జగన్‌పై ఉండవల్లి నిప్పులు
posted on Apr 15, 2011 @ 9:48AM
హైదరాబాద్ : "దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డిని పొగిడితే నీకు ఎందుకంత కోపం? కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్‌ను పొగడకూడదా? నీ పార్టీలో ఉంటేనే వైఎస్‌ను ప్రశంసించాలా? నీ నైజం నాకు అర్థం కావడం లేదు. వైఎస్‌ను తిట్టిన నేతలపై ప్రత్యేక కథనాలు ఉండవు. కానీ.. నేను వైఎస్‌ను ప్రశంసిస్తే మాత్రం.. ఊసరవెల్లి ఉండవల్లి అంటూ నీ 'సాక్షి' మీడియాలో కథనాలు గుప్పిస్తావా? వైఎస్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. నీ కథనాలకు నేను సంజాయిషీ ఇచ్చుకోవడం కాదు.. నా ప్రశ్నలకు నువ్వే సమాధానాలు చెప్పు'' అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డిపై.. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. మంత్రి వట్టి వసంతకుమార్‌తో కలిసి మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. 'నా వద్ద నీ అంత ధనం లేకపోవచ్చు. నీలా వ్యాపార సమర్థతా నాకు లేకపోవచ్చు. కాని.. రాజకీయంగా నిన్ను ఎదుర్కొనే సత్తా మాత్రం నాకు ఉంది' అంటూ జగన్‌పై ఉండవల్లి ఫైర్ అయ్యారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికి మంత్రి పదవి వస్తే.. జగన్ భరించలేకపోయారని ఉండవల్లి దుయ్యబట్టారు. 'నువ్వు ముఖ్యమంత్రివి కావడం కోసం.. పాపం అనవసరంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మను రోడ్డెక్కించావు. ఎర్రని ఎండలో ఆమెను తిప్పుతున్నావు. వైఎస్ మృతి అనంతరం ఆయన గుర్తుగా విజయమ్మ శాసనసభలో సభ్యురాలిగా ఉండాలని పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా గెలిపిస్తే.. నువ్వు ఆమె చేత కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేలా చేశావు.
నీకు ఒక కోరిక ఉండొచ్చు. అందుకోసం.. నువ్వు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వరకు సరే. కాని మధ్యలో నీ తల్లి విజయమ్మను ఎందుకు ఈ విధంగా రొడ్డెక్కించాలి?' అని జగన్‌పై విరుచుకుపడ్డారు. వైఎస్ లాంటి మహా నేత అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే సహజంగా నాలాంటి అభిమానికి.. నిజంగానే ప్రమాదం జరిగిందా? లేక ఏదైనా కుట్ర ఉందా? అనే సందేహాలు వస్తాయి. అయితే.. దీనిపై తరచి విశ్లేషిస్తే ప్రమాదకరమైన క్యుములోనింబస్ మేఘాల కారణంగా హెలికాప్టర్ కుప్పకూలిందని గ్రహించాను. దానితో సంతృప్తి చెందాను. కానీ.. వైఎస్ కుమారుడిగా.. ఒక ఎంపీగా నువ్వెందుకు ఒక్కనాడు కూడా దీనిపై లోక్‌సభలో ప్రస్తావించలేదు? ప్రమాదంపై సందేహాలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు? కుమారుడిగా వైఎస్ మరణంపై సందేహాలు వ్యక్తం చేయాల్సిన బాధ్యత నీకు లేదా?' అని జగన్‌ను ఉండవల్లి ప్రశ్నించారు.