బందీగా ఉన్న సత్యసాయిబాబా?
posted on Apr 15, 2011 @ 10:33AM
హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయిబాబాపై ఓ తెలుగు దినపత్రిక సంచలనాత్మక వార్తాకథనాన్ని ప్రచురించింది. సత్య సాయిబాబా బందీ అయ్యారని, సహాయకులు ఆయనను చెర పట్టారని, భగవాన్ మానసిక వేదనతో కృంగిపోతున్నారని వ్యాఖ్యానించింది. సత్యజిత్ అనే సహాయకుడు బాబాను మోసం చేశాడని ఆరోపించింది. ఆరు నెలలుగా బాబా మాట్లాడడం లేదని, ఆప్తులను కూడా బాబా చెంతకు రానివ్వడం లేదని చెప్పింది. ఐసియులో వైద్యం తెలియని వ్యక్తి ఉన్నాడని చెబుతోంది. సత్యసాయిబాబాను గత నెల 28వ తేదీన ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి సత్యజిత్ కనిపించడం లేదని తెలిపింది. సత్య సాయిబాబాకు సత్యజిత్ శౌరి అనే వ్యక్తితో కలిసి గంజిలో నిద్రమాత్రలు వేసి ఎవరికీ తెలియకుండా తాగిస్తూ వచ్చారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాము సంపాదించినట్లు ఆ పత్రిక చెప్పుకుంది. సత్యజిత్ అనే అల్పజీవి సాక్షాత్తూ సత్యసాయినే గుప్పిట్లోకి తీసుకున్నాడని ఆరోపించింది.
సత్య సాయిబాబాను ఎలా మోసం చేశారనే విషయాలను బయట పెట్టిన శ్యాంసుందర్ లేఖను తాము సంపాదించినట్లు తెలిపింది. శ్యాంసుందర్ లేఖలోని అంశాలను కూడా పత్రిక క్రోడీకరించింది. గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖం పక్షవాతంతో బాధపడడం చూస్తున్నానని, ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా, దాని గురించి ఎవరూ మాట్లాడరని, వారికి అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చునని శ్యాంసుందర్ తన లేఖలో రాసినట్లు పత్రిక వివరించింది. సత్య సాయిబాబాకు సత్యజిత్ ఒక్కరొక్కరినే దూరం చేస్తూ వచ్చాడని, పూర్తిగా బాబా తనపైనే ఆధారపడేలా చేసుకున్నాడని, బాబా మాటలను పట్టించుకోకుండా తన ఇష్టప్రకారం సత్యజిత్ చేస్తూ వచ్చాడని, బాబా కార్యకలాపాలను సత్యజిత్ నిర్ణయించేవాడని, భక్తుల దర్శనానికి కూడా సరిగా తీసుకుని వచ్చేవాడు కాదని ఆ పత్రిక ప్రచురించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆరు నెలలుగా బాబా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారట. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత బాబాను చూడడానికి వెళ్లిన మంత్రి గీతా రెడ్డికి లోపల నడుస్తున్న వ్యవహారమంతా తెలిసిందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.