జగన్ కు గట్టి పోటీ ఎవరు?
posted on Apr 6, 2011 @ 12:26PM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై కడప లోక్ సభ స్థానంలో పోటీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. వరదరాజులు రెడ్డిని పోటీకి పెట్టాలని తొలుత అనుకున్నప్పటికీ డిఎల్ రవీంద్రా రెడ్డిని పోటీకి దింపితేనే జగన్‌ను దీటుగా ఎదుర్కోగలమని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కడప జిల్లా కాంగ్రెసు నాయకులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. వరద రాజులు రెడ్డితో పాటు జగన్‌పై పోటీ పెట్టేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నారు. కందుల రాజమోహన్ రెడ్డి పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది. కందుల రాజమోహన్ రెడ్డి జగన్‌పై గట్టి అభ్యర్థే అవుతారని భావిస్తున్నారు.
కాగా, సమావేశం అనంతరం వీరశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడపలో, పులివెందులలో కాంగ్రెసు పార్టీదే విజయం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ను కాంగ్రెసు ఖచ్చితంగా ఎదుర్కొంటుందన్నారు. ఉప ఎన్నికలలో పోటీకి అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే తామంతా బలపరుస్తామని చెప్పారు. అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తి బరిలోకి దిగుతారని చెప్పారు. అధిష్టానం సూచించిన వ్యక్తికి తామంతా బాసటగా నిలబడి గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. జగన్‌పై పోటీకి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సరియైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే డిఎల్‌పై తాను ఒత్తిడి తీసుకు వస్తున్నట్టుగా చెప్పారు. తన పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారని, అయితే అధిష్టానం ఎవరిని సూచిస్తే వారు బరిలోకి దిగుతారని చెప్పారు.