'10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు'
posted on Apr 6, 2011 @ 4:14PM
హైదరాబాద్: ఏప్రిల్ 14 నుంచి 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ఆయా జిల్లాల ప్రత్యేక వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. పరేడ్ మైదానంలో 27న ఉద్యమ దశాబ్ది బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. జనలోక్ పాల్ బిల్లు కోసం అన్నాహజారే చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు తక్షణమే మిగిలిన రూ. 200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రైతులకు 7 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని, పెరిగిన విద్యుత్తు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పట్టాన గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన త్రాగునీటిని సరఫరా చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై రైల్వే శాఖ పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల క్షేమం కోసం ఈనెల 14 నుంచి 16 వరకు చండీయాగం చేస్తానని వివరించారు. బీబీనగర్ నిమ్స్ ను ప్రైవేటీకరణ చేస్తే ప్రతిఘటన ఎదురవుతుందని, కొనుగోలుదారులు నష్టపోతారని చెప్పారు.