చండీయాగంపై విమర్శల వెల్లువ
posted on Apr 15, 2011 @ 10:09AM
హైదరాబాద్ : తీవ్ర విమర్శల మధ్య టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఆధ్వర్యంలో శత చండీయాగాన్ని ప్రారంభించారు. తమది సెక్యులర్ పార్టీ అని చెప్పుకొనే టీఆర్ఎస్ చీఫ్ స్వయంగా ఈ యాగాన్ని నిర్వహిస్తుండడం వివాదాస్పదంగా మారింది. యాగాలు నిర్వహించడం టీఆర్ఎస్ చీఫ్‌కు కొత్త కాకపోయినా.. ఉద్యమ ఉద్ధృతి సమయంలోనూ గతంలో మాదిరిగా ఆయన యాగానికి పూనుకోవడాన్ని తెలంగాణ ఉద్యమ శక్తుల్లోని లౌకికవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలకు శుభం కలగాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ ఈనెల 14, 15, 16 తేదీల్లో చండీయాగం నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై వివిధ దళిత, బహుజన సంఘాలు ఘాటుగా స్పందించాయి. ప్రత్యేకించి అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ చండీయాగాన్ని ప్రారంభించడాన్ని వేలెత్తిచూపుతున్నాయి.
"చండీయాగం వల్ల కేసీఆర్‌కు మేలు కలుగుతుందో లేదో తెలియదు. కానీ, తెలంగాణ మాత్రం రాదు'' అని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ కుండబద్దలు కొట్టారు. "పోరాటాలతోనే తెలంగాణ సాధ్యం. చండీయాగం పేరిట కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు'' అని తెలంగాణకే చెందిన వివిధ ప్రజా సంఘాలు తీవ్రమైన ఆరోపణలు చేయడమేకాక, గన్‌పార్క్ వద్ద ఆందోళన కూడా నిర్వహించాయి. ఇదే బాటలో టీడీపీ, సీపీఐ నేతలూ ఉన్నారు. "యాగాలతో తెలంగాణ రాదు. మూఢాల్లో యాగాన్ని చేసేవారిని ఈయన్నే చూశాం. దీంతో ఎవరికి మూడుతుందో ఆయనకే తెలియాలి. యాగం చేస్తే తెలంగాణ వస్తుందంటే.. పదేళ్ల క్రితమే చేసేవాళ్లం కదా? సీపీఐ నారాయణ మాట్లాడుతూ "యాగాల వల్ల తెలంగాణ వస్తే టీఆర్ఎస్ ఎందుకు?'' అని ప్రశ్నించారు. యాగాలతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు భూస్థాపితమైతేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. చంద్రశేఖర రావు అగ్నిగుండం నుంచి యాగాల వరకు వచ్చారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని కెసిఆర్ విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు.