జగన్ వర్గ మంత్రుల పై సోనియాకు లేఖ
posted on Apr 6, 2011 @ 9:54AM
హైదరాబాద్: దివంగత నేత వైఎస్‌తో ఉప్పూ నిప్పుగా మెలిగిన సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి బాటలోనే.. ఇప్పుడు ఆయన తనయుడు, జూబ్లీహిల్స్ యువ ఎమ్మెల్యే పి.విష్ణు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాష్ట్ర మంత్రివర్గంలోనూ విధేయులు ఉన్నారని, వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ ఆయన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వైఎస్ పాలన అవినీతి మయంగా సాగిందని, సంక్షేమ పథకాల ముసుగులో దాన్నంతా మూసి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైఎస్ మరణానంతరం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సాగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, సంతకం కూడా చేయలేదని వివరించారు. కొణిజేటి రోశయ్యను సీఎంగా ఏనాడూ జగన్ గుర్తించలేదని .. ఆయనపై ఆధిపత్యం కోసం ప్రయత్నించారన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో జగన్‌తో కొందరు పనిగట్టుకొని ప్రచారం చేయించారని పేర్కొన్నారు. ఈ విషయంలో కొందరు మంత్రులు సైతం పోటీ పడినా, జగన్ పర్యటించిన డివిజన్లలో ప్రయోజనం కన్పించలేదని వివరించారు. ఆ సమయంలో తన నియోజకవర్గంలో జగన్ పర్యటించకుండా నిరోధించానన్నారు. జగన్ వెళ్లిపోయినా.. ఆయన మద్దతుదారులైన మంత్రులు కొందరు పార్టీలోనే ఉన్నారని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహాటంగానే జగన్ వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెలిపారు. వారితో పాటు జగన్‌కు సానుభూతిపరులుగా ఉన్న మంత్రులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్‌వర్గ నేతల పట్ల సీఎం కిరణ్ కఠినంగానే ఉన్నప్పటికీ ..ఇంకా మరికొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో నేతలకు కొదవ లేదని, ఒకరు పోతే అంతకంటే బలమైన నాయకులు పుట్టుకొస్తారని తెలిపారు.