టీడీపీ పోరు వీరులు సిద్దం
posted on Apr 6, 2011 @ 9:45AM
కడప: ఉప సమరం వేడెక్కుతోంది. పోరు వీరులు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయింది. జగన్ ను అటు అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు దీటుగా కడప లోక్ సభ, పులివెందుల శాసనసభా నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్ సభ నుంచి పుత్తా నరసింహారెడ్డి, పులివెందుల నుంచి బిటెక్ రవిని పోటీకి దించాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో జరిగిన కడప జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. అయితే, అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థుల ఎంపికపై మంగళవారం మూడు గంటలపాటు తీవ్రంగా చర్చించారు. పార్టీ నేతలు మైసూరారెడ్డి, లింగారెడ్డి, సీఎం రమేష్, తదితరులతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. పులివెందుల నుంచి ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తన సోదరికి టిక్కెట్టు అడుగుతున్నారు. స్థానిక నేత ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్ రవి) పేరు మొదటినుంచి ప్రధానంగా పరిశీలనలో ఉంది. తమ కుటుంబానికి రెండు సీట్లు ఇస్తే పోటీకి సిద్ధమని, తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ టిక్కెట్టు హామీ ఇవ్వాలని కందుల సోదరులు ప్రయత్నించారు. శివానందరెడ్డి పులివెందుల అసెంబ్లీకి, రాజమోహనరెడ్డి కడప లోక్‌సభకు పోటీచేస్తారనేది ఆ ప్రతిపాదన. కందుల సోదరులతో చంద్రబాబు మంగళవారం రాత్రి విడిగా గంటసేపు చర్చించారు. రాజ్యసభ టిక్కెట్టు విషయంలో హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో కందుల సోదరులు అసంతృప్తిగా వెనుతిరిగారు. కందుల సోదరుల డిమాండ్ నేపథ్యంలో తలెత్తిన పరిణామంతో మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలలో ఒకరు అభ్యర్థి అయ్యే అవకాశముంది. మైసూరా తొలినుంచి పోటీకి విముఖంగా ఉన్నారు. పార్టీ తప్పదని ఆదేశిస్తే మాత్రం పోటీకి సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమోహనరెడ్డి కాకుంటే పుత్తా నరసింహారెడ్డే అభ్యర్థి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తప్ప మిగిలిన చోట్ల తెలుగుదేశం బలమైన పోటీనిచ్చింది. చంద్రబాబు ఏడు రోజలు పాటు కడప లోకసభ నియోజకవర్గంలో ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.