కిరణ్ కూ డీఎస్ కూ మధ్య వాదన
posted on Apr 6, 2011 @ 3:57PM
హైదరాబాద్: కడప లోక్ సభ అభ్యర్థి ఖరారు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. వీరిద్దరు బుధవారం ఉదయం కడప జిల్లా పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమావేశం సాయంత్రానికి వాయిదా పడింది. అయితే, అభ్యర్థి ఖరారు బాధ్యతను తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు అప్పగించామని కడప జిల్లాకు చెందిన పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోక్ సభ సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, తెలుగుదేశం నుంచి వచ్చిన వెంటనే కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని డి. శ్రీనివాస్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా కందుల అభ్యర్ధిత్వం కడప లోక్ సభ నుంచి ఖరారైనట్లే తెలుస్తోంది.