జగన్ కోటలో కాంగ్రెస్ పాగా
posted on Apr 15, 2011 @ 4:00PM
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కి కడప లోక్ సభ నియోజకవర్గంలో పెట్టని కోటల్లా ఉన్న ప్రాంతాల్లో రిగ్గింగ్ నిరోధానికి కాంగ్రెసు నాయకత్వం తగిన ప్రణాళికను రచిస్తోంది. జగన్ కోటలో కాంగ్రెస్ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. కడప లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు డజను మందికి పైగా మంత్రులను ఇంచార్జీలుగా వేసిన కాంగ్రెసు నాయకత్వం ఇప్పుడు స్థానిక నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. జగన్‌తోనూ ఇతర పార్టీలతోనూ ఉన్న స్థానిక నాయకులను తన వైపు తిప్పుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. జమ్మలమడుగు, బద్వేలు, కడప శాసనసభా స్థానాల పరిధిలోని స్థానిక నాయకులపై కాంగ్రెసు దృష్టి పెట్టింది.
2009 ఎన్నికల్లో జగన్ విజయానికి సహకరించినవారిని బుజ్జగిస్తోంది. తమ పార్టీ ఏ మాత్రం లేని ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఇతర పార్టీలు పోలింగ్ అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి తెగదెంపులు చేసుకున్న తర్వాత స్థానిక కాంగ్రెసు నాయకులు ఆయన వైపు వెళ్లారు. దాంతో వారిని తిరిగి కాంగ్రెసులోకి తేవడానికి కాంగ్రెసు పార్టీ నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో కొంతమందిని తన వైపు తిప్పుకోగలిగింది. జమ్మలమడుగు శాసనసభ స్థానానికి జగన్ వర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గంలోని చాలా మంది స్థానిక నాయకులను తమ వైపు తిప్పుకోగలిగామని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.