం దక్కుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వీధికెక్కనప్పటికీ, పార్టీలో హరీశ్-కేటీఆర్-కవిత మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. టీఆర్ఎస్ స్థాపించిన కొత్తలో కేసీఆర్.. "నేనూ.. నా భార్య మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారు. నాకు ఏ బాదరబందీలేదు. తెలంగాణ వచ్చే వరకు కొట్లాడుతా'' అని చెబుతుండేవారు. అప్పట్లో కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు ఆయనకు అన్నీ తానై వ్యవహరించేవారు.
2004 ఎన్నికల్లో టీఆర్ఎస్.. కాంగ్రెస్-వామపక్షాలతో పొత్తు పెట్టుకొని 26 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. సిద్ధిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్‌సభ స్థానాల నుంచి గెల్చిన కేసీఆర్.. సిద్ధిపేట స్థానానికి రాజీనామా చేశారు. అక్కడ హరీశ్‌ను నిలబెట్టి గెలిపించారు. తొలిసారి గెలిచిన హరీశ్‌కు మంత్రి పదవి ఇప్పించిన కేసీఆర్.. తన వారసుడు మేనల్లుడేనని చెప్పకనే చెప్పారు. దీంతో పార్టీ శ్రేణుల్లో హరీశ్ గట్టి పట్టు సాధించారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికతో హరీశ్‌కు పార్టీలో ఎదురుగాలి సన్నగా మొదలైంది. కేటీఆర్, కవిత రంగ ప్రవేశం చేసింది అప్పుడే! ప్రచారంలో పాల్గొన్న వారిద్దరికీ మంచి ఆదరణే లభించింది. వారు అమెరికాను వదిలి ఇక్కడే 'సెటిల్' కానున్నట్లు 2008 ఉప ఎన్నికలకు తేటతెల్లమైంది. 2006 కరీంనగర్ ఉప ఎన్నికలో హరీశ్‌దే హవా అయితే.. 2008 ఉప ఎన్నికలో కేటీఆర్ హవా. 2008లో పోలింగ్‌కు ముందు కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహణలో కేటీఆర్ వైఫల్యాన్ని హరీశ్ సామర్థ్యంతో పోల్చి మరీ కేసీఆర్ చివాట్లు పెట్టారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. అనామకుడైన హరీశ్‌రావు.. కేసీఆర్, పార్టీ పేరు వాడుకొని ఆర్థికంగా ఎదిగారని, ఇప్పుడు పెద్దవాడై తమపైనే పెత్తనం చేయ చూస్తున్నారనే భావన కేటీఆర్‌లో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతుంటారు.
టీఆర్ఎస్ఎల్పీ నేత ఎన్నిక సహా పార్టీ పదవులన్నింటిలోనూ హరీశ్, కేటీఆర్, కవిత వర్గాలు మొదలయ్యాయని చెబుతారు. ఆర్థిక లావాదేవీలూ హరీశ్, కేటీఆర్, కవిత మధ్య చిచ్చుకు కారణమంటుంటారు. హరీశ్ విషయంలో కేటీఆర్, కవిత ఒక్కటవుతారని ప్రచారం ఉంది. అలాగే.. కేటీఆర్‌కు, కవితకు మధ్య అంశాల వారీ వైరుధ్యాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవితకు రాజకీయాలెందుకనేది కేటీఆర్ అభిప్రాయమని సమాచారం. కేసీఆర్ కుటుంబం తనను కావాలని దూరం చేస్తుందనే భావనలో ఉన్న హరీశ్‌రావు తన దారి తాను చూసుకుంటున్నారని, జనంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండ్రిలాగే తన వాక్చాతుర్యంతో పార్టీపై పూర్తి పట్టు సాధించే పనిలో కేటీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసి.. 'తెలంగాణ కనిమొళి'గా గుర్తింపు పొందాలని ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో ముగ్గురి మధ్య ఆధిపత్య పోరులో చివరికి ఎవరిది పైచేయి? వారసత్వం ఎవరిది? ఇది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!