వివేకాను నిలదీస్తున్న ఓటర్లు

కడప: పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి గతంలో ఎన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కక్ష కట్టిన కాంగ్రెస్ అధిష్టానంతో చేతులు కలపి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తల్లిలాంటి వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మీపై ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించి స్థానికంగా పట్టుకోల్పోయారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అబ్బాయ్ ఛాన్స్ ఇచ్చినా కాదనీ తన అనుచరుడిని పోటీకి దింపి అభాసుపాలయ్యారు. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో పులివెందుల ప్రచారానికి వెళ్లిన ఆయనకు వింత పరిస్థితులే ఎదురవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒక దొరలా పూజించి గౌరవ మర్యాదలు ఇచ్చిన పులివెందుల నియోజకవర్గ ప్రజలే ఇపుడు ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. అంతేకాకుండా, చివరకు తన కుటుంబ సభ్యులు కూడా ఆయన వెన్నంటి రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన వెంట ఆయన సతీమణి, కుమార్తె మాత్రమే ఉండగా, మిగిలిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా జగన్ కే మద్దతు పలుకుతున్నారు. పైపెచ్చు.. నియోజకవర్గ ప్రజలు కూడా తల్లిలాంటి విజయమ్మపై పోటీ చేయడం తగునా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏమని సమాధానం చెప్పాలో వివేకాకు తెలియటంలేదు.

హజారేకు మద్దతుగా శాంతి ర్యాలీ

తిరుపతి: కేంద్ర ప్రభుత్వం అవినీతికి నిరసనగా మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారేకు ప్రముఖ సినీ హీరో, రాజకీయ నాయకుడు మోహన్‌బాబు తన మద్దతును ప్రకటించాడు. ప్రభుత్వాల అవినీతిపై అన్నా హజారే శాంతియుత యుద్ధం ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పేరుకు పోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడానికి హజారే వంటి మహానుభావులు ఉద్యమించాల్సిన రావడం విచారకరమన్నారు. ఆయన డిమాండ్లు కేంద్రం వెంటనే పరిష్కరించాలని మోహన్‌బాబు అన్నారు. ఆయన ప్రధాన డిమాండ్ అయిన లోక్ జన్‌పాల్ బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని ఆయన అన్నారు. కాగా అన్నా హజారే నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

రతన్ వారసుడిని అన్వేషించలేం

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాకు వారసుడి అన్వేషణ ప్రయత్నాలు ఫలించలేదు. రతన్ స్థానంలో పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తిని అన్వేషించేందుకు నియమించిన ఎంపిక కమిటీ ఎనిమిది నెలల తర్వాత ఈ విషయంలో చేతుతెత్తేసింది. రతన్ వారసుడిని అన్వేషించలేమనే నిశ్చితాభిప్రాయానికి తాము వచ్చినట్లు కమిటీలో సభ్యుడైన టాటా సన్స్ డెరైక్టర్ ఆర్.కె.కృష్ణ కుమార్ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్... గతేడాది ఆగస్టులో ఐదుగురు సభ్యులతో కూడిన ఎంపిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది డిసెంబర్‌లో 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న రతన్ టాటా రిటైర్‌కానుండడంతో ఆయన వారసుడి కోసం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, రతన్ టాటాపై ప్రసంశల జల్లు కురిపించిన కుమార్... 71 బిలియన్ డాలర్ల టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడ్ని అన్వేషించేందుకు అనువుగా ఎంపిక కమిటీ తన ప్రమాణాలను తగ్గించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ‘రతన్ సహజసిద్ధమైన నాయకుడు. ఆయన ప్రతి అడుగులో ఈ విషయాన్ని చూడొచ్చు. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో ఆయనకు తప్పక స్థానం దక్కుతుంది. అటువంటి వ్యక్తి స్థానాన్ని భర్తీ చేసేందుకు కొన్ని ఎంపిక విధానాలను మార్చుకోవాల్సి రావచ్చు. విదేశీయులతో సహా గ్రూప్ వెలుపలి వ్యక్తులపైనా ఇప్పుడు దృష్టిసారిస్తున్నాం. ఈ విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ త్వరలోనే ఒక నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నాం’ అని కుమార్ పేర్కొన్నారు.

మూడోరోజుకు అన్నాహజారే దీక్ష

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ప్రముఖ సంఘసంస్కర్త అన్నాహజారే ప్రారంభించిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. దీక్ష స్థలికి జనం భారీగా తరలివస్తున్నారు. మరోవైపు అన్నాహజారే దీక్షకు దేశవ్యాప్తంగా పలు పార్టీలు, స్వచ్చంద సేవ సంస్థలు మద్దతు పలికాయి. పశ్చిమ బెంగాల్ లోని ఐఐటీ విద్యార్థులు హజారేకు మద్దతుగా దీక్షలకు దిగారు. నిన్న దీక్షకు మద్దతు పలకడానికి వచ్చిన హర్యానా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఓం ప్రకాష్ చౌతాలా, ఉమాభారతిలకు చేదు అనుభవం ఎదురైంది. వీరిని వేదిక వద్దకు రాకుండా ఉద్యమకారులు అడ్డుకున్నారు. తనను చంపేస్తామన్న బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తనకు దేశం, ప్రజలు ముఖ్యమని చెప్పారు. దేశాన్ని ఏలుతున్న ప్రభుత్వాలు అవినీతితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతి తదితర అంశాలపై కేంద్రంతో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ప్రజలు తనకు ఇచ్చిన మద్దతు శక్తిని ఇచ్చిందని అన్నారు. అవినీతి నిర్మూలనకే తాను నడుం బిగించానని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏమైనా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వారం రోజుల పాటు తనకు ఏమీ కాదని చెప్పారు. తాను కొంత నీరసంగా ఉన్నప్పటికీ దీక్షను మాత్రం ఆపే ప్రసక్తి లేదన్నారు. దీక్షను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. లోక్‌జన్‌పాల్ బిల్లుపై కేంద్రం దిగి వచ్చే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు.

కాంగ్రెస్ కు కడప లో అభ్యర్థులు కరవు

హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేడున్నర సంవత్సరాలు మినహా అధికారాన్ని ఏకబిగిన అనుభవించిన పార్టీ అది. రాష్ట్ర, జాతీయ స్ధాయి నాయకులకు కొదువ లేదు. మంత్రుల డాంబికాలకు, మాటల రాయుళ్లకు కరవు అసలే లేదు. అయినా.. ఒక జిల్లా.. ఒకే ఒక్క జిల్లా. ఆ జిల్లా నుంచి టికెట్‌ ఇస్తామంటే తీసుకునే దమ్మున్న నాయకులకే కరవొచ్చి పడింది. కడపకు.. పరాయి పార్టీ నాయకుడే దిక్కయిన దుస్థితి. ఇది రాష్ట్ర-కేంద్రంలో తిష్ఠవేసిన అధికార కాంగ్రెస్‌ పార్టీ స్థితి. కడపలో నెలకొన్న దుస్థితి. కడప పార్లమెంటుకు అభ్యర్ధి దొరకక కాంగ్రెస్‌ పార్టీ సతమతమవుతోంది. కడప జిల్లాలో ప్రతిపక్షమనేది లేకుండా ఎదురులేకుండా పాలించిన ఆ జిల్లాకు ఇప్పుడు జగన్‌పై పోటీ చేసే దమ్మున్న నేత భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. జగన్‌ను ఢీ కొడతారన్న అంచనాతో మూడు శాఖలను ఒకటి చేసి డీఎల్‌ రవీంద్రారెడ్డికి కట్టబెట్టినా ఆయన తాను కడప బరిలో దిగనని వెనక్కితగ్గారు. ఒకసారి అసెంబ్లీ, మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన తాను మూడోసారి ఓడేందుకు సిద్ధంగా లేనని వరదరాజులురెడ్డి కూడా చేతులెత్తేశారు. ఇక గత్యంతరం లేని కాంగ్రెస్‌ నాయకత్వం.. బుధవారం వరకూ తెలుగుదేశంలోనే కొనసాగిన కందుల రాజమోహన్‌రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. 1994 ఎన్నికల్లో వైఎస్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించి, అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిన కందుల ఒక్కడే జగన్‌పై పోటీకి మొనగాడని కాంగ్రెస్‌ నాయకులు కూడా తేల్చేశారు. అయితే, కందుల బుధవారం కూడా కాంగ్రెస్‌లో చేరలేదు. పైగా..తనను అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్‌ రెండూ అడుగుతున్నాయని తన ప్రాధాన్యత, తనకున్న గిరాకీని చెప్పకనే చెప్పుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్ధి ఎంపికపై చర్చకు కూర్చున్న సీఎం కిరణ్‌, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌, మంత్రులు, అగ్రనేతలంతా కందుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. కానీ కందుల జాడ మాత్రం కనిపించలేదు.

కాస్త గడ్డుగానే బాబా ఆరోగ్యం

అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం ఇప్పటికీ కాస్త క్లిష్టంగానే ఉందని నిమ్స్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సఫయా గురువారం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యంపై రోజుకు రెండుమార్లు బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం బాబా ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని బులెటిన్‌లో చెప్పారు. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ బయో కెమిస్ట్రీ నార్మల‌్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బాబాకు వెంటిలెటర్‌తోనే కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని చెప్పారు. బాబాకు డయాలసిస్ చేసే సమయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బాబా స్పృహలో మార్పు కనిపిస్తుందని చెప్పారు.

తప్పుకున్న పవార్

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు అన్నా హజారే తనపై తీవ్రమైన విమర్శలు చేపట్టిన నేపథ్యంలో అవినీతిపై ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూపునుంచి తనను తప్పిస్తే ఎంతో సంతోషిస్తానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. తనని మంత్రుల బృందం నుంచి తప్పించాలని ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్'ని శరద్ పవార్ కోరారు. హజారే మీపై చేసిన విమర్శలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు పవార్ ఈ విమర్శలను తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అవినీతిపై ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూపుతో సహా అన్ని మంత్రుల గ్రూపులనుంచి తనను తప్పిస్తే ఎంతో సంతోషిస్తానని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్ బిల్లును రూపొందించడంలో సభ్య సమాజానికి వారికి కూడా పాత్ర కల్పించాలని హజారే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌పాల్ బిల్లుపై ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూపులోని కొంతమంది సభ్యులపై తనకు నమ్మకం లేదన్న హజారే, మహారాష్ట్రలో పలు భూకుంభకోణాలతో సంబంధం ఉన్న శరద్ పవార్, బలహీనమైన లోక్‌పాల్ ముసాయిదా బిల్లును రూపొందించిన వీరప్ప మొయిలీ, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఎలాంటి అవినీతీ జరగలేదని చెప్తున్న కపిల్ సిబల్ లాంటి వాళ్లు ఈ మంత్రుల గ్రూపులో సభ్యులుగా ఉన్నారని, అలాంటప్పుడు వాళ్లను ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

రాయపాటిని వరించనున్న టిటిడి చైర్మన్‌ పదవి

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్‌గా కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావును నియమించే అవకాశాలున్నాయి. ఆయన అధ్యక్షతన కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఆదికేశవులునాయుడు పాలకమండలి పదవీకాలం గత ఏడాది ఆగస్టు 24తో ముగిసింది. అప్పట్లో పాలకమండలి వ్యవహారాలపై వివాదం నెలకొనటంతో ప్రభుత్వం కొత్తమండలిని ఏర్పాటు చేయకుండా ఐఏఎస్‌ అధికారులతో కూడిన స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. రాయపాటి సాంబశివ రావు తనకు ఏ విధమైన పదవి దక్కకపోవడం పట్ల చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు ఆ పదవి ఇచ్చే అవకాశం వుంది.

మీడియాపై బాబా మేనల్లుడు సీరియస్

అనంతపురం: మీడియాపై భగవాన్ సత్యసాయిబాబా మేనల్లుడు శ్రవణ్ కుమార్ బుధవారం చిందులు తొక్కారు. మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తుందంటూ సీరియస్ అయ్యారు. సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్టులో వివాదాలు ఉన్నాయంటూ మీడియా అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. బాబా ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మీడియాకు విజువల్సు ఎందుకు విడుదల చేయడం లేదో డాక్టర్లనే అడగమని ఆయన చెప్పారు. కాగా మీడియా ప్రతినిధులతో డాక్టర్లు సఫయా, రవిరాజ్‌లు మాట్లాడారు. బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ రవిరాజ్ చెప్పారు. బాబా ప్రస్తుతం పేస్ మేకర్‌పై ఉన్నారన్నారు. వెంటిలెటర్ల వల్ల బాబా ఊపిరితిత్తుల ద్వారా ఇతర అవయవాలకు నీరు చేరిందని అన్నారు. చికిత్సకు బాబా స్పందిస్తున్నారని అన్నారు. బాబాలో యూరిన్ అవుట్ తక్కువగా ఉందన్నారు. ఆయన గుండె నిమిషానికి 80 సార్లు కొట్టుకుంటుందని చెప్పారు. సోడియం సాధారణ స్థితిలో ఉందన్నారు. బాబాకు పెట్టిన అన్ని వైద్య పరికరాలు ఇప్పుడు తొలగించే పరిస్థితి లేదన్నారు. అన్నీ ప్రస్తుతానికి ఉపయోగపడేవే అని చెప్పారు. బాబా ఆరోగ్యం ఇప్పుడు బావుందని డాక్టర్ సఫయా అన్నారు. బాబా స్థాపించిన సత్యసాయి వైద్యశాలలో ఆయనే చేరుతారని ఊహించలేదని ఆవేదనతో చెప్పారు. బాబాకు అన్ని రకాల వైద్యసేవలు, పరీక్షలు నిర్వహించామని చెప్పారు. బిపి తగ్గి సామాన్య స్థితికి వస్తుందన్నారు. బెంగుళూరుకు చెందిన వైద్యులతే చికిత్స చేయిస్తున్నామని అన్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని అన్నారు.  బాబా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

జయకు మద్దతుగా విజయశాంతి ప్రచారం

చెన్నై: అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు మద్దతుగా సినీ నటి, టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి శ్రీరంగం నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు బుధవారం ప్రకటించాయి. అన్నాడీఎంకేకి మద్దతుగా కోయంబత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార సభలో పాల్గొనగా ఆయన బాటలోనే విజయశాంతి కూడా ప్రచారం చేయనున్నారు. గురువారం ఉదయం తిరుచ్చి చేరుకోనున్న విజయశాంతి అక్కడి ఛత్రం బస్టాండ్ సమీపంలో తన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు తిరుచ్చిలో పలుచోట్ల పర్యటిస్తారు. శుక్రవారం జయలలిత పోటీ చేస్తున్న శ్రీరంగం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు...

జగన్‌కు చుక్కెదురు

న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో బుధవారం మళ్లీ చుక్కెదురయింది. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్‌ను కేటాయించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ జగన్‌ పార్టీకి చెందిన కొందరు సుప్రీంకోర్టును రెండోసారి ఆశ్రయించారు. అయితే దీనిని పరిశీలించిన సుప్రీం కామన్ సింబల్ కేటాయించాల్సిందిగా తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించమని తేల్చి చెప్పింది. పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని సూచించగలమని చెప్పింది. అయితే పార్టీకి కామన్ సింబల్ కేటాయించడంలో తుది నిర్ణయం మాత్రం ఈసీదేనని చెప్పింది. రెండోసారి కూడా తమకు కోర్టులో చుక్కెదురు కావడంతో జగన్ వర్గం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

రాహుల్‌ కు సుప్రీం నోటిసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటిసులను జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో తనకు 50 లక్షల రూపాయల జరిమానా అలహాబాద్ కోర్టు విధించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్యెల్యే, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు కిశోర్ సమ్రితే దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. ఓ యువతితోపాటు వారి తల్లితండ్రులను నిర్భందించారంటూ రాహుల్ గాంధీపై కిశోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్‌పై అలహాబాద్ కోర్టు కొట్టివేసింది. అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ వెల్లడించిన తీర్పులో కిశోర్ పై 50 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు వెల్లడించిన తీర్పును సవాల్ చేస్తూ కిశోర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హజారేకు బాలీవుడ్ మద్దతు

న్యూఢిల్లీ: అవినీతిపై పోరాటం సాధిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారేకు బాలీవుడ్ ప్రముఖుల మద్దతు లభిస్తోంది. జన లోకపాల్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టిన హజారేకు బాలీవుడ్‌లోని అనుపమ్ ఖేర్, శేఖర్‌కపూర్, రాహుల్‌బోస్, దియామీర్జా, జూహీచావ్లా, పురబ్ కోహ్లీ, మధుర్‌బండార్కర్, ప్రీతీష్ నందిలాంటి ప్రముఖులు మద్దతు తెలిపారు. హాజారేకు తన పూర్తి మద్దతుందని శేఖర్ కపూర్ అన్నారు. అవినీతి నిర్మూలించేందుకు పార్లమెంట్‌లో జాతీయ చర్చ జరుగాలని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటీష్‌వారిపై మహాత్ముడు సాగించిన పోరాటం లాగా హజారే వ్యవస్థ మీద ప్రజా యుద్దం చేయాలని కోరారు. 72 ఏళ్ల వ్యక్తి ఆమరణ దీక్ష చేపట్టి మనల్ని ఉత్తేజ పరచడం గొప్ప విషయమని, సాధారణ ప్రజలందరూ హజారేకు బాసటగా నిలువాలని ప్రీతీష్ నంది అన్నారు. హజారేకు మద్దతు తెలిపి భారత్‌ను కూడా మరో ఈజిప్టులా మార్చాలని మధుర్‌బండార్కర్ అన్నారు.

ట్రస్టుపై ప్రభుత్వ జోక్యం వుండదు

హైదరాబాద్: సత్యసాయి ట్రస్ట్ వ్యవహారాల్లో ప్రభుత్వం ఎంతమాత్రమూ జోక్యం చేసుకోదని మంత్రి రఘువీరారెడ్డి బుధవారం చెప్పారు. ట్రస్టును ప్రభుత్వం ఆదీనం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. అవన్నీ అవాస్తవమైన ఆరోపణలు అని చెప్పారు. ట్రస్టు వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న వార్తలను ఆయన ఖండించారు. ట్రస్టు స్వాధీనం ప్రయత్నంలో భాగంగా ఎవరినీ అక్కడకు పంపించలేదన్నారు. భగవాన్ సత్యసాయి ఆరోగ్యం కోసం అక్కడి వైద్యులకు సాయం అందించే ఉద్దేశ్యంతో హెల్త్ సెక్రటరీ రమేష్‌ను సహాయకుడిగా పంపించామని చెప్పారు. ఐఏఎస్ సుబ్రహ్మణ్యంను కూడా అక్కడ ట్రస్టు వారికి సహాయ సహకారాలు అందించడానికి పంపించామని చెప్పారు.

జగన్ కు అసంతృప్తుల బెడద

కడప: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అసంతృప్తుల బెడద తగిలింది. ఆదిలోనే జగన్‌కు ఈ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో జగన్ మద్దతుదారుడు అయిన ఎంపీపీ కొండారెడ్డి జగన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. జగన్ వర్గంలో ఉన్న కొండారెడ్డి కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. జగన్‌కు గట్టి మద్దతుదారుడు అయిన ఆదినారాయణరెడ్డి నియోజకవర్గం జమ్మలమడుగు. ఆ నియోజకవర్గంలో దాదాపు అందరూ జగన్ వెంటే ఉండే అవకాశం ఉంది. అయితే ఎంపీపీ కొండారెడ్డి కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపించడంతో జగన్ వర్గంలో ఆందోళన నెలకొంది. పలువురు టిడిపి నేతలతో కలిసి ఆయన కాంగ్రెసులో చేరనున్నట్టుగా తెలుస్తోంది.

సినీనటి సుజాత కన్నుమూత

చెన్నై: కుటుంబ కథా చిత్రాలతో తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న నటి సుజాత చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో పైగా నటించారు. ఆమె నట జీవితంలో ఎక్కువగా కమల్ హసన్‌తో నటించారు. సుజాత 10 డిసెంబర్ 1952 రోజున శ్రీలంకలో జన్మించారు. 2006 సంవత్సరంలో విడుదలైన శ్రీరామదాసు చిత్రంలో సుజాత చివరిసారిగా తెరపై కనిపించింది. గోరింటాకు, ఏడంతస్తుల మేడ, నీకునేను నాకు నువ్వు, విలన్, బాబా, తప్పు చేసి పప్పు కూడు, పెళ్లి, సూరిగాడు, చంటి, సూత్రదారులు, అగ్నిగుండం, అనుబంధం, ఎమ్యెల్యే ఏడుకొండలు, సీతాదేవి, సర్కస్ రాముడు, గుప్పెడు మనసు, ప్రేమతరంగాలు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం ఏక్ హీ బూల్‌లో కూడా సుజాత నటించారు. తమిళంలో కాదలన్ మీంగల్, అన్నాకిలి, అవల్ ఓరు థోడర్ కథై, ఎర్నాకులం జంక్షన్, వాజుతుత కట్టుకిరెన్ చిత్రాల్లో నటించారు.