రాహుల్ తో అమూల్ కు కలిసొచ్చింది
posted on Apr 15, 2011 @ 11:14AM
అహ్మదాబాద్: కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతానందన్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మధ్య నెలకొన్న ప్రచార వాగ్భాణాలు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకు కలిసి వచ్చినట్లుగా ఉంది. కురువృద్ధుడు అయిన కేరళ ముఖ్యమంత్రి, యువకుడు అయిన రాహుల్ గాంధీ ఇద్దరూ అమూల్ బేబీలే అంటూ ఆ కంపెనీ తన తాజా ప్రకటనలో పేర్కొంది. వారిద్దరూ అమూల్ బేబీలే అంటూ ఓ కార్టూన్ వేసి ప్రకటన చేసింది. కార్టూన్ వేసి కింద అమూల్ వృద్ధులకు, యువకులకోసం అంటూ రాసి అందరినీ ఆకట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ వయసును ఉద్దేశించి మాట్లాడారు. 87 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడంపై రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి స్పందించిన అచ్యుతానందన్ రాహుల్ గాంధీ అమూల్ బేబీ అని, నలభై ఏళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అచ్యుతానందన్ అమూల్ బేబీ అనడంతో గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీ దానిని తన ప్రచారానికి వినియోగించుకుంది. వారి వ్యాఖ్యలతో ఆ కంపెనీ ఆనందంలో తేలియాడుతోంది. వారి వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా తమకు మరింత ప్రచారం జరిగిందని సంబరపడుతోంది.