ఇక ఉమ్మడి ఉద్యమం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మళ్లీ ఉమ్మడి రాజకీయ వేదిక సిద్ధమవుతోంది. వేర్వేరు కుంపట్ల కంటే, ఉమ్మడి ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న నిర్ణయాలు బలపడుతున్నాయి. ఇందుకోసం ఉమ్మడి రాజకీయ వేదిక ఎక్కేందుకు కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం మే 10 వరకూ గడువు కోరిందని, అప్పటి వరకూ వేచిచూసి, జూన్ మొదటివారంలో రాజీనామాలకైనా మేము సిద్ధమేనంటూ కాంగ్రెస్ నేతలు చేసిన సూచనకు మిగిలిన పార్టీలూ సరేనన్నాయి. కాంగ్రెస్ నేతల సూచన తమకు అంగీకారమేనంటూ తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రధాన పార్టీల మధ్య కుదిరిన సయోధ్యకు టిఆర్‌ఎస్ సైతం అంగీకరిస్తూనే, ఉమ్మడి నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఉమ్మడి పోరాటం నిర్ణయానికి హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ నిర్వహించిన సమావేశం వేదికైంది. తెలంగాణ సాధన ఉద్యమానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ నేతృత్వం వహించకుండా, చుక్క రామయ్యలాంటి పెద్దల నేతృత్వంలో పదిమందితో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేది అంగీకరించబోమని, ఇప్పటికే తమ పార్టీ ఎంపీలమంతా రాజీనామా లేఖలను అధిష్ఠానానికి అందజేశామని కేశవరావు, మధుయాష్కి వెల్లడించారు. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున మే 10 వరకూ ఆగాలని ఆధిష్ఠానం కోరిందన్నారు. మే పది వరకే కాదు, అదనంగా మరో 20 రోజులైనా ఆగుతాం, జూన్ ఒకటి వరకు తెలంగాణపై నిర్ణయం తీసుకోనట్టయితే, రాజీనామాలను ఆమోదించాలని కోరామని మధుయాష్కి వివరించారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరే రాజీనామాలు చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్న నమ్మకం లేదని, తమతోపాటు తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేద్దామని కేశవరావు సూచించారు. ఆ ప్రతిపాదనకు టిడిపి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి అంగీకరించారు.