నేరపూరిత శక్తుల్లో భయం
posted on Apr 15, 2011 @ 11:02AM
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా సమగ్ర లోక్‌పాల్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, అపఖ్యాతి పాలుచేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, నేరపూరిత శక్తులు యత్నిస్తున్నాయని సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆందోళన వ్యక్తం చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం మొదలైన ఉద్యమంపై సామాన్య ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని గుర్తు చేశారు. దీన్ని చూసి కొన్ని రాజకీయ పార్టీలు, నేరపూరిత శక్తుల్లో భయం పట్టుకుందన్నారు. ఈ ప్రజాఉద్యమంపై అపోహలు, సందిగ్ధం సృష్టించేందుకు, అపఖ్యాతి పాలుచేసేందుకు వారు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలపై హజారే స్పందిస్తూ.. దేశంలోని రాజకీయ నేతలందరూ అవినీతిపరులేనని తానెప్పుడూ వ్యాఖ్యానించలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో నానాటికీ హెచ్చుమీరి పోతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. తమ పరిధిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా స్పందించని నేతలు ఒకరకంగా అవినీతికి మద్దతు పలుకుతున్నట్లే కదా అని నిలదీశారు. ఎన్నికల్లో నల్లధనం ఏరులై పారుతోందని, అధికారాన్ని చేపట్టేందుకు ఆ సొమ్మును ఎర వేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లు నిజాయితీగా వ్యవహరించటం లేదని, అవినీతిపరులని హజారే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై హజారే స్పందిస్తూ ఓటర్ల వ్యక్తిత్వంపై మచ్చ పడటానికి రాజకీయ నేతలు, పార్టీలే కారణమని దుయ్యబట్టారు.