ఎన్నికల ప్రచారంలో సోనియాపై మండిపడ్డ జగన్
posted on Apr 6, 2011 @ 1:41PM
కడప: కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానానికి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అధికార అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఆయన జమ్మలమడుగు నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మీరు వేసే ప్రతి ఓటు భవిష్యత్తు రాజకీయాల్లో కీలక మార్పునకు నాంది పలుకుతుందని జగన్ ప్రచారంలో పేర్కొన్నారు. ఉప ఎన్నికల కోసం జగన్ తల్లి విజయమ్మ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె తన నియోజకవర్గం పులివెందులలో ప్రచారం ప్రారంభించారు. లింగాల మండలంలోని పార్నపల్లెలో ఆమె ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రచారానికి ముందు గ్రామంలోని ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయమ్మకు తోడుగా కూతురు షర్మిళ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తొండూరు మండలంలో జగన్ సతీమణి భారతి ప్రచారం ప్రారంభించారు. పులివెందుల నుండి విజయమ్మను, కడప స్థానం నుండి జగన్‌ను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారానికి ముందు జగన్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.