రాజీపడితే ఎన్నికలు వచ్చేవి కావు: జగన్

కడప : తమ నాన్న నేర్పిన నైతిక విలువలను వదిలేసి ఉంటే ఈరోజు ఉప ఎన్నికలు వచ్చేవి కావేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీతో రాజీ పడితే తనకు పెద్ద పదవులు వచ్చేవన్నారు. కానీ తాను రాజీపడకుండా ప్రజల పక్షాన నిలవడానికే నిర్ణయించుకున్నానని చెప్పారు. సచ్చీలత, విశ్వసనీయతను తాను పక్కనపెట్టి రాజీ పడుంటే తనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి సోనియా పక్కన కూర్చోబెట్టుకుని ఉండేవారన్నారు. వైఎస్‌ఆర్ పెంపకంలో రాజీపడటం తాను నేర్చుకోలేదని జగన్ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఒకప్పుడు ఇండియన్ కాంగ్రెస్‌లో ఇందిరా కాంగ్రెస్‌గా మారి, సోనియా వచ్చాక ఇటాలియన్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విలువలను వదిలేసుకుంటే తాను సోనియాకు బానిసలా బతకాల్సి వచ్చేందని జగన్ అన్నారు.

పీఏ పై చేయి చేసుకున్నశంకరరావు

విజయనగరం: చేనేత శాఖ మంత్రి శంకరరావుకు కోపం వచ్చింది. పీఏ సెల్ ఫోన్ మోగటంతో మంత్రి శంకరరావు అసహనం వ్యక్తం చేస్తూ అతని చెంప పగులగొట్టారు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. మంత్రి చర్యతో అధికారులు బిత్తరపోయారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పీఏకానీ, అధికారులు కానీ ఇష్టపడడం లేదు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంట్ స్థానానికి తాను పోటీ చేస్తానన్నా టిక్కెట్ ఇవ్వలేదని చేనేత శాఖ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తానైతే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు. ఈసారి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ఫోటోలతో ప్రచారం చేస్తామని మంత్రి శంకర్రావు తెలిపారు.

'పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వేటు తప్పదు'

హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు దేనికీ రెఫరెండం కాదని చెప్పారు. ఇన్ని రోజులు వేరు... ఇక ఉపేక్షించేది లేదని ఆయన శుక్రవారం ఇక్కడ అన్నారు. అవసరం అయితే వారిపై అనర్హత వేటు తప్పదని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ చేసిన అభివృద్ధి పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు. రెండు నియోజకవర్గాలలోని పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి అందరూ విశ్వాసంగా ఉండాలన్నారు. కాంగ్రెసు పార్టీ కొత్తవారికి గాలం వేస్తుందన్న వ్యాఖ్యలను డిఎస్ కొట్టి పారేశారు. కొత్తవారికి గాలాలు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైయస్ ప్రభావం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఉప ఎన్నికలలో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా పని చేయవద్దని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎవరూ పూనుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెసుకు ప్రజలు పట్టం గడతారని అన్నారు.

డీఎల్ కు సురేఖ సవాల్

కర్నూలు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు. కడప ఉప ఎన్నికల్లో రవీంద్రారెడ్డి వైఎస్‌ఆర్ ఫోటో లేకుండా సోనియా బొమ్మతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొండా సురేఖ సవాల్ చేశారు. డీఎల్ గెలిస్తే తాము జీవితంలో వైఎస్ పేరు ఎత్తమని ఆమె స్పష్టం చేశారు. ఇదిలావుండగా, కడప ఉప ఎన్నికల్లో తానూ కూడా ప్రచారంలో పాల్గొంటానని కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో డీఎల్ గెలుపు ఖాయమన్నారు. పు ఎన్నికల ప్రచారంలో వైఎస్ ప్రజలకు చేసిన మేలును గురించి చెప్పుకునే హక్కు కాంగ్రెస్ కె ఉందని జగన్ కాంగ్రెస్ లో ఉంటేనే ఆయనకు వైఎస్ పథకాల గురించి చెప్పుకునే హక్కు ఉంటుందని అన్నారు.

వంశధార ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా ముకుందాశర్మ

న్యూఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా జస్టిస్ ముకుందా శర్మను సుప్రీంకోర్టు నియమించింది. జులై 31లోగ ఈ ట్రిబ్యునల్ కు కావలసిన అన్ని సదుపాయాలను కల్పించాలని కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలను ఆదేశించింది. కార్యాలయం, సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించేందుకు వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో భాగంగా వంశధార నదిపై ఓ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోందని దీనివల్ల తమకు నష్టదాయకమని గతంలో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో వంశధార ట్రిబ్యునల్ ను ఏర్పాటుచేశారు.

కమిటీపై చట్టపరంగా ప్రకటన జారీ చేయలేం

న్యూఢిల్లీ : జన్ లోక్‌పాల్ బిల్లును రూపొందించేందుకు ఏర్పాటు చేయనున్న సంయుక్త కమిటీకి చట్టపరంగా నోటిఫికేషన్ విడుదల చేయటం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంయుక్త కమిటీపై చట్టపరంగా ప్రకటన జారీ చేయలేమని స్పష్టం చేశారు. అధికారికంగా లేఖ ఇస్తామని తెలిపారు. అయితే కమిటీలో మంత్రులు ఎవరూ ఉండరని, అందరూ అధికారులే ఉంటారన్నారు. అలాగే అన్నా హజారే సూచించన వ్యక్తినే సంయుక్త కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తామని కపిల్ సిబల్ తెలిపారు. ఈరోజు సాయంత్రం మరోసారి హజారే ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.

వైఎస్ కు తెలియకుండా జగన్ సెటిల్‌మెంట్లు

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వరదరాజులు రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ ప్రజా సేవకుడు కాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి తెలియకుండా భారిగా జగన్ సెటిల్‌మెంట్లు చేశారని అన్నారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యాపారం అని దుయ్యబట్టారు. జగన్‌కు ఆయన మేనమామ పోలికలు వచ్చాయన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని జగన్ వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలను ఎంత వరకైనా ఖర్చు పెట్టి గెలవాలని ఆయన ఆశిస్తున్నారని అన్నారు. అవినీతిపరుడు అయిన జగన్‌ను ప్రజలు గెలిపించరన్నారు. తన మద్దతు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికే ఉంటుందన్నారు. కడప, పులివెందులలో తప్పకుండా కాంగ్రెసు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీ జగన్ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి తమకు కాదని, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసుకు మధ్యే ఉంటుందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.

సోనియా చొరవతీసుకోవాలి

న్యూఢిల్లీ : తన శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ జన్ లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడతానని అన్నా హజారే స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సీబీఐ లాంటి సంస్థలు అవినీతిని నిరోధించటంలో విఫలం అయ్యాయన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి జైలు భరోకు అన్నాహజారే జాతికి పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడిన మంత్రలెవరైనా జైలుకు వెళ్లారా, ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఊచలు లెక్కించారా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌పాల్‌బిల్లు ఆమోదానికి చొరవ తీసుకోవాలని హజారే యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయనున్నారు. కాగా, హజారేకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజ సంఘాలు, విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే చిత్ర కథా నాయకుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్‌బాబు అన్నా హజారే దీక్షకు మద్దతుగా గురువారం సాయంత్రం తిరుపతిలో తమ పాఠశాల విద్యార్థులతో శాంతి ర్యాలీ చేపట్టనున్నట్టు చెప్పారు. ఇక నెక్లస్ రోడ్డులో పలు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రజా సంఘాలు అన్నాకు మద్దతు తెలుపుతున్నాయి. ఆయనకు మద్దతుగా శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీక్షలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా అన్నా దీక్షకు మద్దతు ప్రకటించారు. మేధాపట్కర్ హైదరాబాదులో జల విహార్ నుండి ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సత్తా ఆధ్వర్యంలో సామూహిక సత్యాగ్రహాలు చేపడుతున్నారు. కెబిఆర్ పార్కులో పలువురు వాకర్స్ గాంధీ టోపీలు ధరించి వాకౌట్ చేశారు. ఇక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పలువురు దీక్ష చేపట్టనున్నారు. కాగా అన్నాహజారేకు మద్దతు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా దీక్షలు, ర్యాలీలో పాల్గొన్న యువత కేవలం రాజకీయ నాయకులలో మార్పు కోరుకుంటే అది సాధ్యం కాదని, ప్రజలలో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. అవినీతి రాజకీయ నాయకులను మనమే అందలం ఎక్కిస్తున్నామని వారికి బుద్ది చెప్పాలని అన్నారు. అన్నాహజారే దీక్ష యావద్భారతాన్ని కదిలించిందన్నారు.

బాబుకు సిపిఐ, జగన్ కు సిపిఎం

హైదరాబాద్: కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు తెలిపే దిశగా సిపిఎం కదులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాటలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సిపిఎంకు, తెలుగుదేశం పార్టీకి మధ్య ఈ మధ్య కాలంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సిపిఎం క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతూ వచ్చింది. తాము జగన్‌కు మద్దతు ఇవ్వాలా, లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాఘవులు అప్పట్లో చెప్పారు. దీంతో సిపిఐ, సిపిఎం మధ్య మిత్రభేదం చోటు చేసుకుంది. కాగా, సిపిఐ మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. తాము ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి కె. నారాయణ చెప్పారు. సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినంత మాత్రాన తాము ఇవ్వాల్సిన అవసరం లేదని రాఘవులు ఖచ్చితంగానే చెప్పారు. వైయస్ జగన్‌పై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిపిఐ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, సిపిఎం మాత్రం తెలుగుదేశం పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో జగన్ వైపు చూస్తోందని అంటున్నారు.

పోతుల సురేష్ కు విముక్తి

హైదరాబాద్:  మద్దెలచెర్వు సూరి హత్యతో తనకు సంబంధం లేదని తెలుగుదేశం దివంగత శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సూరితో గానీ మరెవరితో గానీ తనకు వ్యక్తిగత కక్షలూ కార్పణ్యాలూ లేవని ఆయన అన్నారు. తాను ఫాక్షనిస్టును కానని, సామాజిక కార్యకర్తను మాత్రమేనని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన చెప్పారు. తన భార్య వావిలాల సునీత తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, తాను కూడా అదే పార్టీలో కొనసాగుతానని ఆయన అన్నారు. పోతుల సురేష్‌పై మూడు కేసులున్నాయి. వీటిలో బిఎస్ఎన్ఎల్ టెండర్ల వ్యవహారంలో కిడ్నాప్ కేసును కోర్టు కొట్టేసింది. ఓ హత్య కేసులో ఆయనకు విముక్తి లభించింది. మారణాయుధాలు కలిగి ఉన్నట్లు మోపిన కేసులో బెయిల్ లభించింది. దీంతో ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన పోతుల సురేష్‌కు అనుచరులు జైలు వద్ద స్వాగతం చెప్పారు.

ఇక చిత్రసీమను తాకిన సమ్మె సైరన్

హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమ మళ్లీ సమ్మెబాట పట్టనుంది. సినీ రంగంలోని 24 శాఖలకు చెందిన కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తామని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మెకు ఫెడరేషన్ పిలుపునిచ్చింది. గురువారం జరిగిన సమావేశంలో ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అనంతరం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘కార్మికుల జీత భత్యాలు, ఇంక్రిమెంట్లతో పాటు కొన్ని డిమాండ్లను గతంలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుంచాం. ఈ నెల 8 లోపు పరిష్కరించాలని గడువు విధించాం. అయినా దీనిపై వారు స్పందించలేదు. అందుకే సమ్మెకు ఉపక్రమించాం’ అన్నారు. కాగా సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న చాంబర్ సభ్యుల నిర్ణయాన్ని ఫెడరేషన్ తిరస్కరించింది. మన చాంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమలు జరగాలని పట్టుపట్టింది. సమ్మెలో 14 వేల మంది కార్మికులు పాల్గొంటారని ఫెడరేషన్ తెలిపింది. సోమవారంలోపు చలనచిత్ర వాణిజ్యమండలి స్పందించకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

బాబా కోలుకుంటున్నారు

పుట్టపర్తి:  సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఉదయం తాజా బులెటిన్ విడుదల అయ్యింది. బాబా క్రమంగా కోలుకుంటున్నారని వైద్యుడు సఫాయా తెలిపారు. కిడ్నిల పనితీరు మెరుగుపడిందని, డయాలసిస్ జరుగుతుందన్నారు. ఆయనకు నిరంతరం సీఆర్ఆర్ థెరపీ ద్వారా చికిత్స చేస్తుండడంతో ఇది సాధ్యమైందని తెలిపారు.వెంటిలేటర్ల ద్వారా శ్వాసను అందిస్తున్నట్లు వెల్లడించారు. రక్త ప్రసరణ, షుగర్ లెవెల్ సాధారణంగా ఉన్నట్లు సఫాయా పేర్కొన్నారు. ముఖ్యమైన అవయవాల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. బాబాకు డయాలసిస్ చేసే సమయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బాబా స్పృహలో మార్పు కనిపిస్తుందని చెప్పారు. ఐసీయూలో సత్యసాయికి చికిత్సలు చేస్తుండడంతో సందర్శకులను లోనికి అనుమతించలేదని బులెటిన్‌లో తెలిపారు. కాగా.. కొన్ని రోజులుగా ప్రశాంతి నిలయం బస్ స్టాండ్ నుంచి బస్సుల రాకపోకలను అనుమతించడం లేదు. గురువారం వాటిని పునరుద్ధరించారు. బాబా ఆరోగ్యం మెరుగైందన్న వార్తలు రావడంతో పుట్టపర్తిలో వ్యాపారులు మూసిన దుకాణాలను తెరిచారు.  

హజారే దీక్షకు దిగివచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: అన్నాహజారే ‘ఆమరణ’ యుద్ధం ఫలించింది. సంఘ సంస్కర్త నిరశన దీక్షకు కేంద్రం కంపించింది. ఢిల్లీలో మొదలైన ఉద్యమానికి గల్లీల నుంచీ మద్దతు పెల్లుబుకడంతో, తప్పని పరిస్థితుల్లో కేంద్రం దిగివచ్చింది. అవినీతి నిగ్గు తేల్చేందుకు మేమూ సిద్ధమేనంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఏ సర్కారు ‘లోక్‌పాల్’ను ‘జనలోక్‌పాల్’ చేద్దామంటూ అంగీకరించింది. జనలోక్‌పాల్ బిల్లుకు రూపకల్పన చేస్తామంటూ కేంద్రం అంగీకరించింది. అందుకు ప్రభుత్వ, ప్రజల ప్రతినిధులతో కూడిన ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అంగీకరించారు. జనలోక్‌పాల్ బిల్లు రూపకల్పన చేసే కమిటీలో ప్రభుత్వపక్షం నుంచి ఐదుగురు, ప్రజల పక్షం నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించేందుకు సైతం సంకీర్ణ సర్కారు పచ్చజెండా ఊపింది. అయితే కమిటీకి ఎవరు నాయకత్వం వహించాలి? కమిటీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలా? వద్దా? అన్న అంశాలపై ఇరుపక్షాల మధ్య తుది అంగీకారం కుదరాల్సి ఉంది. అన్నా హజారేకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మద్దతిచ్చారు. హజారే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకున్నారని, లోక్‌పాల్ బిల్లు సమస్యను పరిష్కరించాలని ఆమె పేర్కొన్నారు. హజారే దీక్షపై సోనియా గాంధీ సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా లోక్‌పాల్ బిల్లుతో పాటు అవినీతి నిర్మూలను బలమైన చట్టాలుండాలి. అప్పుడే సత్ఫలితాలు అందుతాయని సోనియా చెప్పారు. తమ డిమాండ్లు అన్నింటినీ అంగీకరించే వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని అన్నాహజారే ప్రకటించారు. మన్మోహన్‌సింగ్ తరఫున కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ కూడా అన్నాహజారే ప్రతినిధులు స్వామి అగ్నివేష్, అరవింద్ కజ్రేవాల్‌తో కమిటీ ఏర్పాటుపై సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు రెండు దఫాల చర్చలు జరిపిన అనంతరం, జనలోక్‌పాల్ బిల్లు తయారు చేసేందుకు సంయుక్త కమిటీ ఏర్పాటు చేయటంతోపాటు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిని ప్రతిపాదించే విధంగా ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కాగా, మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్న హజారేను వైద్యులు పరిశీలించారు. ఆయన బీపీ నార్మల్‌గా ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డీ హైడ్రేషన్‌లో హజారే ఉన్నారని వైద్యులు చెప్పారు.

కడప బరిలో డీఎల్!

హైదరాబాద్: కడప లోక్ సభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై కాంగ్రెసు అభ్యర్థిగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీకి దిగడం ఖాయమై పోయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో రవీంద్రా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కందుల సోదరులు పోటీకి విముఖత చూపడంతో కాంగ్రెస్‌ చివరకు డీఎల్‌ను ఖరారు చేయాల్సి వచ్చింది. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా మంత్రి పేరునే ప్రతిపాదించారు. చివరకు ఆయన పేరునే అధిష్ఠానం ఆమోదం కోసం పంపారు. శుక్రవారం డీఎల్‌ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తామని పార్టీవర్గాలు వెల్లడించాయి. మొదటి నుంచీ డీఎల్‌ పేరే చర్చల్లో ఉన్నా ఆయన సుముఖంగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న కందుల రాజమోహన్‌రెడ్డిని తీసుకొచ్చి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన విముఖత చూపడంతో సోదరుడు కందుల శివానందరెడ్డినైనా బరిలోకి దించాలనుకున్నారు. ఇందులో భాగంగానే డీఎల్‌ గురువారం కందుల సోదరులతో వారి నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయినా వారు అంగీకరించలేదు. దీంతో డీఎల్‌, మంత్రి అహ్మదుల్లా, ఆ పార్టీ జిల్లా నేతలు వీరశివారెడ్డి, వరదరాజులురెడ్డి, చెంగల్రాయుడు, రమేష్‌రెడ్డి ఇతర నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే డీఎల్‌ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

కాంగ్రెస్ లో ఆ కొరత లేదు

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ అయినందున అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం కావడం మామూలే అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఎన్.తులసీరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆలస్యం అవుతుందన్నారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించామని, అధిష్టానం ఆమోదం తెలిపిన తర్వాత పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప నుండి పోటీ చేయడానికే రాజీనామా చేశారు కాబట్టి ఆయన ముందుగా ప్రచారానికి వెళ్లారని  ఆయన చెప్పారు. ఆయన అభ్యర్థిత్వం ఎవరో ఆమోదించాల్సింది కాదన్నారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై తులసీరెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పత్రికలో కాంగ్రెసు పార్టీకి అభ్యర్థుల కొరత ఉందని, కడపలో పోటీ చేయడానికి కాంగ్రెసుకు అభ్యర్థులు కావాలంటూ పేర్కొన్నారని ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. సింహం జూలు విదిల్చిన చందంగా కాంగ్రెసు పార్టీలో కడప నుండి పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారన్నారు. అయితే ఎవరిని పోటీ చేయించాలో నిర్ణయించుకోవడానికి అధిష్టానం అనుమతి అవసరం ఉంటుందని చెప్పారు. మాకు అభ్యర్థుల కొరత లేదన్నారు. ఆ పత్రికలో వచ్చిన ఆల్ ఫ్రీపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ త్యాగధనుల పార్టీ అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాన మంత్రి పదవిని వదులుకున్న త్యాగధనురాలు అన్నారు. అలాంటి పార్టీలో ఎవరో వరాలు అడిగినట్టు, ఇవ్వాలన్నట్లు చెప్పడం అవాస్తవమన్నారు.

ఆ తర్వాతే నామినేషన్: వివేకా

కడప: మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదిస్తేనే పులివెందుల శాసనసభా స్థానానికి కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి నామినేషన్ వేస్తారనే మాట వినిపిస్తోంది. రాజీనామాను ఆమోదించిన తర్వాతనే వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల స్థానానికి వివేకానంద రెడ్డి నామినేషన్ వేస్తారని కడప జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు అశోక్ బాబు గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పులివెందుల నుంచి విజయం సాధించిన తర్వాత వివేకానంద రెడ్డి మంత్రి పదవి స్వీకరిస్తారని ఆయన అన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వివేకానంద రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రిగా కొనసాగుతూ పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. పులివెందులలో ఓడిపోతే మండలి పదవి ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తామని వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు నాయకత్వం హామీ ఇచ్చిందని, అందుకే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడం లేదని ఆయన అన్నారు.