గాలి జనార్దన్ రెడ్డి పై కిషన్ ఆగ్రహం
posted on Apr 15, 2011 @ 10:17AM
హైదరాబాద్: తమ పార్టీ నేత, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కడప పార్లమెంటు లోక్ సభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌ను బలపరచడమే ఆ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో తాము వైయస్ జగన్ అవినీతిపై ఆరోపణలు చేస్తుంటే గాలి జనార్దన్ రెడ్డి మద్దతు పలకడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు సమాచరాం. గాలి జనార్దన్ రెడ్డిపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైయస్ జగన్‌తో ఆయనకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని అంటారు. కడప లోక్ సభ స్థానంలో గానీ, పులివెందుల శాసనసభా స్థానంలో గానీ పోటీ చేసే విషయాన్ని బిజెపి ఇప్పటి వరకు తేల్చలేదు. కడపలో పోటీకి దిగాలా, వద్దా అనే విషయంపై రాష్ట్ర పార్టీ నాయకులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పోటీకి దిగి పరువు పోగొట్టుకోవడం కన్నా దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే, గాలి జనార్దన్ రెడ్డికి కళ్లెం వేయడం ఎలా అనే విషయంపై కిషన్ రెడ్డి సీనియర్ నాయకులతో తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.