వివేకానే వైఎస్ కు వారసుడు: డీఎస్
posted on Apr 15, 2011 @ 11:11AM
హైదరాబాద్: వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ డి. శ్రీనివాస్ అన్నారు. వైఎస్ వారసుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డియే అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్‌కు అంత పేరు వచ్చిందన్నారు. అందువల్ల పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ ఆశయసాధన కోసం పాటుపడుతున్న వివేకానంద రెడ్డే నిజమైన వారసుడన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో కలిసి పాల్గొంటానని చెప్పారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మంత్రులు ఉప ఎన్నికలలో పాల్గొని ప్రచారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగిన వారిగా ఆ పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో తాము వైఎస్ బొమ్మను ఖచ్చితంగా పెట్టుకుంటామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆస్థి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తనకు విభేదాలు లేవన్నారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. జగన్ వర్గంలో చేరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.