బాబా ఆరోగ్యంపై ఆదికేశవులు సంచలన వ్యాఖ్యలు
posted on Apr 15, 2011 @ 1:21PM
చిత్తూరు: సత్యసాయి బాబా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ డి.ఆదికేశవులు నాయుడు చెప్పారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్నిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్యంపై ఆదికేశవులు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాబా వద్ద ఉన్న అయ్యర్ వైద్యుడు కాడని, అతను సత్యజిత్ స్నేహితుడని, సత్య సాయిబాబా వద్ద వైద్యులే లేరని ఆయన అన్నారు. సత్య సాయిబాబాకు విదేశాల్లో వైద్యం చేయించవచ్చునని ఆయన అన్నారు. సత్య సాయిబాబాకు ఆహారం, వైద్యం అందిస్తే తప్ప కోలుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ వల్లే బాబాకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. బాబా అనారోగ్యంగా ఉంటే ఎలాంటి చికిత్స చేయించలేదన్నారు. మూడు నెలలుగా సరిగా అన్న పానీయాలు పెట్టడం లేదన్నారు. ఆరు నెలలుగా బాబాను ఎవరూ దర్శించుకోకుండా సత్యజిత్ ఆయన స్నేహితుడు డాక్టర్ అయ్యర్‌లు అడ్డుకున్నారని ఆరోపించారు. బాబా ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వానికి, ప్రశాంతి నిలయ ట్రస్టుకు వాస్తవ పరిస్థితులు తెలుసన్నారు. రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, రఘువీరా రెడ్డిలు ఇప్పటికైనా నిజాలు వెల్లడించాలన్నారు. పూర్తి వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే బాగుండదని ఇంత కాలం తాను మౌనంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. రత్నాకర్ వంటి వారు వాస్తవాలను భక్తులకు వివరించాలని ఆదికేశవులు నాయుడు డిమాండ్ చేశారు.