బాబా త్వరగా కోలుకోవాలి
posted on Apr 6, 2011 9:17AM
చెన్నై: భగవాన్ సత్యసాయిబాబా ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెన్నై నగరానికి తాగునీరు అందించడానికి బాబా చేసిన కృషి అమోఘమని కరుణ అన్నారు. బాబా పరిస్థితి విషమంగా వుందన్న వార్తలు తనను కలిచివేశాయని ఆయన అన్నారు. లక్షలాది భక్తుల కోరికలు తీర్చడానికి బాబా త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నానని ఓ సందేశాన్ని బాబా కార్యదర్శి చక్రవర్తికి పంపారు.
కాగా, భగవాన్ సత్యసాయిబాబా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆశించారు. దేశంలో ఎవరికీ లేని గుర్తింపు బాబాకు లభించిందన్నారు. బాబా ఆరోగ్యం గురించి ఆయన భక్తులు ఆందోళన చెందుతున్నారన్నారు. బాబా పుట్టపర్తిలో పుట్టడం మన అదృష్టం అని బాబు వ్యాఖ్యానించారు. విద్య, వైద్యానికి ఎనలేని సేవ చేశారన్నారు. అనంతపురం జిల్లాతో పాటు మెదక్, మహబూబ్‌నగర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలకు బాబా స్వచ్చంధంగా నీరు అందించారన్నారు. తెలుగు గంగనుండి చెన్నై ప్రజలకు కూడా నీరు అందించాడరన్నారు. ఆయన ఆరోగ్యం బావుండాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ప్రార్థనలు చేస్తున్నారన్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా బాబా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న గదిలోకి ఎవరినీ అనుమతించడం లేదని అందుకే తాను వెళ్లడం లేదన్నారు.
మరోవైపు, భగవాన్ సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ నటి జమున ఆందోళన వ్యక్తం చేశారు. బాబాను చూడాలని ఉందని ఆమె అన్నారు. సత్యసాయి ఆరోగ్యవంతుడై తమకు మళ్లీ దర్శనమిస్తాడనే నమ్మకముందని ఆమె చెప్పారు.