సూర్యుడిని ఆపలేరు
కడప: ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని ఆమె అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముందు తన నియోజకవర్గంలో మెజార్టీతో గెలిచి, ఆ తరువాత మిగతావారి గురించి మాట్లాడాలని అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పేరు ఎత్తే అర్హత డిఎల్ కు లేదని ఆమె అన్నారు. డిఎల్‌కు దమ్ముంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మ తన ప్రచారంలో వాడుకోవద్దని చాలెంజ్ చేశారు. తాను సొంతగా గెలిచానంటున్న డిఎల్ వైయస్ ఫోటోను వాడవద్దన్నారు. వైయస్ ఫోటో డిఎల్ వాడితే తరిమి కొట్టాలని ఆమె కడప వోటర్లకు సూచించారు.
కాగా, డీఎల్ మాత్రం మైదుకూరు నియోజకవర్గంలో తాను వైఎస్ఆర్ ప్రాపకంతో గెలవలేదన్నారు. తన ప్రాపకంతోనే తాను గెలిచానన్నారు. ఆదివారం ఖాజీపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో ఆయన తెలుగుదేశం పార్టీని ఒక్క మాట కూడా అనలేదు.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేదల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చల్లబసాయిపల్లెలో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి, వైఎస్ఆర్ కు సోనియాకు, కడపకు, ఢిల్లీకి మధ్య జరిగే యుద్ధం అన్నారు. విశ్వసనీయతను పక్కన పెట్టితే తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదని అలా అయితే ఈ ఉప ఎన్నికలు వచ్చేవి కావన్నారు.